ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్‌లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది.
కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్‌ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్‌ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్‌లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్‌ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక)
Comments
Please login to add a commentAdd a comment