లిబియాలో అగ్ని కీలలు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో ఓ చమురు డిపోలో లేచిన మంటలు అదుపులోకి రాలేదు. వీటిని ఆర్పడానికి అగ్నిమాపక దళాలు నిరంతరాయంగా కృషి చేసిన ఫలితం దక్కలేదు. నీటి నిల్వలు కూడా అడుగంటాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను రోడ్డు, వాయు మార్గంలో తరలించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో గత రెండు వారాలుగా తీవ్రవాదులు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రిపోలీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న చమురు డిపోపై ఆదివారం రాకెట్ పడడంతో మంటలు తలెత్తాయి. 60లక్షల లీటర్ల చమురు ఇక్కడ నిల్వ ఉండడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఆవరణలోనే ఉన్న 9 కోట్ల లీటర్ల సహజవాయువు కేంద్రానికి కూడా మంటలు వ్యాపిస్తాయేమోననే ఆందోళనలో అధికారులు ఉన్నారు. లిబియాలో జరుగుతున్న హింసలో 97 మంది మృతి చెందారు.
భారతీయులకు హెచ్చరిక: హింస నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని... ఘర్షణాత్మక ప్రాంతా ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది.