చంపండి.. కానీ సింపుల్గా!
మోసుల్: ఒంటరి తోడేళ్ల(లోన్ ఊల్ఫ్స్)ను మరింత కర్కశంగా తయారుచేసే క్రమంలో ఐసిస్ కొత్త పంథాకు తెరతీసింది. ఇన్నాళ్లూ భారీ దాడులకు పాల్పడింది చాలని, ఇకపై అతిసాధారణ దాడులతో నరమేథం సృష్టించాలని పశ్చిమదేశాల్లోని తన జిహాదీలను ఆదేశించింది. 'విశ్వాసం లేని వాళ్లను చంపడంలో రాజీ పడొద్దు. కానీ ఆ పనిని హడావిడిగా కాకుండా సాధ్యమైనంత సింపుల్ గా, సమర్థవంతంగా చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదిరితే అక్కడే వీలైనంత మేర రక్తపాతం సృష్టించండి. ఒకవేళ మీరు బయట తిరగలేని పరిస్థితుల్లో ఇళ్లల్లోకి దూరిమరీ కాల్పులు జరపండి. అంతేగానీ, భారీ స్కెచ్లు, హంగామా అదీ చెయ్యకండి' అంటూ ఐసిస్ తన అధికారిక పత్రిక 'దబీఖ్' ద్వారా సందేశం ఇచ్చింది.
ప్రస్తుతం సిరియాలో ఉన్న ఓ అమెరికన్ జిహాదీ రాసినట్లుగా భావిస్తోన్న ఈ సందేశంలో.. 'మన స్థావరానికి (ఇరాక్-సిరియాకు) బయలేదేరే క్రమంలో మీకు అడ్డువచ్చిన ఎవ్వర్నీ వదిలిపెట్టొద్దు. ఒకవేళ మీరు ఇక్కడికి(సిరియాకు) రాలేకపోతే అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే అక్కడికక్కడే విద్రోహులను చంపే అవకాశం లభిస్తుందిమీకు!' అనే ఆదేశాలు కూడా ఉన్నాయి. పశ్చిమదేశాలైన ఫ్రాన్స్, బ్రెసెల్స్, టర్కీ, జర్మనీలతోపాటు అమెరికాలోని ఓర్లాండోలోనూ భారీ నరమేథానికి పాల్పడ్డవారు స్థానిక జిహాదీలేనన్న సంగతి తెలిసిందే. కాగా, ఐసిస్ తదుపరి టార్గెట్ లండన్ నగరమేనని కొద్ది రోజులుగా వార్తలు వినిపించడం, ఇప్పుడా ఉగ్రవాద సంస్థ తన జిహాదీలకు ఆదేశాలు జారీచేయడం బ్రిటన్ ను కలవరపాటుకు గురిచేస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం లండన్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 600 మంది ప్రత్యేక సాయుధ బలగాలను మోహరించింది.