సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది.
చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.
మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్‌లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్‌మెంట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంది.
న్యాక్‌లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment