వీసీలుగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు
Published Tue, Jul 26 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
తెలంగాణ యూనివర్సిటీకి సాంబయ్య
అంబేద్కర్ ఓపెన్‌కు సీతారామారావు
జిల్లా నుంచి వీసీలుగా నియామకమైన ముగ్గురు ప్రొఫెసర్లు
కేయూ క్యాంపస్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా అవకాశం కల్పించింది. ఇప్పటికే నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్‌హుస్సేన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ పి. సాంబయ్యను, హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1992లో కేయూలో సాంబయ్య నియామకం
వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాకతీయ యూనివర్సిటీలోనే పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1984లో హన్మ కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 1992లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. అలాగే యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా, బీఓఎస్‌గా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్‌గా పనిచేసి గత ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సాంబయ్య సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా కూడా మెదిలారు. ఈ క్రమంలో వీసీల నియామకాల్లో సామాజిక వర్గాల సమీకరణలో ఎస్సీ మాదిగ నుంచి ప్రభుత్వం సాంబయ్యకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయనను నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీతారామారావును వరించిన అవకాశం
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సీతారామారావు నియామకమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపెల్లికి చెందిన సీతారామారావు హన్మకొండలోని గోపాలపురంలో స్థిరపడ్డారు. ఆయన కేయూలోనే ఎంఏ, ఎం ఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1978–1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1987–1995లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కేయూ లో పనిచేశారు. అనంతరం 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీతారామారావు 2011లో కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ డైరెక్టర్‌గా, 2002లో ఎస్‌డీఎల్‌సీఈ జాయింట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా, కేయూ లైబ్రరీ ఇన్‌చార్జిగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతితోపాటు పలు పదవులు చేపట్టారు. దివంగత ప్రొఫెసర్లు కొత్తపెల్లి జయశంకర్, బియ్యాల జనార్ధన్‌రావు, బుర్ర రాములుతో కలిసి పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేయూ నుంచి కీలకపాత్ర పోషించారు. వీసీ నియామకం కోసం కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నంలో సీతారామారావు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా జిల్లా నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు వీసీలుగా బాధ్యతలు కట్టబెట్టారు.
Advertisement
Advertisement