
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అధ్యాపకులు ఘర్షణకు దిగారు. విద్యార్థుల ఎదుటే హోదాలను మరిచి పరస్పరం చేయి చేసుకున్నారు. వసంతోత్సవ వేడుకల సాక్షిగా విద్యా ర్థుల మధ్య ఘర్షణ చెలరేగి కత్తులతో దాడులు చేసుకున్న ఘటన మరవక ముందే ఈ సారి అధ్యాపకులు దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. పరీక్షల నిర్వహణ వద్ద పాఠాలు చెప్పే తీరుపై వాగ్వాదం చెలరేగి ఈ గొడవకు దారితీసింది. రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు వైవా పరీక్షలను మెకానికల్ ప్రొఫెసర్ సాయి శ్రీనాథ్ మంగళవారం నిర్వహిస్తున్నారు.
ఈ వైవా టెస్ట్‌ను పరిశీలించేందుకు మెకానికల్ విభాగాధిపతి బంగారు బాబు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా వైవాకు హాజరైన విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వీటికి విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఇప్పటివరకు.. వీరికి నువ్వు ఏం నేర్పించావ్’అంటూ విద్యార్థుల ఎదుటæ శ్రీనాథ్‌ను బంగారుబాబు ప్రశ్నించాడు. దీనికి ప్రతిగా ‘విద్యార్ధులు సరిగానే సమాధానం ఇచ్చారు కదా’అని శ్రీనాథ్ సమాధానం ఇచ్చాడు. దీనిపై ఇరువురి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలి సింది. ఇద్దరు అధ్యాపకుల మధ్య జరుగుతున్న గొడవను చూసి అక్కడున్న పీహెచ్‌డీ స్కాలర్లు అవాక్కయ్యారు.
కేసు.. కాంప్రమైజ్
విద్యార్థుల ఎదుటే పరస్పరం దాడులు చేసు కున్న బంగారుబాబు, సాయి శ్రీనాథ్‌లు అక్కడి నుంచే గొడవ జరిగిన విషయాన్ని కాజీపేట పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఇంతలో విషయం బయటకు తెలియడంతో ఇతర అధ్యా పకులు అక్కడికి వచ్చారు. గొడవ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళితే నిట్ ప్రతిష్టకు మచ్చ అంటూ ఇద్దరు అధ్యాపకులకు సర్ది చెప్పారు. జరిగిన ఘటనపై నిట్‌లోనే అంతర్గత విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, నిట్‌లో మెకానిక్ హెడ్, ప్రొఫెసర్ గొడవపై తమకు సమాచారం అందించారు తప్ప.. ఫిర్యాదు చేయలేదని కాజీపేట ఇన్‌స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు.
ఇప్పుడూ అంతే..
తప్పులు దొర్లినప్పుడు అందుకు కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు సకాలంలో తీసుకోవడంలో నిట్ యాజమాన్యం జాప్యం చేస్తుండటంతో ఒకటి వెనుక మరొకటి అన్నట్లుగా అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పలు అంశాల్లో విచారణ కమిటీలను వేసినా ఏ ఒక్కదాంట్లో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా వివాదాన్ని సైతం ఇదే విధంగా తొక్కిపెడతారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులు కత్తిపోట్ల వ్యవహారం నిట్ ప్రతిష్టకు మచ్చగా మిగలగా.. తాజా ఘటన దానికి కొనసాగింపుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment