నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు.
ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్‌మెంట్లు నిర్మించారు.
అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి.
ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అధికారుల మౌనం
మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు.
ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు.
అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
మౌనం వెనుక మర్మమేమిటో..!
Published Mon, Aug 18 2014 1:53 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement