కొత్త సీసాలో పాత సారానా? | HECI Is Not Useful To Develop The Universities Told By Professor | Sakshi
Sakshi News home page

కొత్త సీసాలో పాత సారానా?

Published Sun, Jul 8 2018 12:39 AM | Last Updated on Sun, Jul 8 2018 12:39 AM

HECI Is Not Useful To Develop The Universities Told By Professor - Sakshi

ఏ విశ్వవిద్యాలయమైనా రాజకీయ ఒత్తిడుల నుంచి బయటపడి స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగ లదు. ఒకప్పుడు భారతీయ చరిత్రలో పేరు మోసిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా వెలుగొందాయంటే ఆర్థికంగా వాటికి కావలసిన నిధులను ఆ కాలంలోని రాజులు సమకూర్చడం, వాటి పరిపాలనా వ్యవహారాల్లో ఏనాడూ వారు వేలుపెట్టకపోవడమే. కానీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు పేరుకు స్వయం ప్రతిపత్తి కలవే గానీ ప్రతివిషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది.

అధ్యాపకుల నియామకాల దగ్గర్నుంచి, నిధుల కేటాయింపు వరకు అన్నిటిలోనూ అవినీతి, అక్రమాలకు తెరలేపుతూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటిని అయినవారి ఆవాసులుగా మార్చుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలను అడ్డుకోవడానికే యూజీసీ వంటి స్వతంత్ర సంస్థలు వెలిశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేసి కొత్తగా భారతీయ ఉన్నత విద్యా కమిషన్‌ అనే సంస్థను దాని స్థానంలో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సంస్థ పేరు మార్చినంత మాత్రాన దాని అవలక్షణాలు చెరిగిపోవు. మన దేశంలో ఉన్నత విద్య కష్టాల బారినపడటానికి కారణం సరైన నియంత్రణా సంస్థలను రూపొందించకపోవడం కాదు. ప్రస్తుత సంస్థల ఆశ్రిత పక్షపాతంతోపాటు, పాలక మండలుల ఆలోచనాధోరణి కూడా కారణమే. 

ఏ ఉన్నత విద్యాసంస్థనైనా రాజకీయ ప్రయోజనాలకోసం పనిముట్టుగా వాడుకోవాలని చూసినప్పుడే దాని పతనం ప్రారంభం అవుతుందని యూజీసీ ఉదంతం చెబుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటికనుగుణంగా దాన్ని తోలుబొమ్మను చేసి ఆడించారు కాబట్టే యూజీసీ ఇప్పుడు పాలకులకు ఖాయిలా పడ్డ పరిశ్రమలా, నిర్వీర్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. అంతమాత్రాన యూజీసీని నిర్వహించిన పాత్రను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పుడు యూజీసీ స్థానంలో కొత్తగా హెచ్‌.ఇ.సి.ఐ. ఏర్పాటు కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఇప్పుడు యూజీసీ స్థానంలో హెచ్‌.ఇ.సి.ఐ.ని తీసుకురావటంలో కూడా ముఖ్యోద్దేశం విధులను నియంత్రణ నుండి వేరు చెయ్యటమే. అసలు నిజం.. వర్సిటీలపై ఆర్థిక ఆంక్షలు విధించటమే.

హెచ్‌.ఇ.సి.ఐ.ని స్థాపించటానికి రూపొందిం చిన చట్టంలో, విద్యా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిలపటానికి, విద్యా బోధనలో నాణ్యతను తీసుకురావటానికి ఈ కొత్త నియంత్రణా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నా, నాణ్యత అనే దానికి నిర్వచనాన్ని మాత్రం ఇవ్వలేకపోతోంది. ఎన్ని రకాలైన ప్రమాణాలను నిర్వచించినా వాటికి నానార్థాలు చెబుతూ, వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకోవటం మన విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ప్రతి ప్రామాణికానికి నకిలీ ప్రామాణికాన్ని రూపొందించటం పరిపాటైంది. 

నిజానికి వాసిపరంగా విద్యా సంబంధమైన సామర్థ్యాన్ని అంచనా వెయ్యటం అంత సులభమేమీ కాదు. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా నాణ్యత మాత్రం వీసమెత్తు కూడా పెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏమింటంటే.. వందలోపు జాతీయ ర్యాంకులు సాధించిన సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహజంగానే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఈటీలు, ఐఐ ఎమ్‌లు వందలోపు నిలబడతాయి. వీటికి ఇప్పటికే నిధులు ఇబ్బడిముబ్బడిగా అందుతున్నాయి. మళ్లీ వీటికే నిధుల వరద పారించటంలో ఆంతర్యమేమిటో ఏలినవారే చెప్పాలి. నిధులు లేక, సరైన మౌలిక వసతులు లేక, రాష్ట్ర ప్రభుత్వాల కనికరం లేక ర్యాంకుల్లో వెనుకబడిన రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఏ మాత్రం ఆర్థిక సహాయం లేక ఇంకా వెనుకబడుతున్నాయి.

కొత్తగా ఈ మధ్య ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ అంటూ ఇప్పటికే దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలలో మొదటి 20 వాటిని ఎన్నుకుని వాటికి ఎటువంటి నిబంధనలు నియంత్రణలూ లేకుండా పూర్తి స్వేచ్ఛని చ్చారు. మిగతా వాటిని మాత్రం యూజీసీ ఉక్కు పిడికిళ్లలోనే నలగమని ఆదేశాలిచ్చారు. అదేమంటే వాటిలో ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయంటున్నారు. అసలు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు దిగజారటానికి కారకులు రాజకీయ నాయకులు, విద్యా సంస్థల ఏలికలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలే.

గ్రేడింగ్‌ విధానం ద్వారా పరిమిత స్వయంప్రతిపత్తి, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, మోడల్‌ పాఠ్యాంశ వృత్తి విద్యా కోర్సులు, ఐసీటీ వినియోగం వంటి ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని చూస్తున్న ఈ తరుణంలో వాటి ఫలితాలు రాకముందే, యూజీసీ స్థానంలో మరో కొత్త సంస్థ హెచ్‌ఇసీఐను తీసుకురావల్సిన అవసరం లేదు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులను ఓడించటానికి విద్యా సంస్థలను ఫణంగా పెట్టడం దిగజారుడుతనం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే ఈ జూద క్రీడలో క్షతగాత్రులుగా హైదరాబాద్, వారణాసి, ఢిల్లీ, పూణే, అలహాబాద్‌ తదితర విశ్వవిద్యాలయాలు మిగిలాయి. మరింతగా వీటిని ఫణంగా పెట్టడానికి హెచ్‌.ఇ.సి.ఐ.ని ఒక ఆయుధంగా తయారుచేస్తే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకొకటి ఉండదు.

ప్రొ‘‘ ఇ. శ్రీనివాసరెడ్డి ,వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ మొబైల్‌ : 789361 11985

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement