Evaluation of answer papers
-
సరిగ్గానే దిద్దుతున్నారా?
సాక్షి, ఎడ్యుకేషన్రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా? వాటిని సరిగానే దిద్దుతున్నారా?అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్ష రాస్తే, ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత, అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపర్చేలా ఇటీవల గ్రూప్–1 పరీక్షలో వచ్చిన ఫలితాలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ‘కీ’ పాయింట్లకే పరిమితమై...పోటీ పరీక్షల్లో లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుబాటులో ఉన్నవారితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు నాలుగైదు ‘కీ’పాయింట్లు ఇస్తారు. అయితే, అభ్యర్థి అంతకంటే మంచి పాయింట్లతో సమాధానం రాసినా, ఫ్యాకల్టీ ఆ కీ పాయింట్ల అన్వేషణకే పరిమితమై తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతోపాటు వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్‌ను ఒక్కరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతోంది అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌లు రెండు రాష్ట్రాల్లో భారీగా ఖాళీగా ఉండటమే సమస్యకు మూలకారణమని అభ్యర్థులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య నెలకొందని చెబుతున్నారు. ఇవీ కొన్ని సమస్యలు.. ⇒ గ్రూప్–1 మెయిన్స్‌లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. పాలిటీ వరకు మాత్రమే అకడమిక్స్‌లో ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు కీ షీట్‌పైనే ఆధారపడి మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాల ఉంటాయి. కానీ, డిగ్రీ స్థాయిలో కోర్ సైన్స్ సబ్జెక్టులే ఉంటాయి. కరెంట్ టాపిక్స్ ఉండవు. దీంతో ఎవాల్యుయేటర్స్ కరెంట్ టాపిక్స్‌పై అవగాహన లేకుండానే మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ జనరల్ ఎస్సే పేపర్లో హిస్టరీ, కల్చర్, ఎకనమీ, పాలిటీ, కరెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూల్యాంకన చేయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ను నియమించాలి. కానీ.. అలా జరట్లేదని అభ్యర్థులు అంటున్నారు. ⇒ వేర్వేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్ వారీగా వేర్వేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4,330 ఉంటే.. 1,048 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ గత నెలలో దాదాపు 150 మంది పదవీ విరమణ చేశారని సమాచారం. తెలంగాణలో 2,825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ⇒ డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా దాదాపు 40 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో ప్రొఫెసర్ల భాగస్వామ్యం లేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. అనువాదం కూడా సమస్యే పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నల అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లిష్‌లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్ ట్రాన్స్‌లేటర్స్‌ను నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీకి మక్కీ (ట్రూ ట్రాన్స్లేషన్) అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌ను (శాసన ఉల్లంఘన ఉద్యమం) పౌర అవిధేయత ఉద్యమం అని అనువాదం చేస్తుండటంతో అదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమే కావటంలేదు. ప్రశ్న పత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి కనీసం ఏడెనిమిది మందిని భాగస్వాములను చేస్తే సమస్య పరిష్కారమవుతందని నిపుణులు చెబుతున్నారు. సమయాభావం పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో సమస్య సమయాభావం. అభ్యర్థులకు మొత్తం ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాల్లో సమయం సరిపోవడం లేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో చదవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండానే సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లోని సీశాట్‌లో 80 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తారు. మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్ చేయాలా? గ్రూప్–1 మెయిన్స్ ప్రశ్న పత్రం రూపకల్పన, మూల్యాంకన సమస్యల నేపథ్యంలో మెయిన్స్‌ను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్న పత్రం రూపొందించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి గ్రూప్–1లో కచ్చితంగా ఇద్దరు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. మొదటి, రెండో మూల్యాంకనాల్లో మార్కుల మధ్య 5 శాతం వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఇదే విధానం అమలవుతోంది. రెండు, మూడు సబ్జెక్టుల సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో.. సెక్షన్ వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రం అనువాదం ఉండాలి. – ప్రొఫెసర్. వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ యూపీఎస్సీ తరహాలో చేయాలిగ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్‌కు 1:13 (ఒక్కో పోస్టుకు 13 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపికచేస్తారు. వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ల మూల్యాంకనానికి సెక్షన్ వారీగా వేర్వేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ.. సమాధానంలో అదనపు సమాచారం ఉంటే.. వాటికీ మార్కులు ఇస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఈ విధానం లేదు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ఈనెల 15నుంచి ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలిపి ఒకే మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హయత్‌నగర్ మండలంలోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో జవాబు పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 3న పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. ఇతర జిల్లాలవి మన దగ్గరకు చేరవేశారు. అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు ఆరు లక్షల జవాబు పత్రాలు వచ్చినట్లు సమాచారం. వీటిని మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. జవాబు పత్రాలు దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల్ల(ఎస్ఏ)కు అప్పగించారు. వీరికి సహాయకులుగా సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు విధులు కేటాయించారు. ఇలా మొత్తం మూడు వేల మంది టీచర్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంది. మూల్యాంకనం.. విధుల్లో భాగమే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మూల్యాంకనం చేపడుతున్నారు. ఈ మూల్యాంకనం విధులకు హాజరయ్యేందుకు చాలా మంది ఉపాధ్యాయులు వెనకాడుతున్నారు. మూడు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు డుమ్మా కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు టీచర్లు ప్రజాప్రతినిధులతో సిఫారసు కూడా చేయించుకుంటున్నారని వినికిడి. దూరభారం కారణంగా తాము రాలేమని టీచర్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు సంవత్సరాల కిందట ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు లేవనెత్తారు. ఇందుకు అంగీకరించని ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతంలో ఉన్న మూల్యాంకన కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మూల్యాంకనానికి విముఖత చూపిస్తుండగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోతే.. మిగిలిన వారిపై భారం పడుతుంది. పైగా 11 రోజుల్లోనే అన్ని పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. సరిపడు ఉపాధ్యాయులు హాజరుకాకపోతే మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉంది. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇది ఈ ఏడాది పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. కచ్చితంగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరుకావాల్సిందేనని, ఉదయం 9 గంటల వరకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
జవాబు పత్రాల మూల్యాంకనంలో జేఎన్టీయూహెచ్ నిర్లక్ష్యం ప్రతిభ గల విద్యార్థులకూ పదిలోపు మార్కులు కొన్ని సబ్జెక్టుల్లో మూకుమ్మడిగా ఫెయిల్ చేసిన వైనం అనర్హులు దిద్దుతున్న ఫలితం బ్యాక్‌లాగ్స్‌తో దూరమవుతున్న ఉద్యోగావకాశాలు ఫీజులపైనే అధికారుల దృష్టి యూనివర్సిటీ తీరుపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు రావడం, అనామకుడికి సైతం అరవై శాతం మార్కులు వేయడం జేఎన్టీయూహెచ్కే చెల్లింది. ఒకప్పుడు సాంకేతిక విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(హైదరాబాద్) ప్రతిష్ట మసకబారుతోంది. అరకొర వసతులతోనే ఉన్నంతలో కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ వర్సిటీ పరీక్షల విభాగం ఘోరంగా విఫలమవుతోంది. ఇష్టారీతిలో మార్కులేస్తూ మూకుమ్మడిగా విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. నాలుగేళ్లపాటు బీటెక్ చదివి 80 శాతం మార్కులు సాధించినా, బ్యాక్‌లాగ్స్ కారణంగా ఉద్యోగావకాశాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో ఆశలతో బీటెక్‌లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించేందుకు కళాశాలల యాజమాన్యాలు, జేఎన్టీయూహెచ్ అధికారులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఇవేం మార్కులు బాబోయ్! యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట కొన్ని సబ్జెక్టులు పీడకలగా మారాయి. కంప్యూటర్ సైన్స్‌లో కొన్ని, ఈసీఈ గ్రూప్‌లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన అధ్యాపకులే దొరకడం లేదు. ఒకవేళ ఉన్నా, విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేందుకు తగిన విషయ నిపుణులు ఉన్నారా అన్నదీ ప్రశ్నార్థకమే! మేడ్చల్ పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువమంది ‘వెబ్ టెక్నాలజీ’ సబ్జెక్టులో ఫెయిల్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న 41 మంది విద్యార్థులు.. ఇటీవలి సెమిస్టర్ పరీక్షలో వెబ్ టెక్నాలజీ సబ్జెక్టు మినహా మిగిలినవన్నీ పాసయ్యారు. కోర్సు మొత్తం కలిపి 80 శాతం మార్కులు వచ్చిన ఓ విద్యార్థికి సైతం వెబ్ టెక్నాలజీ సబ్జెక్టులో ఆరు మార్కులు వచ్చాయి. 75 శాతం మార్కులున్న మరో విద్యార్థికి ఈ సబ్జెక్టులో 2 మార్కులు రాగా, 79 శాతం మార్కులున్న ఇంకొకరికి 15 మార్కులే వచ్చాయి. ఇలా మార్కులు వచ్చిన వేలాది మంది విద్యార్థులు చేసేది లేక రూ. 1000 చెల్లించి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. నెల దాటినా జేఎన్టీయూహెచ్ అధికారులు రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేయలేదు. మరోవైపు నవంబరు 17 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండడంతో దిక్కుతోచని పరిస్థితి విద్యార్థులది. ఇదే రీతిన పలు కాలేజీల్లోని విద్యార్థులు మెఫా, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులతో బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు ఇలాంటి మూల్యాంకనం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. కొన్ని సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులను ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. దీంతో ప్రతిభావంతులు కూడా నిరాశకు గురవుతున్నారు. వర్సిటీ పరిధిలోని 319 అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాక్లాగ్ లేకుండా బయటకు వెళ్లిన విద్యార్థులు ఎంతమందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. తమకు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు అడిగితే రూ.100 చెల్లించి రీకౌంటింగ్/రూ.1000చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆపై చాలెంజ్ ఎవాల్యుయేషన్ కావాలంటే రూ. 10 వేలు, ఆన్సర్ బుక్లెట్ జిరాక్సు కావాలంటే రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్లో పాసైన విద్యార్థులకు వారు చెల్లించిన సొమ్మును వాపసు ఇవ్వటం లేదు. జవాబు పత్రాలు దిద్దిన ఆచార్యుడో లేదా మార్కులను కంప్యూటర్లో నమోదు చేస్తున్న వర్సిటీ సిబ్బందో తప్పు చేస్తే, శిక్ష మాత్రం విద్యార్థులే అనుభవిస్తున్నారు. అనుభవజ్ఞులైన వర్సిటీ ప్రొఫెసర్లతో కాకుండా ప్రైవేటు కాలేజీలకు చెందిన అర్హత లేని అధ్యాపకులతోనే మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నారు. అరకొర పరిజ్ఞానంతో సదరు ఆధ్యాపకులు జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే ఇష్టమొచ్చినట్లుగా మార్కులు వేసి విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు.