సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ఈనెల 15నుంచి ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలిపి ఒకే మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హయత్‌నగర్ మండలంలోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్‌లో జవాబు పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 3న పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. ఇతర జిల్లాలవి మన దగ్గరకు చేరవేశారు.
అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు ఆరు లక్షల జవాబు పత్రాలు వచ్చినట్లు సమాచారం. వీటిని మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. జవాబు పత్రాలు దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల్ల(ఎస్‌ఏ)కు అప్పగించారు. వీరికి సహాయకులుగా సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)కు విధులు కేటాయించారు. ఇలా మొత్తం మూడు వేల మంది టీచర్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంది.
మూల్యాంకనం.. విధుల్లో భాగమే
ఎప్పటిలాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మూల్యాంకనం చేపడుతున్నారు. ఈ మూల్యాంకనం విధులకు హాజరయ్యేందుకు చాలా మంది ఉపాధ్యాయులు వెనకాడుతున్నారు. మూడు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు డుమ్మా కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు టీచర్లు ప్రజాప్రతినిధులతో సిఫారసు కూడా చేయించుకుంటున్నారని వినికిడి. దూరభారం కారణంగా తాము రాలేమని టీచర్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు సంవత్సరాల కిందట ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు లేవనెత్తారు.
ఇందుకు అంగీకరించని ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతంలో ఉన్న మూల్యాంకన కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మూల్యాంకనానికి విముఖత చూపిస్తుండగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోతే.. మిగిలిన వారిపై భారం పడుతుంది.
పైగా 11 రోజుల్లోనే అన్ని పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. సరిపడు ఉపాధ్యాయులు హాజరుకాకపోతే మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉంది. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇది ఈ ఏడాది పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. కచ్చితంగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరుకావాల్సిందేనని, ఉదయం 9 గంటల వరకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment