క్యాంపస్ బయట పనిచేసే సమయం కుదింపు
ఇకపై ఒక వారంలో 24 గంటలపాటే పనిచేసే అవకాశం
ఒట్టావా: కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇకపై ఒక వారమంతా కలిపి 24 గంటలపాటు మాత్రమే కాలేజీక్యాంపస్ బయట పనిచేసే అవకాశం కలి్పస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. కోవిడ్ సంక్షోభకాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగసంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న ‘వారానికి 20 గంటల పని’పరిమితిని ఎత్తేసింది.
దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటలపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేవారు. దీంతో విద్యార్థుల అద్దె, సరుకులు, ఇతరత్రా ఖర్చుల భారం కాస్తంత తగ్గింది. వారానికి 20గంటల పని పరిమితికి ఇచి్చన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జత చేసి ‘వారానికి 24 గంటల నిబంధన’ను తీసుకొస్తున్నారు. ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది.
దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి. 2022 ఏడాదిలో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో 2.26 లక్షల మంది భారతీయులేకావడం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో 3.2 లక్షల మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు(గిగ్ వర్కర్లు)గా పనిచేస్తూ కెనడా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తున్నారు.
ఆఫ్–క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే చిన్న మొత్తాలు.. విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి. పనివేళల నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా 8 గంటలే పనిచేయొచ్చు. ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడ్రోజులే పని దొరికే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు.
గత ఏడాది ఈ వేతనం 16.65 కెనడియన్ డాలర్లుగా ఉండేది. దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదముంది. ‘‘ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చేదెంత? నెలవారీ సామగ్రి కొనడం కూడా కష్టమే’’అని భారతీయ విద్యార్థి నీవా ఫతర్‌ఫేకర్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో సరి్టఫికేట్ కోర్సు చేస్తున్నా. ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండటం చాలా కష్టం. అందుకే స్నేహితుల గదిలోకి మారా. అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్‌మెంట్ చదువుకుంటా’అని నీవా చెప్పారు. ‘‘కనీస ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు. ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలి’’అని బార్బరా షెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాయర్ అయిన దీపా మాటో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment