సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్‌లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి.
సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం.
కుజ్‌నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్‌లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment