నాదల్‌ను ఆపతరమా! | Rafael Nadal to face Daniil Medvedev in final | Sakshi
Sakshi News home page

నాదల్‌ను ఆపతరమా!

Published Sun, Sep 8 2019 5:09 AM | Last Updated on Sun, Sep 8 2019 5:32 AM

Rafael Nadal to face Daniil Medvedev in final - Sakshi

డానిల్‌ మెద్వెదేవ్‌, రాఫెల్‌ నాదల్‌

అమెరికా గడ్డపై స్పెయిల్‌ బుల్‌ జైత్రయాత్ర నిర్విఘ్నంగా సాగిపోతోంది. చిరకాల ప్రత్యర్థులు, తనకు పోటీ కాగల ఇద్దరు స్టార్లు జొకోవిచ్, ఫెడరర్‌ ముందే నిష్క్రమించిన చోట నాదల్‌ జోరు ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. ఇదే ఊపులో నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకొని 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటకు సన్నద్ధమయ్యాడు. మరోవైపు నుంచి తుది పోరుకు అర్హత సాధించిన రష్యన్‌ మెద్వెదేవ్‌ నేడు జరిగే ఫైనల్లో నాదల్‌కు ఎదురుగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం తన అదృ ష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సెమీఫైనల్లో నాదల్‌ ముందు బెరెటిని తలవంచగా... మెద్వెదేవ్‌ ముందు దిమిత్రోవ్‌ నిలవలేకపోయాడు.
 
న్యూయార్క్‌: ఒకవైపు 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత... మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగు పెట్టిన ఆటగాడు... వీరిద్దరి మధ్య యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో నేడు జరిగే తుది పోరులో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) తలపడతాడు. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 7–6 (8/6), 6–4, 6–1తో 24వ సీడ్‌ మాటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించగా... మెద్వెదేవ్‌ 7–6 (7/5), 6–4, 6–3తో అన్‌సీడెడ్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)ను ఓడించాడు. రెండు సెమీస్‌ మ్యాచ్‌లు దాదాపు ఒకే తరహాలో, ఒకే సమయం పాటు సాగడం విశేషం. నాదల్‌ ఇప్పటి వరకు మూడు సార్లూ యూఎస్‌ ఓపెన్‌ గెలుచుకున్నాడు.  

తొలి సెట్‌ మినహా...
బెరెటినితో తొలిసారి తలపడిన నాదల్‌ మొదటి సెట్‌లో కొంత పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో సెట్‌లో కాస్త సులువుగా... మూడో సెట్‌లో తిరుగులేని విధంగా అతని ప్రదర్శన సాగింది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగి బెరెటిని ఎక్కడా తగ్గకపోవడంతో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇక్కడా బెరెటిని 4–0తో ఆధిక్యంలో నిలిచాడు. నాదల్‌ 2–5తో అంతరం తగ్గించినా ఇటలీ ఆటగాడు 6–4తో సెట్‌ విజయానికి చేరువయ్యాడు. అయితే రెండు సార్లు సెట్‌ను గెలుచుకునే అవకాశం వచ్చినా నాదల్‌ తిప్పికొట్టాడు.

ఆపై తన అనుభవాన్ని ఉపయోగించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3 వరకు చేరింది. కొద్ది సేపటికి బెరెటిని సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5–3తో ఆధిక్యం ప్రదర్శించిన నాదల్‌ ఆపై వెంటనే సెట్‌ను కూడా గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో మరింత దూకుడుగా ఆడిన నాదల్‌కు ఎదురు లేకుండా పోయింది. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ (31)కంటే బెరెటిని ఎక్కువ విన్నర్లు (37) కొట్టినా... ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి ఓటమిని ఆహ్వానించాడు.  

దిమిత్రోవ్‌కు నిరాశ...
క్వార్టర్స్‌లో రోజర్‌ ఫెడరర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన దిమిత్రోవ్‌ ఈ మ్యాచ్‌లో అదే స్థాయి పోరాట పటిమ కనబర్చలేకపోయాడు. 2 గంటల 38 నిమిషాల ఈ మ్యాచ్‌లో పోటాపోటీగా సాగిన తొలి సెట్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. సుదీర్ఘమైన ర్యాలీలతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి మెద్వదేవ్‌ చివరకు సెట్‌ను గెలుచుకున్నాడు. 6–5 వద్ద సెట్‌ గెలిచే అవకాశం వచ్చినా దిమిత్రోవ్‌ విఫలమయ్యాడు. రెండో సెట్‌లో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచిన దశలో సర్వీస్‌ నిలబెట్టుకొని మెద్వెదేవ్‌ 5–4తో ముందంజ వేశాడు. చక్కటి ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతో రెండో సెట్‌ కూడా మెద్వెదేవ్‌ వశమైంది. కెరీర్‌లో తొలి రెండు సెట్‌లు ఓడిన తర్వాత ఎప్పుడూ కోలుకోలేకపోయిన దిమిత్రోవ్‌కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. మూడో సెట్‌లో ప్రత్యర్థి 5–2తో ఆధిక్యంలో ఉన్న దశలో తన సర్వీస్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోగలిగినా... చివరకు అతని ఫోర్‌హ్యాండ్‌ నెట్‌ను తాకడంతో పరాజయం ఖాయమైంది.  

తొలి సెట్‌ టైబ్రేక్‌లో నాకు అదృష్టం కలిసొచ్చింది. 4–0తో ఆధిక్యం అంటే అతనికి 100 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ బతికిపోయాను. రెండో సెట్‌లో నాకు బ్రేక్‌ లభించిన తర్వాత ఆట మొత్తం మారిపోయింది. యూఎస్‌ ఓపెన్‌లో మరోసారి ఫైనల్‌ చేరడం సంతోషంగా ఉంది. మెద్వెదేవ్‌ ఈ సీజన్‌లో చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతీ వారం అతని ఆటతీరు ఎంతో మెరుగవుతూ వస్తోంది కాబట్టి ఫైనల్లో నేను శ్రమించాల్సిందే. అయితే గ్రాండ్‌స్లామ్‌ తుది పోరు అంటే ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దు.
–నాదల్‌  

ఓడిపోతాననుకున్న తొలి సెట్‌ నాకు దక్కడంతోనే మ్యాచ్‌ మలుపు తిరిగింది. అమెరికా హార్డ్‌కోర్ట్‌ సీజన్‌లో వరుసగా నాలుగో ఫైనల్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు దీనిని ఊహించలేదు. గ్రాండ్‌స్లామ్‌లో ఇప్పటి వరకు నా అత్యుత్తమ ప్రదర్శన నాలుగో రౌండ్‌ మాత్రమే. ఐదు సెట్‌ల మ్యాచ్‌లు నేను గెలవలేనని అనిపించేది. కానీ ఇక్కడ సాధించిన విజయాలు నాలో నమ్మకాన్ని పెంచాయి. ఫైనల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
మెద్వెదేవ్‌  

బెథానీ–జేమీ ముర్రే జంటకు ‘మిక్స్‌డ్‌’ టైటిల్‌
యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్‌ బెథానీ–జేమీ ముర్రే ద్వయం 6–2, 6–3తో టాప్‌ సీడ్‌ హావో చింగ్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ)–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జోడీపై సంచలన విజయం సాధించింది. టైటిల్‌ నెగ్గిన బెథానీ–జేమీ జంటకు 1,60,000 డాలర్ల (రూ. కోటీ 14 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.   

1: ఈ ఏడాది అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెద్వెదేవ్‌ (50 విజయాలు) అగ్రస్థానంలో ఉన్నాడు. 46 విజయాలతో నాదల్‌ రెండో స్థానంలో ఉన్నాడు.  
1: ముఖాముఖి రికార్డులో నాదల్‌ 1–0తో మెద్వెదేవ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఇటీవల రోజర్స్‌ కప్‌ మాస్టర్స్‌ సిరీస్‌ ఫైనల్లో మెద్వెదేవ్‌పై గెలిచి నాదల్‌ టైటిల్‌ సాధించాడు.  
27: నాదల్‌ కెరీర్‌లో ఇది 27వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. ఇందులో అతను 18 ఫైనల్స్‌లో గెలిచి,  8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.  
1:మరాత్‌ సఫిన్‌ (2005లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌)  తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌    టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి రష్యా ప్లేయర్‌ మెద్వెదేవ్‌.
5: యూఎస్‌ ఓపెన్‌లో రాఫెల్‌ నాదల్‌ ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతను ఒకసారి రన్నరప్‌ (2011)తో సరిపెట్టుకున్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement