‘చిల్లర’ విసిరేశాడు! | Cheap shot: Angry Daniil Medvedev throws coin at umpire's seat | Sakshi
Sakshi News home page

‘చిల్లర’ విసిరేశాడు!

Published Fri, Jul 7 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

‘చిల్లర’ విసిరేశాడు!

‘చిల్లర’ విసిరేశాడు!

లండన్‌: ‘ఎవరైనా కోపం వస్తే అరుస్తారు, అసహనం ఎక్కువైపోతే ఏవైనా బూతులు తిట్టేస్తారు, వీడేంట్రా ఇలా ఆగ్రహం వ్యక్తం చేశాడు’... గురువారం వింబుల్డన్‌లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌ ప్రవర్తన చూస్తే అందరికీ వచ్చే సందేహమిది!  తొలి రౌండ్‌లో వావ్రింకాపై సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 21 ఏళ్ళ కుర్రాడు రెండో రౌండ్‌లో ఓటమిని మాత్రం భరించలేకపోయాడు. రూబెన్‌ బెమెల్‌మన్స్‌ (బ్రెజిల్‌)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్‌ 4–6, 2–6, 6–3, 6–2, 3–6 తేడాతో పోరాడి ఓడాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తన చెయిర్‌ వద్దకు వెళ్లిన అతను వ్యాలెట్‌ను బయటకు తీశాడు. అందులోంచి ఒక్కొక్కటిగా చిల్లర నాణేలు తీసి అక్కడే ఉన్న అంపైర్‌ మారియానా ఆల్వ్‌ కాళ్ల వద్దకు వరుసగా విసిరేయడం ఆశ్చర్యం కలిగించింది!

ఐదో సెట్‌లో ఒక పాయింట్‌ విషయంలో అంపైర్‌ తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు అతను ఇలా చేసి ఉంటాడని అక్కడ ఉన్నవారు భావించారు. ‘ఓటమితో నేను తీవ్రంగా నిరాశ చెందాను. చిల్లర విసిరేయడానికి కారణం ఇదీ అని కూడా నేను చెప్పలేను. అలా ఎందుకు చేశానో నాకే తెలీదు. ఆ సమయంలో అసహనంతో అలా జరిగిపోయిందంతే. దీనికి క్షమాపణ కోరుతున్నాను’ అని మెద్వెదేవ్‌ ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే వింబుల్డన్‌ నిర్వాహకులు మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.

మ్యాచ్‌ జరిగే సమయంలో, ఆ తర్వాత అతని ప్రవర్తనను కారణంగా చూపిస్తూ మూడు వేర్వేరు రకాల జరిమానాలు విధించారు. మూడూ కలిపి మెద్వెదేవ్‌పై మొత్తం 14,500 డాలర్లు (దాదాపు రూ. 9.38 లక్షలు) జరిమానా పడింది. మరో వైపు తొలి రౌండ్‌లో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఆడి ‘టెన్నిస్‌ బోర్‌ కొట్టింది’ అనే వ్యాఖ్యలు చేసిన బెర్నార్డ్‌ టామిక్‌కు కూడా 15,000 డాలర్లు (దాదాపు రూ. 9.71 లక్షలు) జరిమానా విధించి గట్టి హెచ్చరిక జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement