ఇక ‘పంచ్’ పండుగ...
జూలై 7 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్‌లో విపరీతంగా ఆదరణ పొందుతున్న బాక్సింగ్‌లోనూ తాజాగా ఓ లీగ్ రాబోతుంది. ఇంగ్లండ్ ప్రొఫెషనల్ బాక్సర్ ఆమిర్ ఖాన్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ‘ది సూపర్ బాక్సింగ్ లీగ్’ (ఎస్‌బీఎల్) త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు భారత్‌లోనే జరిగే ఈ లీగ్‌లో దేశ, విదేశీ బాక్సర్లు పోటీపడనున్నారు.
ఈ లీగ్‌కు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం మద్దతు కూడా ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన పారిశ్రామికవేత్త బిల్ దోసంజీ తగిన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే బాక్సింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు మాత్రం తమ బాక్సర్లను అనుమతించేది లేదని భారత బాక్సింగ్ సమాఖ్య తేల్చి చెప్పింది. ఈ ఏడాది చివర్లో తామే కొత్తగా లీగ్‌ను నిర్వహిస్తామని తెలిపింది.