
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండానే సితారే జమీన్ పర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ తెగ వైరలవుతోంది. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్‌ను అమిర్ ఖాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు అమిర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సితారే జమీన్ పర్ థియేటర్లలో ప్రదర్శన తర్వాత యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారని అమిర్ ఖాన్ చెబుతున్నారు. కానీ అది ఉచితం కాదు.. ప్రేక్షకులు సినిమా చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో అందుబాటులోకి వస్తుందో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత విడుదల కోసం అమెజాన్ రూ. 120 కోట్లు ఆఫర్ చేసింది.