న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) గుర్తింపును అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) రద్దు చేసినా.. బాక్సర్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని క్రీడల మంత్రి జితేంద్రసింగ్ హామీ ఇచ్చారు.
బుధవారం జాతీయ సైక్లింగ్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘ఐబీఎఫ్‌పై ఐబా వేటు ప్రభావం బాక్సర్లపై పడకుండా చూస్తాం. సమస్య పరిష్కారమయ్యేదాకా బాక్సర్ల శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని అన్నారు. హాకీ ఇండియాకు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్) హోదా కల్పించడంపై స్పందిస్తూ.. ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలు గుర్తించిన క్రీడా సంఘాల్నే తాము ఆమోదిస్తామన్నారు. 2017లో జరగనున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమవ్వనుండడం భారత్‌కు గర్వకారణమని జితేంద్రసింగ్ తెలిపారు.