
టి-20 ప్రపంచ కప్: చెలరేగిన యువరాజ్, ఆస్ట్రేలియా లక్ష్యం 160
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్లో నిరాశపరుస్తూ వస్తున్న భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తొలిసారి రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో యువరాజ్ (43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60) సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. దీంతో ధోనీసేన కంగారూలకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే భారత్కు ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5) నాలుగో బంతికే హాడ్జ్ బౌలింగ్లో అవుటయ్యాడు. యువ సంచలనం విరాట్ కోహ్లీ (23), రహానె (19)తో కలసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాగా వీరిద్దరూ వెంటవెంటనే వెనుదిరగగా, రైనా (6) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 66/4. ఈ దశలో యువరాజ్కు ధోనీ అండ లభించింది.
మహీ సంయమనంతో ఆడుతూ యువీకి సహకరించాడు. యువరాజ్ ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తూ తనలో వాడి తగ్గలేదని నిరూపించాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్ ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కాగా చివర్లో ధోనీ (24), యువరాజ్ వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్లపై గెలుపొందిన సంగతి తెలిసిందే.