ఫిక్సింగ్ కలకలం!
టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌పై ఐసీసీ అనుమానం
విచారణ జరపనున్న ఏసీఎస్‌యూ
అఫ్ఘానిస్తాన్ జట్టుపై అనుమానాలు
ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేసినా ఫిక్సింగ్‌ను ఆపడం సాధ్యం కాదేమో. తాజాగా టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో అఫ్ఘానిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే అనుమానాలు వచ్చాయి. హాంకాంగ్‌తో ఈ జట్టు ఆడిన క్వాలిఫయర్ మ్యాచ్‌ను విచారించాలని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్ణయించింది.
దుబాయ్: ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టోర్నీకి ఇందులో నుంచి ఆరు జట్లు అర్హత సాధిస్తాయి. జులై 9 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీలో మొ త్తం 14 జట్లు బరిలోకి దిగాయి. ఏడు జట్లు రెండేసి గ్రూప్‌లుగా ఆడాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐర్లాండ్, స్కాట్లాండ్ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు జట్లను తేల్చేం దుకు నాలుగు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహించాలి. ఇందులో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ తొలి మ్యాచ్ ఆడాయి. ఇందులో గెలిచిన హాంకాంగ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ రెండు జట్లు గ్రూప్ దశలో రెండు, మూడు స్థానాల్లో నిలిచినందున... ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు కు మళ్లీ మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మంగళవారం ఓడిపోయిన అఫ్ఘానిస్తాన్ జట్టు గురువారం జరిగే మ్యాచ్‌లో పపువా న్యూగినియా జట్టుతో ఆడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడొచ్చు.
హాంకాంగ్‌తో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ తొలుత 161 పరుగులు చేసింది. హాంకాంగ్ ఆఖరి బంతికి రెండు పరుగులతో 162 లక్ష్యాన్ని ఛేదించి నెగ్గింది. చివరి ఓవర్లో హాంకాంగ్ ఏకంగా 16 పరుగులు సాధించింది. మామూలుగా మ్యాచ్ చూసిన వాళ్లకి ఇది అద్భుతమైన ఉత్కంఠతో సాగిన పోరు. కానీ ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం బయట బెట్టింగ్‌లు సాగిన విధానం వల్ల వీరికి అనుమానం వచ్చింది. దీంతో బెట్టింగ్‌లు నిర్వహించే సంస్థలను సంప్రదించారు. బెట్‌ఫెయిర్ సహా ప్రముఖ బెట్టింగ్ సంస్థలన్నింటిలోనూ విచారణ సాగించనున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధిం చిన బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగింది. ఫలితం ముందే తెలిసినట్లుగా పందేలు సాగాయి.