‘ప్రాక్టీస్’లో నెగ్గిన పాకిస్తాన్
రాణించిన హఫీజ్
కోల్‌కతా: బౌలింగ్‌లో రాణించిన పాకిస్తాన్... టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. హఫీజ్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. సర్ఫరాజ్ అహ్మద్ (13)తో మూడో వికెట్‌కు 39; ఉమర్ అక్మల్‌తో నాలుగో వికెట్‌కు 53 పరుగులు జత చేశాడు. కెప్టెన్ ఆఫ్రిది (0) తొలి బంతికే డకౌటయ్యాడు. తిసారా పెరీరా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంకను లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (4/25) వణికించాడు. దీంతో లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది.
ఇంగ్లండ్‌కు మరో విజయం
ముంబై: టి20 ప్రపంచకప్ సన్నాహల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లను ఇంగ్లండ్ విజయాలతో ముగించింది. తొలి వార్మప్‌లో పటిష్ట న్యూజిలాండ్‌ను దెబ్బతీయగా... తాజాగా సోమవారం స్థానిక బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై క్రికెట్ సంఘం ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో నెగ్గింది.
ముందుగా ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 177 పరుగులు చేసింది. జో రూట్ (34 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. ఓపెనర్ జే బిస్టా (37 బంతుల్లో 51; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు.