సికిందర్ రజా (PC: PSL)
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు.
ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు.
ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.
34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం
IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment