Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్‌! ఆఖరికి.. | Sakshi
Sakshi News home page

Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్‌! ఆఖరికి..

Published Sun, Apr 28 2024 10:51 AM

కీలక మ్యాచ్‌లో పాక్‌ గెలుపు

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్‌ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం కివీస్‌ జట్టు పాక్‌ పర్యటనకు వెళ్లింది.

బాబర్‌ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్‌. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్‌.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది.  

ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్‌ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్‌ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్‌ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.

లాహోర్‌లో టాస్‌ ఓడిన పాక్‌.. న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్‌ ఖాన్‌(24 బంతుల్లో 31), ఫఖర్‌ జమాన్‌(33 బంతుల్లో 43),  షాబాద్‌ ఖాన్‌(5 బంతుల్లో 15 నాటౌట్‌) రాణించారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. ఓపెనర్‌ టిమ్‌ సెఫార్ట్‌ (33 బంతుల్లో 52), జోష్‌ క్లార్క్‌సన్‌(26 బంతుల్లో 38 నాటౌట్‌) మాత్రమే మెరుగ్గా ఆడారు.

మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్‌ ఆఫ్రిదికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది.  

Advertisement
Advertisement