![Sarfaraz Ahmed Blunt Take On Pakistan Win Over Virat Kohli Men In CT 2017](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/indvspak.jpg.webp?itok=ALAa6m8C)
క్రికెట్ ప్రపంచంలో భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరుదేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియా కప్, ఐసీసీ వంటి ప్రధాన ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల ముఖాముఖి పోటీపడుతుండగా.. అత్యధిక సార్లు భారత్ పైచేయి సాధించింది.
కానీ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్లో మాత్రం టీమిండియాకు దాయాది చేతిలో భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఓటమిపాలైంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొదలుకానున్న తరుణంలో నాటి విన్నింగ్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
మాలో కసి పెరిగింది
చాంపియన్స్ ట్రోఫీ-2017లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు సమావేశంలో భాగంగా సీనియర్లు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జట్టులో అలాంటి వ్యక్తులు ఉండటం అదనపు బలం.
ఆరోజు నుంచి మా ఆలోచనా ధోరణి మారిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధించాం. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించాం.
టీమిండియా మనకు కొత్తదేమీ కాదు
ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో మా బౌలర్లు అద్భుతంగా ఆడి గెలిపించారు. ఆ తర్వాత టీమిండియాతో ఫైనల్. అప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అందరూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలని మా వాళ్లకు సందేశం ఇచ్చాను.
అత్యుత్తమ జట్లను ఓడించాం. ఇక టీమిండియా కూడా మనకు కొత్తదేమీ కాదు. మనం చూడని జట్టూ కాదు. ఫలితం ఏమిటన్న విషయం గురించి ఆలోచించవద్దు. గెలిచేందుకు వంద శాతం ప్రయత్నం చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం.
ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. చివరి వికెట్ పడగానే మాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము’’ అంటూ ఐసీసీతో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. కాగా లండన్ వేదికగా నాటి ఫైనల్లో పాకిస్తాన్ కోహ్లి సేనపై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.
దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు
ఇక 2017లో ఫైనల్ ఆడిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉండగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగనుంది. ఈసారి.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.
చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment