జోరుగా టీ-20 ప్రపంచ కప్ బెట్టింగ్‌లు
చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం
టీ-20 ప్రపంచకప్ పోటీలు వీక్షకులకు ఆనందాన్ని ఇస్తుంటే.. పందెంగాళ్లు మాత్రం కాయ్‌రాజాకాయ్ .. అంటూ యువతపై వల విసురుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు ఏ బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు తీస్తాడు.. బంతిబంతికీ బేరమం టూ పందేల రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. ఈ రొంపిలోకి దిగిన యువత జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది.
తిరుపతి క్రైం: క్రికెట్ బెట్టింగ్‌లో జిల్లా అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇలా.. జట్టు ఏదైనా బెట్టింగ్‌లు మాత్రం అసాధారణ స్థాయిలో సాగుతున్నాయి. టీ-20 ప్రపంచకప్ పోటీల్లో ఏరోజుకు ఆరోజే పందేలు కాస్తున్నారు. ప్రధానంగా యువత ఇష్టానుసారం బెట్టింగ్‌లు కాస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జిల్లాలో ఆట ప్రారంభమైందంటే సుమారు రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
యువతపై తీవ్ర ప్రభావం
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మదనపల్లిలో క్రికెట్ స్టార్ట్ అయిందంటే బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద బారులు తీరుతున్నారు. రెండు రోజుల క్రితం నగదుతో సహా పలువురుని మదనపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. బుకీలు పట్టణ, నగర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో స్టార్ హోటల్స్‌లో రూములు తీసుకుని ఏమీ తెలియని వారిలా అంతా ఫోన్లలోనే బెట్టింగ్‌లు జరుపుతున్నారు. పోలీసులకు ఎటువంటి అనుమానం లేకుండా ఏరోజుకారోజు హోటల్ గదిని ఖాళీ చేసి మరో హోటల్‌కు మారిపోతున్నారు.
రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్ బుకీలు
జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు వంటి ముఖ్యపట్టణాలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్‌ల ద్వారా దందా కొనసాగిస్తున్నారు. చోటా రాజకీయల నాయకుల అండదండలతో ఈ కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు. గతంలో బెట్టింగ్ రాయళ్లతో పాటు బుకీ రాయళ్లు కూడా ఒకేచో ఉంటూ మ్యాచ్ అయ్యేవరకు ఆస్వాదించేవారు. పోలీసులు వారిపై నిఘా ఉంచడంతో నిర్మానుష్యంగా ఉన్న దూరప్రాంతాల్లోని లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని వ్యవహారాలు నడుపుతున్నారు. నిర్వాహకులంతా ఎక్కువగా సెల్‌ఫోన్ల ద్వారానే ఈ దందా కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ల కోసమే కొత్త సిమ్‌లు కొనుగోలు చేసి లావాదేవీలు అయిన తర్వాత వాటిని పారేస్తున్నారు.
పటిష్టమైన చర్యలు
నగరంలో బెట్టింగ్‌పై నిఘా ఏర్పాటు చేశాం. క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన సందర్భంలో నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. బెట్టింగ్ కాయడం చట్టరీత్యానేరం. యువకులు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసు వాట్సప్ నెం.8099999977, 9491086021 నెంబర్లకు సమాచారం అందించండి.
-మురళీకృష్ణ, ఈస్టు సబ్‌డివిజనల్ డీఎస్పీ