రంగ...రింగ రింగ....
హెరాత్ స్పిన్ మ్యాజిక్
సెమీఫైనల్లో శ్రీలంక
59 పరుగులతో కివీస్ చిత్తు
టి20 ప్రపంచ కప్
21 బంతుల్లో 3 పరుగులు... 5 వికెట్లు... శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ ప్రదర్శన ఇది. ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన అతను... అద్భుత బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశాడు. టి20 క్రికెట్‌లో ఊహకు కూడా అందని గణాంకాలు నమోదు చేశాడు. కివీస్ రెక్కలు విరిచి ఒంటి చేత్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. హెరాత్ ధాటికి నిలబడలేక న్యూజిలాండ్ కుప్పకూలగా... శ్రీలంక వరుసగా నాలుగోసారి టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
చిట్టగాంగ్: శ్రీలంక జట్టు స్పిన్ అస్త్రం బంగ్లా గడ్డపై మరోసారి బ్రహ్మాండంగా పని చేసింది. రంగన హెరాత్ (3.3-2-3-5) సూపర్ బౌలింగ్‌కు తోడు సేనానాయకే (2/3) కూడా రాణించడంతో లంక మరోసారి టి20లో ప్రపంచ కప్ సెమీస్‌కు చేరింది. సోమవారం ఇక్కడి జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో శ్రీలంక 59 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. జయవర్ధనే (32 బంతుల్లో 25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 15.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ (43 బంతుల్లో 42; 6 ఫోర్లు) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా, నలుగురు ఆటగాళ్లు సున్నాకే పరిమితయ్యారు. లంక స్పిన్ ధాటికి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హెరాత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. పాక్/వెస్టిండీస్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే సెమీఫైనల్లో లంక తలపడుతుంది.
కట్టడి చేసిన బౌల్ట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ఏ దశలోనూ వేగంగా సాగలేదు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. బౌల్ట్ (3/20) తక్కువ వ్యవధిలో మూడు వికెట్లతో లంకను దెబ్బ తీశాడు. అతని ధాటికి కుషాల్ పెరీరా (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), దిల్షాన్ (8), సంగక్కర (4) వెంట వెంటనే వెనుదిరిగారు. ఆ తర్వాత జయవర్ధనే, తిరిమన్నె (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) మాత్రం కొద్దిగా ప్రతిఘటించి నాలుగో వికెట్‌కు 30 పరుగులు జత చేశారు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ (6) కూడా విఫలమయ్యాడు. చివర్లో సేనానాయకే (11 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), తిసార పెరీరా (13 బంతుల్లో 16; 3 ఫోర్లు) కొన్ని పరుగులు జత చేశారు. కివీస్ బౌలర్లలో నీషామ్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి.
కివీస్ విలవిల
బంతికో పరుగు చొప్పున ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో విజయలక్ష్యం... మెకల్లమ్, టేలర్, అండర్సన్‌లాంటి ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్ ఉన్న న్యూజిలాండ్‌కు ఇదేమీ పెద్ద లక్ష్యం కాదనిపించింది. కానీ లంక స్పిన్ ముందు ఆ జట్టు బిత్తరపోయింది. గింగిరాలు తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక ఆ జట్టు ఆటగాళ్లు చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో గుప్తిల్ (5) రనౌట్‌తో ప్రారంభమైన పతనం చివరి వరకు సాగింది. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి బ్రెండన్ మెకల్లమ్ (0) వెనుదిరగ్గా... హెరాత్ బౌలింగ్‌ను ఆడలేక టేలర్ (0), నీషామ్ (0) కెప్టెన్‌ను అనుసరించారు. అయితే సహచరులంతా వెనుదిరుగుతున్నా విలియమ్సన్ మాత్రం పట్టుదలగా ఆడాడు. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా చక్కటి షాట్లు కొట్టాడు. అయితే అతని పోరాటం వృథా అయింది. చేతికి గాయంతో అండర్సన్ బ్యాటింగ్‌కు రాకపోవడం కూడా కివీస్‌ను దెబ్బ తీసినా... జట్టు మొత్తం ఇబ్బంది పడిన చోట అతను ఏ మాత్రం ప్రభావం చూపేవాడో సందేహమే!