rangana hearth
-
19 ఏళ్ల ప్రస్థానం ముగించి...
1999 సెప్టెంబర్ 22–26... రంగన హెరాత్ తన తొలి టెస్టు ఆడిన తేదీలు. గత 19 ఏళ్లుగా అతను అలసట లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో వేల సంఖ్యలో బంతులు వేస్తూనే ఉన్నాడు. కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు అరంగేట్రం చేసి ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ ఆడుతున్నవారిలో హెరాత్ ఆఖరివాడు. ఒకనాడు మురళీధరన్ నీడలోనే ఉండిపోయిన అతను, మురళీధరన్ తప్పుకున్న తర్వాత తనదైన ప్రత్యేకత కనబర్చి శ్రీలంక క్రికెట్లో ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. నేటి నుంచి గాలేలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు 40 ఏళ్ల హెరాత్ ముదియన్సెలగే రంగన కీర్తి బండార (హెచ్ఎంఆర్కేబీ) హెరాత్‌కు ఆఖరి టెస్టు మ్యాచ్ కానుంది. సాక్షి క్రీడా విభాగం : శ్రీలంక జట్టులో మురళీధరన్ ఉన్నంత వరకు 22 టెస్టులు 37.88 సగటుతో హెరాత్ కేవలం 71 వికెట్లు పడగొట్టాడు. రెండో స్పిన్నర్‌గా జట్టులో కొనసాగుతున్నా, కొన్ని అద్భుత ప్రదర్శనలు ఉన్నా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కచ్చితత్వంతో సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్ చేసి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచడమే అతని పనిగా ఉండేది. ఇలాంటి స్థితిలో టన్నులకొద్దీ వికెట్లు మాత్రం మురళీ ఖాతాలోకి వెళ్లిపోయేవి. అయితే ఏనాడూ తన అసంతృప్తిని ప్రదర్శించని రంగన... మురళీ తప్పుకున్న తర్వాత తనెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆడిన 70 టెస్టుల్లో కేవలం 26 సగటుతో ఏకంగా 359 వికెట్లు తీయడం హెరాత్ స్వయంప్రకాశాన్ని చూపిస్తుంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 10వ స్థానంలో (430 వికెట్లు) ఉన్న హెరాత్ ఎడంచేతి వాటం వారిలో అత్యంత విజయవంతమైన బౌలర్ కావడం విశేషం. తొలి పదేళ్లలో 14 టెస్టులు మాత్రమే దక్కడంతో దాదాపు కెరీర్ ముగిసిపోయిన దశలో ఇంగ్లండ్‌లో మైనర్ లీగ్‌లు ఆడుకునేందుకు హెరాత్ వెళ్లిపోయాడు. అలాంటి స్థితిలో 31 ఏళ్ల వయసులో 2009లో అనూహ్యంగా వచ్చిన మరో అవకాశంతో హెరాత్ జట్టులో పాతుకుపోయాడు. తన సత్తాను ప్రదర్శిస్తూ జట్టులో కొనసాగగలిగాడు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అతను 230 వికెట్లు తీయడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఇతర బౌలర్లతో పోలిస్తే హెరాత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం నాలుగో ఇన్నింగ్స్‌లో అతను తీసిన వికెట్ల సంఖ్య. చివరి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలిపించడంలో తనకెవరూ సాటి రారన్నట్లుగా హెరాత్ ఏకంగా 12 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మురళి 7 సార్లే ఆ ఘనత నమోదు చేయగలిగాడు! దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ సొంతగడ్డపై స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో బంతి బాగా టర్న్ అవుతుంది. రికార్డులకు పిచ్‌లు కూడా కారణం’ అంటూ చెప్పుకోవడం హెరాత్కే చెల్లింది. శ్రీలంకలోనే కాకుండా 2011లో డర్బన్‌లో అద్భుత బౌలింగ్‌తో 9 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గడ్డపై లంక తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం అతని కెరీర్లో చిరస్మరణీయ జ్ఞాపకం. ఘనతలపరంగా చూస్తే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోయినా, స్టార్ బౌలర్‌గా గుర్తింపు లేకపోయినా తన పనేంటో తాను చేసుకుంటూ పోయిన హెరాత్ వివాదాలకు దూరంగా ఆటకు గుడ్‌బై చెబుతున్నాడు. తాను తొలి టెస్టు ఆడిన, బాగా అచ్చొచ్చిన గాలే మైదానంలో (99 వికెట్లు) చివరి టెస్టులో హెరాత్ మరో ఐదు వికెట్లు తీస్తే హ్యాడ్లీ, బ్రాడ్, కపిల్‌లను దాటి ఏడో స్థానంతో కెరీర్ ముగిస్తాడు. శ్రీలంక గీ ఇంగ్లండ్; తొలి టెస్టు (గాలే) ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
లంకకు సాధ్యమేనా!
దులీప్ మెండిస్, అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా... మురళీధరన్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే, సంగక్కర... నాటి తరం నుంచి నేటి తరం వరకు శ్రీలంక క్రికెట్లో వీరంతా దిగ్గజాలు. ఈ ఆటగాళ్లంతా ఏదో ఒక దశలో భారత్‌లో టెస్టు సిరీస్‌లు ఆడారు. కానీ విజయం సాధించిన జట్టులో భాగమయ్యే అవకాశం మాత్రం రాలేదు. కొన్ని సార్లు పోరాటస్ఫూర్తితో మ్యాచ్‌లను కాపాడుకోగలిగినా... గెలుపు మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. ఇప్పుడు మరోసారి లంక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన లంక యువ జట్టు ఏ మాత్రం సత్తా చాటుతుందనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం :శ్రీలంక జట్టు భారత గడ్డపై ఆఖరి సారిగా 2009లో టెస్టు సిరీస్ ఆడింది. తొలి టెస్టులో జయవర్ధనే అసమాన బ్యాటింగ్ (275)తో ఆ జట్టు మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం చిత్తుగా ఓడి సిరీస్‌ను కోల్పోయింది. జయవర్ధనే, సంగక్కర, సమరవీర, దిల్షాన్‌లాంటివాళ్లు కూడా భారత బౌలింగ్ ముందు తేలిపోగా... కెరీర్ చరమాంకంలో ఉన్న మురళీధరన్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. నాటి సిరీస్ ఆడిన జట్టు సభ్యులలో ఇద్దరు మాత్రమే ఇప్పుడు మళ్లీ భారత్‌కు వచ్చారు. ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. కెప్టెన్ చండిమాల్ కూడా తొలిసారి భారత గడ్డపై బరిలోకి దిగుతున్నాడు. ఇటీవలే సొంత గడ్డపైనే చిత్తుగా ఓడిన లంక, దాదాపు అదే భారత జట్టును నిలువరించి సంచలనం సృష్టించడం అంత సులువు కాదు. సీనియర్లు ఏం చేయగలరు? కొన్నాళ్ల క్రితం వరకు కూడా మాథ్యూస్‌కు ప్రపంచ క్రికెట్లోని ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. అయితే రాన్రానూ కళ తప్పిన అతను ఒక దశలో జట్టుకు భారంగా మారాడు. వరుస గాయాలతో చాలా వరకు అతను బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు మినహా మిగతా ఐదు ఇన్నింగ్స్‌లలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక అర్ధ సెంచరీ చేసి మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌లలో చెత్త ప్రదర్శన కనబర్చాడు. మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాల్సిన ప్రధాన బ్యాట్స్‌మన్ అయి ఉండీ మాథ్యూస్ గత 17 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. గాయం కారణంగా ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకున్న అతను... ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. ఈ స్థితిలో అతను రాణించడం ఎంతో ముఖ్యం. మరోవైపు వెటరన్ హెరాత్ ఫామ్ మాత్రం లంక జట్టులో ఆశలు రేపుతోంది. పాకిస్తాన్‌పై రెండో టెస్టులో 11 వికెట్లతో చెలరేగిన హెరాత్, అంతకు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై కూడా తన పదును చూపించాడు. అయితే భారత్‌పై హెరాత్ రికార్డు మాత్రం పేలవంగానే ఉంది. భారత్‌పై ఆడిన 9 టెస్టుల్లో 32 వికెట్లు మాత్రమే తీసిన హెరాత్... తన కెరీర్లో అతి చెత్త సగటు (45.96) కూడా భారత్‌పైనే నమోదు చేశాడు. అయితే స్పిన్‌కు అనుకూలమైన పిచ్ తయారైతే మాత్రం మన బ్యాట్స్‌మెన్‌ను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. కుర్రాళ్లకు సవాల్! పాక్‌పై ఇటీవల 2–0తో సాధించిన టెస్టు సిరీస్ విజయం శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కొంత మంది యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ కరుణరత్నే అత్యధిక స్కోరు 196తో సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చండిమాల్ కూడా సెంచరీతో చెలరేగగా... డిక్వెలా కూడా చక్కటి ప్రదర్శన కనబర్చి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో సీనియర్ హెరాత్ మాత్రమే కాకుండా ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా 12 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పిన్‌ను సమర్థంగా ఆడగల పాక్‌ను కట్టడి చేయడంలో లక్మల్, గమగే కూడా సఫలమయ్యారు. ఇప్పుడు వీరంతా అదే స్ఫూర్తి, పట్టుదలతో భారత్‌లో కూడా రాణించాలని భావిస్తున్నారు. భారత్ దుర్భేద్యమైన జట్టు అనడంలో సందేహం లేదు. అయితే ఒక్క రోజు, ఒక్క సెషన్లో తమకు పరిస్థితి అనుకూలంగా మారినా... దానిని సద్వినియోగం చేసుకోగలిగితే యువ లంక జట్టు ఈ సిరీస్‌ను చిరస్మరణీయం చేసుకోగలదు. -
రంగ...రింగ రింగ....
హెరాత్ స్పిన్ మ్యాజిక్ సెమీఫైనల్లో శ్రీలంక 59 పరుగులతో కివీస్ చిత్తు టి20 ప్రపంచ కప్ 21 బంతుల్లో 3 పరుగులు... 5 వికెట్లు... శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ ప్రదర్శన ఇది. ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన అతను... అద్భుత బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశాడు. టి20 క్రికెట్లో ఊహకు కూడా అందని గణాంకాలు నమోదు చేశాడు. కివీస్ రెక్కలు విరిచి ఒంటి చేత్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. హెరాత్ ధాటికి నిలబడలేక న్యూజిలాండ్ కుప్పకూలగా... శ్రీలంక వరుసగా నాలుగోసారి టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చిట్టగాంగ్: శ్రీలంక జట్టు స్పిన్ అస్త్రం బంగ్లా గడ్డపై మరోసారి బ్రహ్మాండంగా పని చేసింది. రంగన హెరాత్ (3.3-2-3-5) సూపర్ బౌలింగ్‌కు తోడు సేనానాయకే (2/3) కూడా రాణించడంతో లంక మరోసారి టి20లో ప్రపంచ కప్ సెమీస్‌కు చేరింది. సోమవారం ఇక్కడి జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో శ్రీలంక 59 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. జయవర్ధనే (32 బంతుల్లో 25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 15.3 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ (43 బంతుల్లో 42; 6 ఫోర్లు) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా, నలుగురు ఆటగాళ్లు సున్నాకే పరిమితయ్యారు. లంక స్పిన్ ధాటికి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హెరాత్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. పాక్/వెస్టిండీస్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే సెమీఫైనల్లో లంక తలపడుతుంది. కట్టడి చేసిన బౌల్ట్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ఏ దశలోనూ వేగంగా సాగలేదు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. బౌల్ట్ (3/20) తక్కువ వ్యవధిలో మూడు వికెట్లతో లంకను దెబ్బ తీశాడు. అతని ధాటికి కుషాల్ పెరీరా (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), దిల్షాన్ (8), సంగక్కర (4) వెంట వెంటనే వెనుదిరిగారు. ఆ తర్వాత జయవర్ధనే, తిరిమన్నె (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) మాత్రం కొద్దిగా ప్రతిఘటించి నాలుగో వికెట్‌కు 30 పరుగులు జత చేశారు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్ (6) కూడా విఫలమయ్యాడు. చివర్లో సేనానాయకే (11 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), తిసార పెరీరా (13 బంతుల్లో 16; 3 ఫోర్లు) కొన్ని పరుగులు జత చేశారు. కివీస్ బౌలర్లలో నీషామ్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. కివీస్ విలవిల బంతికో పరుగు చొప్పున ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో విజయలక్ష్యం... మెకల్లమ్, టేలర్, అండర్సన్‌లాంటి ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్ ఉన్న న్యూజిలాండ్‌కు ఇదేమీ పెద్ద లక్ష్యం కాదనిపించింది. కానీ లంక స్పిన్ ముందు ఆ జట్టు బిత్తరపోయింది. గింగిరాలు తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక ఆ జట్టు ఆటగాళ్లు చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో గుప్తిల్ (5) రనౌట్‌తో ప్రారంభమైన పతనం చివరి వరకు సాగింది. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి బ్రెండన్ మెకల్లమ్ (0) వెనుదిరగ్గా... హెరాత్ బౌలింగ్‌ను ఆడలేక టేలర్ (0), నీషామ్ (0) కెప్టెన్‌ను అనుసరించారు. అయితే సహచరులంతా వెనుదిరుగుతున్నా విలియమ్సన్ మాత్రం పట్టుదలగా ఆడాడు. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా చక్కటి షాట్లు కొట్టాడు. అయితే అతని పోరాటం వృథా అయింది. చేతికి గాయంతో అండర్సన్ బ్యాటింగ్‌కు రాకపోవడం కూడా కివీస్‌ను దెబ్బ తీసినా... జట్టు మొత్తం ఇబ్బంది పడిన చోట అతను ఏ మాత్రం ప్రభావం చూపేవాడో సందేహమే!