కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌.. వీడియో వైరల్‌ | New Zealand Player Nathan Smith Takes A Stunning Flying Catch In 2nd ODI VS Sri Lanka | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌.. వీడియో వైరల్‌

Published Wed, Jan 8 2025 4:19 PM | Last Updated on Wed, Jan 8 2025 4:44 PM

New Zealand Player Nathan Smith Takes A Stunning Flying Catch In 2nd ODI VS Sri Lanka

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ నాథన్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద స్మిత్‌ పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌ పట్టుకున్నాడు. ఛేదనలో లంక ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. 

విలియమ్‌ ఓరూర్కీ బౌలింగ్‌లో లంక బ్యాటర్‌ ఎషాన్‌ మలింగ రూమ్‌ తీసుకుని భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌కీపర్‌ వెనుక భాగంలో డీప్‌ థర్డ్‌ దిశగా గాల్లోకి ఎగిరింది. నాథన్‌ స్మిత్‌ కొద్ది మీటర్ల పాటు స్ప్రింట్‌ చేసి బౌండరీ రోప్‌కు ముందు అద్బుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 

దీని​కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ అభిమానులు నాథన్‌ స్మిత్‌ విన్యాసానికి ముగ్దులవుతున్నారు. సూపర్‌ క్యాచ్‌ అంటూ కొనియాడుతున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక న్యూజిలాండ్‌ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. డారిల్‌ మిచెల్‌ (38), గ్లెన్‌ ఫిలిప్స్‌ (22), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్‌ యంగ్‌ 16, టామ్‌ లాథమ్‌ 1, నాథన్‌ స్మిత్‌ 0, మ్యాట్‌ హెన్రీ 1, విలియమ్‌ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్‌) చేశారు.  

లంక బౌలర్లలో మహీశ్‌ తీక్షణ హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు, ఎషాన్‌ మలింగ, అశిత ఫెర్నాండో తలో వికెట్‌ తీశారు.

అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.  

చమిందు విక్రమసింఘే (17), జనిత్‌ లియనగే (22), అవిష్క ఫెర్నాండో (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కివీస్‌ పేసర్‌ విలియమ్‌ ఓరూర్కీ లంక టాప్‌ స్కోరర్‌ కమిందు వికెట్‌ సహా మూడు వికెట్లు తీశాడు. జాకబ్‌ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్‌ హెన్రీ, నాథన్‌ స్మిత్‌, మిచెల్‌ సాంట్నర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement