
టి-20 ప్రపంచ కప్ సెమీస్: డుమినీ, డుప్లెసిస్ దూకుడు.. భారత్ కు భారీ లక్ష్యం
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా భారత్కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 172 పరుగులు సాధించారు. డుప్లెసిస్ (41 బంతుల్లో 58) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాగా, డుమినీ 45 (నాటౌట్), మిల్లర్ 23 (నాటౌట్), ఆమ్లా 22 పరుగులు చేశారు. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ నాలుగో బంతికే దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ (6)ను అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా భారత బౌలర్లు ఆ తర్వాత సఫారీలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆమ్లా కాసేపు అతనికి అండగా నిలిచాడు. అశ్విన్ ఆమ్లాను క్లీన్ బౌల్డ్ చేసినా డుప్లెసిస్కు డుమినీ జతకలిశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అశ్విన్ మరోసారి చెలరేగి డుప్లెసిస్, డివిల్లీర్స్ను పెవిలియన్ చేర్చాడు. అయితే డుమినీ దూకుడుగా ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేయగలిగింది.