కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితి వీడడంతో టి20 ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది.
కోల్‌కతా: కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితి వీడడంతో టి20 ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. 27 మందితో కూడిన పాక్ క్రికెట్ బృందం అబుదాబి ద్వారా శనివారం రాత్రి స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. భారత్‌లో భద్రతాపరమైన ఇబ్బందులున్నాయని ఆరోపించడంతో పాక్ ఆటగాళ్లను రెండు బస్సుల ద్వారా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో వారు బస చేసే హోటల్‌కు తరలించారు.
వందలాది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు బ్లాక్ కమెండోస్ రక్షణగా ఉన్నారు. అయితే విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన పాక్ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి అద్భుత స్వాగతమే లభించింది. ఆఫ్రిది బృందాన్ని చప్పట్లతో స్వాగతించగా ఆటగాళ్లు కూడా వారికి చేతులూపుతూ వెళ్లారు. సోమవారం ఈ జట్టు శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.