ఆత్మవిశ్వాసమే ఆయుధం | Has found the weapon | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసమే ఆయుధం

Published Tue, Mar 25 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఆత్మవిశ్వాసమే ఆయుధం

ఆత్మవిశ్వాసమే ఆయుధం

‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.  నేను బెంచ్ మీద ఉన్నప్పుడు కూడా మొత్తం జట్టు సహచరులంతా నాకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. నా మీద నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు’      - అమిత్ మిశ్రా
 
 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టి20 ప్రపంచకప్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దుమ్మురేపింది. అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఒకే ఒక్క ప్రధాన తేడా... అమిత్ మిశ్రా. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం గెలిచిన మిశ్రా... ఎంతో కష్టం, బాధ తర్వాత ఈ గౌరవాన్ని పొందాడు.
 
 ఐదు వన్డేల్లో రికార్డు స్థాయిలో 18 వికెట్లు తీసిన బౌలర్‌కి... తర్వాత నాలుగు నెలల పాటు మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోతే ఏమైపోతాడు? వేరే ఎవరైనా అయితే ఏమో... అమిత్ మిశ్రా మాత్రం మరింత రాటుదేలుతాడు. ఇది తన బౌలింగ్‌తోనే చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. నిజానికి ఈ ప్రపంచకప్ ఆరంభంలో భారత్ బలహీనత బౌలింగ్ అనే భావించారు. ఆ బలహీనతే ఇప్పుడు బలంగా మారింది. దీనికి కారణం మిశ్రా.
 
 
బంతుల్లో వైవిధ్యం...


 పాకిస్థాన్ మీద 22 పరుగులకు రెండు వికెట్లు... వెస్టిండీస్‌పై 18 పరుగులకే రెండు వికెట్లు... ఈ రెండు మ్యాచ్‌ల్లో వికెట్లతో పాటు మిశ్రా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. దీంతో భారత బ్యాట్స్‌మెన్ పని సులభమైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ చాలా వైవిధ్యం చూపించాడు. స్లైడర్, గూగ్లీ, లెగ్ స్పిన్నర్... ఇలా ఓ లెగ్‌స్పిన్నర్ దగ్గర ఉండే అస్త్రాలన్నీ ప్రయోగించాడు. బంతి వేగంలో మార్పుతో పాటు... బంతిని ఫ్లయిట్ చేసి బ్యాట్స్‌మెన్‌ను ఊరించి వికెట్లు కొల్లగొట్టాడు. సాధారణంగా లెగ్ స్పిన్నర్‌కు టి20 కష్టమైన ఫార్మాట్. భారీగా పరుగులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మిశ్రా మాత్రం ఏనాడూ ఇబ్బంది పడలేదు. ఐపీఎల్‌లో తొలి సీజన్ నుంచీ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకూ కెరీర్‌లో 118 ఫస్ట్‌క్లాస్ టి20లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్... 118 వికెట్లు తీశాడు.
 

పుష్కరకాలం తర్వాత...

 
మిత్ మిశ్రా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి 13 సంవత్సరాలయింది. తన వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. 2003లో తొలిసారి భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అప్పటికి ధోని ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. 2003 నుంచి 11 సంవత్సరాల్లో మిశ్రా ఆడిన వన్డేలు కేవలం 23 మాత్రమే. నిజానికి 2008 వరకు మిశ్రా పెద్దగా వెలుగులోకి రాలేదు. అనిల్ కుంబ్లే ఉన్నంతకాలం భారత్‌లో మరో లెగ్ స్పిన్నర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. 2008లో ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టు ద్వారా మిశ్రా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి పర్యటనకూ భారత జట్టులో ఉంటున్నాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు.
 
 
ముగ్గురికి చాన్స్ ఉంటేనే...

 గత ఐదేళ్లుగా జట్టుతో పాటే తిరుగుతున్నా... మిశ్రాకు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. కారణం... జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాల స్థానం సుస్థిరం కావడమే. ఈ ఇద్దరిలో ఒకరిని ఆపి మిశ్రాను ఆడించే పరిస్థితి లేదు. కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు ఆడే అవకాశం వస్తే తప్ప మిశ్రాను తుది జట్టులోకి తీసుకోలేదు.   నిజానికి ఇంత మంచి రికార్డు ఉండి, జట్టులో భాగంగా తిరుగుతూ తుది జట్టులో లేకపోతే ఎవరికైనా సహజంగానే నిరాశ కలుగుతుంది. కానీ అమిత్ మిశ్రా మాత్రం దీనిని అధిగమించాడు. ఇక్కడే తన మానసిక ధృఢత్వం బయటపడింది.


సహనంతో తనకు అవకాశం లభించేవరకూ వేచి  చూశాడు. మిశ్రా తుది జట్టులోకి రాకపోవడానికి ధోనియే కారణమంటూ కెప్టెన్‌పై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కానీ మిశ్రా మాత్రం అలా భావించడం లేదు. ‘జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంపిక చేస్తారు. ఆ రోజు మ్యాచ్ ఆడే 11 మంది ఎవరనే విషయం మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగా ముందు మాత్రమే నిర్ణయిస్తారు. మహీ భాయ్ నుంచి నాకు చాలా ప్రోత్సాహం ఉంది’ అని మిశ్రా చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement