LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని | IPL 2025 LSG Vs CSK: MS Dhoni Became The Oldest Player To Win Man Of The Match Award In IPL History, See His Reaction Inside | Sakshi
Sakshi News home page

LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని

Published Tue, Apr 15 2025 9:53 AM | Last Updated on Tue, Apr 15 2025 10:50 AM

IPL 2025 LSG VS CSK: MS Dhoni Became The Oldest Player To Win Man Of The Match Award In IPL History

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై గెలిచిన తొలి మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్‌లో ధోని ముగ్గురిని ఔట్‌ చేయడంలో భాగం కావడంతో పాటు ఛేదనలో అతి మూల్యమైన ఇన్నింగ్స్‌ (11 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) ఆడాడు. 

ఫలితంగా సీఎస్‌కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ స్టేడియం) చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 

ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు ప్రవీణ్‌ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్‌ 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్‌లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్‌ ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న అతి పెద్ద వయస్కులు
ఎంఎస్‌ ధోని- 43 ఏళ్ల 282 రోజులు
ప్రవీణ్‌ తాంబే- 42 ఏళ్ల 200 రోజులు
షేన్‌ వార్న్‌- 41 ఏళ్ల 211 రోజులు
ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌- 41 ఏళ్ల 181 రోజులు

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్‌ అహ్మద్‌ (4-0-13-0), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-1), అన్షుల్‌ కంబోజ్‌ (3-0-20-1) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్‌ మార్ష్‌ (30), ఆయుశ్‌ బదోని (22), అబ్దుల్‌ సమద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ (8), మార్క్రమ్‌ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే.. ఓ దశలో కష్టాలు ఎదుర్కొన్నటికీ శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. 

సీఎస్‌కే ఇన్నింగ్స్‌కు తెలుగు కుర్రాడు షేక్‌ రషీద్‌ (27), రచిన్‌ రవీంద్ర (37) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. రాహుల్‌ త్రిపాఠి (9) వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. రవీంద్ర జడేజా (7), విజయ్‌ శంకర్‌ (9) కూడా నిరాశపరిచారు. 

ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి సీఎస్‌కేను గెలిపించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్‌ (3-0-18-2), మర్క్రమ్‌ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

సీఎస్‌కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 19వ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్‌లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్‌కేను విజయతీరాలు దాటించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement