భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. అక్టోబర్ 6న బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధిస్తే.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.
స్కై ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచ్‌లు ఆడి 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్కైతో పాటు మలేషియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
విరన్‌దీప్ 84 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించాడు. ఈ జాబితాలో స్కై, విరన్‌దీప్, విరాట్ తర్వాత జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (15), ఆఫ్ఘన్ ఆటగాడు మొహమ్మద్ నబీ (14), టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (14) ఉన్నారు.
కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
చదవండి: టీమిండియా స్పీడ్ గన్స్... ఫైరింగ్‌కు సిద్ధం!
Comments
Please login to add a commentAdd a comment