'పాక్ జట్టుకు భద్రత కల్పించలేం'
సిమ్లా: టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈనెల 19న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరగనున్న మ్యాచ్కు పాక్ ఆటగాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి భద్రతా కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరోసారి స్పష్టం చేశారు. వేదికపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పునరాలోచించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ను ధర్మశాలలో జరగనివ్వమని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికుల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. పఠాన్‌కోట్ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన సైనికులు మరణించారని, అమరవీరుల స్మారక స్థూపానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగే ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జరగనివ్వబోమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరోవైపు విదాస్పదంగా మారిన ధర్మశాల స్టేడియంను సందర్శించేందుకు పాక్ అధికారులు భారత్ చేరుకున్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించి పాక్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగానే టి-20 ప్రపంచకప్‌లో ధర్మశాల స్టేడియంలో పాక్ జట్టును ఆడించడంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని, ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ అధికారులతో పాటు పాక్ భద్రతా బృందం సభ్యులు కూడా పాల్గొంటారు.