రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్‌ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది.
వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్‌నెస్‌తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు.
ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్‌నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment