IND VS BAN 2nd Test: మీర్‌పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును ఊడ్చేయాలని భావిస్తుంది. బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోనుంది.
గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ నవ్‌దీప్ సైనీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను సైతం గాయాల బెడద వేధిస్తుంది. వారి కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లా తుది జట్లు కూర్పు ఎలా ఉన్నా.. రాహుల్ సేన మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాళ్లను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో అదరగొట్టిన చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ భారీ మైల్‌స్టోన్స్‌పై కన్నేశారు. రెండో టెస్ట్‌లో నయా వాల్ పుజారా మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. పుజారా ఇప్పటి వరకు 97 టెస్ట్‌ల్లో 44.43 సగటున 6984 పరుగులు చేశాడు.
ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్ట్‌లో అక్షర్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్.. 9 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అక్షర్‌కు 8వ టెస్ట్‌లోనే అశ్విన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఖాతాలో 44 వికెట్లు (7 టెస్ట్‌ల్లో 13 సగటున) ఉన్నాయి.
పుజారా, అక్షర్‌లతో పాటు ఇదే మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టినా.. బుమ్రా పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమిస్తాడు. ఈ ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి 39 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కొనసాగుతుండగా.. అన్నే వికెట్లు పడగొట్టిన సిరాజ్ బంగ్లాతో రెండో టెస్ట్‌లో మరో వికెట్ పడగొడితే బుమ్రా రికార్డును బద్దలు కొడతాడు.
Comments
Please login to add a commentAdd a comment