బుమ్రా కూల్చేశాడు | India lead by 171 runs in the second test | Sakshi
Sakshi News home page

బుమ్రా కూల్చేశాడు

Feb 4 2024 4:02 AM | Updated on Feb 4 2024 4:02 AM

India lead by 171 runs in the second test - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: హైదరాబాద్‌లో మన స్పిన్‌ కుదర్లేదు. మ్యాచ్‌ చేతికందలేదు. కానీ వైజాగ్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్‌లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్‌లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్‌నైట్‌ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది.

అశ్విన్‌ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, డబుల్‌ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్‌ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్‌ (0)లు నిష్క్రమించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్‌ను బుమ్రా పేస్‌ (15.5–5–45–6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది.

జాక్‌ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ స్టోక్స్‌ (47; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్‌ ఆధిక్యం 171కి చేరింది.  

బ్యాట్‌ వదిలేసి... చేతులెత్తేశాడు! 
తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్‌ మొదలైన కాసేపటికి డకెట్‌ (21)ను కుల్దీప్‌ అవుట్‌ చేయడంతో 59 పరుగుల తొలివికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్‌ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్‌ చేశారు.

బుమ్రా పేస్‌కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్‌ ఆడిన క్రాలీని అక్షర్‌ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్‌ ఆటను మలుపు తిప్పింది. రివర్స్‌స్వింగ్‌తో రూట్‌ (5), బుల్లెట్‌లా దూసుకెళ్లిన యార్కర్‌తో ఒలీ పోప్‌లను బుమ్రా అవుట్‌ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ టీ బ్రేక్‌కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్‌లో కుల్దీప్‌ స్పిన్‌ జత కలవడంతో ఇంగ్లండ్‌ కుదేలైంది.

బుమ్రా ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో (25; 4 ఫోర్లు) వికెట్‌ సమర్పించుకోగా... ఫోక్స్‌ (6), రేహన్‌ (6) కుల్దీప్‌ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్‌లో కెప్టెన్‌ స్టోక్స్‌ వికెట్‌ హైలైట్‌గా నిలిచింది. బుమ్రా ఆఫ్‌స్టంప్‌ దిశగా వేసిన కట్టర్‌ను స్టోక్స్‌ డిఫెన్స్‌ ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్‌ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్‌ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్‌లీ (21), అండర్సన్‌ (6)లను పడేశాడు. 

యశస్వి గ్రే ‘టెస్ట్‌’ ఇన్నింగ్స్‌.... 
తొలిరోజు కెప్టెన్ రోహిత్‌తో భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్‌ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్‌తో తన డబుల్‌ సెంచరీని సాకారం చేసుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్‌ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్‌ గావస్కర్‌ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్‌ జైస్వాల్‌. తక్కువ ఇన్నింగ్స్‌ (10వ)ల్లో డబుల్‌ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్‌ నాయర్‌ (3), కాంబ్లీ (4), మయాంక్‌ (8), పుజారా (9) ముందున్నారు. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 396; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: జాక్‌ క్రాలీ (సి) అయ్యర్‌ (బి) అక్షర్‌ 76; డకెట్‌ (సి) రజత్‌ (బి) కుల్దీప్‌ 21; పోప్‌ (బి) బుమ్రా 23; రూట్‌ (సి) గిల్‌ (బి) బుమ్రా 5; బెయిర్‌స్టో (సి) గిల్‌ (బి) బుమ్రా 25; స్టోక్స్‌ (బి) బుమ్రా 47; ఫోక్స్‌ (బి) కుల్దీప్‌ 6; రేహన్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 6; హార్ట్‌లీ (సి) గిల్‌ (బి) బుమ్రా 21; అండర్సన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (55.5 ఓవర్లలో ఆలౌట్‌) 253. వికెట్ల పతనం: 1–59, 2–114, 3–123, 4–136, 5–159, 6–172, 7–182, 8–229, 9–234, 10–253. బౌలింగ్‌: బుమ్రా 15.5–5–45–6, ముకేశ్‌ కుమార్‌ 7–1–44–0, కుల్దీప్‌ 17–1– 71–3, అశ్విన్‌ 12–0–61–0, అక్షర్‌ పటేల్‌ 4–0–24–1.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి (బ్యాటింగ్‌) 15; రోహిత్‌ శర్మ (బ్యాటింగ్‌) 13; మొత్తం (5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 28. బౌలింగ్‌: అండర్సన్‌ 2–0–6–0, బషీర్‌ 2–0–17–0, రేహన్‌ 1–0–5–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement