‘రాయ్’ల్‌గా... ఫైనల్‌కి
► సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
► చెలరేగిన రాయ్, బట్లర్
► టి20 ప్రపంచకప్
ఐపీఎల్ జట్లు తమను తీసుకోలేదన్న కసితో ఉన్నారేమో... భారత గడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతి మ్యాచ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నారు. టోర్నీలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చిన బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్లో చుక్కలు చూపించారు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో... న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్ రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.
న్యూఢిల్లీ: లీగ్ దశలో ఎంత ప్రతిభ చూపినా.... నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్‌ను సెమీస్‌తోనే ముగించింది. ఈ టోర్నీలో అజేయశక్తిలా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో చిత్తు చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మున్రో (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి నెగ్గింది. జాసన్ రాయ్ (44 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఆరంభం ఇవ్వగా... బట్లర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ముగించాడు.
ఆఖర్లో తడబాటు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన గప్టిల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరినా... విలియమ్సన్, మున్రోలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి జోరుతో తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోరు 89/1కు చేరింది. అయితే 11వ ఓవర్‌లో విలియమ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అండర్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా.... 14వ ఓవర్‌లో మున్రోను అవుట్ చేసి ఇంగ్లిష్ బౌలర్లు ట్రాక్‌లోకి వచ్చారు. 16 ఓవర్లలో 133/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉన్న కివీస్‌ను నాణ్యమైన బౌలింగ్‌తో అద్భుతంగా కట్టడి చేశారు. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. దీంతో చివరి 10 ఓవర్లలో కివీస్ 64 పరుగులతో సరిపెట్టుకుంది. స్టోక్స్ 3 వికెట్లు తీశాడు.
అదిరిపోయే ఆరంభం
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్‌లోనే రాయ్ నాలుగు ఫోర్లు బాదితే.. రెండో ఎండ్‌లో హేల్స్ (19 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కూడా దీటుగా స్పందించాడు. మెక్లీంగన్, మిల్నేలకు భారీ సిక్సర్ల రుచి చూపెట్టిన ఈ ఇద్దరు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. దీంతో పవర్‌ప్లేలో 67 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాయ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో హేల్స్‌ను సాంట్నర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఈ దశలో రూట్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. రాయ్ మాత్రం ఎలియట్ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. అయితే 48 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ సోధి వరుస బంతుల్లో రాయ్, మోర్గాన్ (0)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో రూట్ అండతో బట్లర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విజయ లాంఛనం ముగించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 బంతుల్లోనే 49 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) విల్లే 15; విలియమ్సన్ (సి అండ్ బి) అలీ 32; మున్రో (సి) అలీ (బి) ఫ్లంకెట్ 46; అండర్సన్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 28; టేలర్ (సి) మోర్గాన్ (బి) జోర్డాన్ 6; రోంచి (సి) విల్లే (బి) స్టోక్స్ 3; ఎలియట్ నాటౌట్ 4; సాంట్నర్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 7; మెక్లీంగన్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1-17; 2-91; 3-107; 4-134; 5-139; 6-139; 7-150; 8-153.
బౌలింగ్: విల్లే 2-0-17-1; జోర్డాన్ 4-0-24-1; ఫ్లంకెట్ 4-0-38-1; రషీద్ 4-0-33-0; స్టోక్స్ 4-0-26-3; మొయిన్ అలీ 2-0-10-1.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) సోధి 78; హేల్స్ (సి) మున్రో (బి) సాంట్నర్ 20; రూట్ నాటౌట్ 27; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) సోధి 0; బట్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1-82; 2-110; 3-110.
బౌలింగ్: అండర్సన్ 1-0-16-0; మిల్నె 3-0-27-0; మెక్లీంగన్ 3-0-24-0; సాంట్నర్ 3.1-0- 28-1; సోధి 4-0-42-2; ఎలియట్ 3-0-21-0.
► రేసులో మిగిలిన మూడు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్)లో ఎవరు గెలిచినా... రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది.