Guptill
-
పసందైన విందు
ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది. సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్... భారత్‌లో పింక్‌బాల్ టెస్టు... ఓపెనింగ్‌లో రో‘హిట్స్’... బౌలింగ్‌లో దీపక్ చాహర్ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్‌తో హీరోగా మార్చేశాయి. క్రికెట్ లోకానికి పసందైన విందును అందించాయి. ఇంగ్లండ్‌దే వన్డే ప్రపంచం క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్! పురిటిగడ్డపై కొత్త చాంపియన్ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్ ఓవర్’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్’తో ఇంగ్లండ్ విజేత అయ్యింది. ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్ టైటిల్ పోరులో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్’ ఓవర్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్’ ఐసీసీ పుణ్యమాని చెక్ రిపబ్లిక్ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్లో అసోసియేట్, అఫిలియేట్ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ (నెదర్లాండ్స్ 39 ఆలౌట్), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్ శర్మ, మిల్లర్) ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి. టెస్టు ‘క్లాసిక్స్’... సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్)తో కలిసి కుశాల్ పెరీరా (153 నాటౌట్) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆసీస్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ (135 నాటౌట్) కూడా ఆఖరి వరుస బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ (1 నాటౌట్)తో కలిసి అదే పోరాటం చేశాడు. చాహర్ చెడుగుడు... బంగ్లాదేశ్‌తో భారత్‌లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో దీపక్ చాహర్ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్ కోల్పోని రికార్డు భారత్‌ది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో భారత్ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్ 3.2–0–7–6 బౌలింగ్ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్ ఓడిపోని రికార్డు భారత్ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. ‘పేస్’ ఇయర్... ఈ సంవత్సరం ‘పేస్’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్ బౌలర్లే. ఓవరాల్‌గా టాప్–5 బౌలర్లలో నంబర్‌వన్ బౌలర్ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్ (కివీస్) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్ (కివీస్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), భువనేశ్వర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీశాడు. పదేళ్ల తర్వాత... సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది. టెస్టుల్లో లబ్‌షేన్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ‘టాప్’ లేపాడు. 11 మ్యాచ్‌లే ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కావడం విశేషం. స్టీవ్ స్మిత్ (8 మ్యాచ్‌ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ‘టాపర్’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డేల్లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం. బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్‌వెల్ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్‌తో భారత్ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది. భారత్‌లో ఎట్టకేలకు డేనైట్ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఫ్లడ్‌లైట్ల టెస్టు జరిగింది. వీడ్కోలు వీరులు... ఈ ఏడాది పలువురు స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్‌కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్ యువరాజ్ సింగ్ జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
గప్టిల్ సెంచరీ: కివీస్ గెలుపు
నేపియర్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (116 బంతుల్లో 117 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కడదాకా నిలిచి న్యూజిలాండ్‌ను గెలిపించాడు. బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. ముందుగా బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్, సాన్‌ట్నర్ మూడేసి వికెట్లు, హెన్రీ, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసి గెలిచింది. నికోల్స్ (53; 5 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి శుభారంభమిచ్చిన గప్టిల్... టేలర్ (45 నాటౌట్, 6 ఫోర్లు)తో కలిసి 5.3 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో రెండో వన్డే జరుగుతుంది. -
సిమన్స్ స్థానంలో గప్టిల్
గాయంనుంచి కోలుకొని వచ్చి టి20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ముంచిన వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. దాంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు అతను పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ మార్టిన్ గప్టిల్‌ను తీసుకుంది. విధ్వంసకర ఓపెనర్ అయినా ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ స్టార్ గప్టిల్‌ను ఎవరూ తీసుకోలేదు. -
‘రాయ్’ల్గా... ఫైనల్‌కి
► సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ ► చెలరేగిన రాయ్, బట్లర్ ► టి20 ప్రపంచకప్ ఐపీఎల్ జట్లు తమను తీసుకోలేదన్న కసితో ఉన్నారేమో... భారత గడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతి మ్యాచ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నారు. టోర్నీలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చిన బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్లో చుక్కలు చూపించారు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో... న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్ రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. న్యూఢిల్లీ: లీగ్ దశలో ఎంత ప్రతిభ చూపినా.... నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్‌ను సెమీస్‌తోనే ముగించింది. ఈ టోర్నీలో అజేయశక్తిలా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో చిత్తు చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మున్రో (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి నెగ్గింది. జాసన్ రాయ్ (44 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఆరంభం ఇవ్వగా... బట్లర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ముగించాడు. ఆఖర్లో తడబాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన గప్టిల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరినా... విలియమ్సన్, మున్రోలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి జోరుతో తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోరు 89/1కు చేరింది. అయితే 11వ ఓవర్లో విలియమ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అండర్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా.... 14వ ఓవర్లో మున్రోను అవుట్ చేసి ఇంగ్లిష్ బౌలర్లు ట్రాక్‌లోకి వచ్చారు. 16 ఓవర్లలో 133/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉన్న కివీస్‌ను నాణ్యమైన బౌలింగ్‌తో అద్భుతంగా కట్టడి చేశారు. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. దీంతో చివరి 10 ఓవర్లలో కివీస్ 64 పరుగులతో సరిపెట్టుకుంది. స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే రాయ్ నాలుగు ఫోర్లు బాదితే.. రెండో ఎండ్‌లో హేల్స్ (19 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కూడా దీటుగా స్పందించాడు. మెక్లీంగన్, మిల్నేలకు భారీ సిక్సర్ల రుచి చూపెట్టిన ఈ ఇద్దరు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. దీంతో పవర్‌ప్లేలో 67 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాయ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్లో హేల్స్‌ను సాంట్నర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రూట్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. రాయ్ మాత్రం ఎలియట్ ఓవర్లో భారీ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. అయితే 48 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ సోధి వరుస బంతుల్లో రాయ్, మోర్గాన్ (0)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో రూట్ అండతో బట్లర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విజయ లాంఛనం ముగించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 బంతుల్లోనే 49 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) విల్లే 15; విలియమ్సన్ (సి అండ్ బి) అలీ 32; మున్రో (సి) అలీ (బి) ఫ్లంకెట్ 46; అండర్సన్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 28; టేలర్ (సి) మోర్గాన్ (బి) జోర్డాన్ 6; రోంచి (సి) విల్లే (బి) స్టోక్స్ 3; ఎలియట్ నాటౌట్ 4; సాంట్నర్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 7; మెక్లీంగన్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-91; 3-107; 4-134; 5-139; 6-139; 7-150; 8-153. బౌలింగ్: విల్లే 2-0-17-1; జోర్డాన్ 4-0-24-1; ఫ్లంకెట్ 4-0-38-1; రషీద్ 4-0-33-0; స్టోక్స్ 4-0-26-3; మొయిన్ అలీ 2-0-10-1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) సోధి 78; హేల్స్ (సి) మున్రో (బి) సాంట్నర్ 20; రూట్ నాటౌట్ 27; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) సోధి 0; బట్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-82; 2-110; 3-110. బౌలింగ్: అండర్సన్ 1-0-16-0; మిల్నె 3-0-27-0; మెక్లీంగన్ 3-0-24-0; సాంట్నర్ 3.1-0- 28-1; సోధి 4-0-42-2; ఎలియట్ 3-0-21-0. ► రేసులో మిగిలిన మూడు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్)లో ఎవరు గెలిచినా... రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. -
కళాత్మక విధ్వంసం
ప్రతి షాట్ ఓ కళాఖండం... ఓ కళాకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లా అందంగా... అంతకు మించి ఆహ్లాదంగా... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ క్లాస్. ఆ స్ట్రెయిట్ డ్రైవ్‌లు చూడటానికి రెండు కళ్లూ చాలవు. కళాత్మకంగా ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి పంపిన బౌండరీలను పొగడటానికి మాటలు లేవు. మిడ్ వికెట్‌లోకి బలంగా బాదిన సిక్సర్ల గురించి రాయడానికి అక్షరాలు సరిపోవు. ఎవడైనా బౌండరీ లైన్ చూసి కొడతాడు... లేదంటే ప్రేక్షకుల స్టాండ్స్‌లోకి కొడతాడు. అదేంటో... గప్టిల్ గురి పెట్టి స్టేడియం కప్పు మీదకి కొట్టాడు. బంతి బ్యాట్‌ని తాకిన క్షణం నుంచి అది బయటపడేదాకా... ఏదో టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు ఫీల్డర్లు అలా తలలు తిప్పుతూ చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఓ అద్భుతమైన యార్కర్ బౌండరీ లైన్ దాటుతుంటే... ఓ బలమైన బౌన్సర్ సిక్సర్‌గా మారుతుంటే... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు. హ్యాట్సాఫ్... గప్టిల్ అనడం తప్ప..! సాక్షి క్రీడావిభాగం వన్డేల్లో డబుల్ సెంచరీ అనేది ఇప్పుడు చాలా సాధారణంగా మారిందనే అనుకోవాలి. ఈ ప్రపంచకప్‌లోనే రెండోసారి ఈ ఘనత వచ్చేసింది. అయితే గప్టిల్ ఈ రికార్డు సాధిస్తాడనేది ఈ మ్యాచ్‌కు ముందు ఊహకు కూడా రాని ఆలోచన. ఇప్పటివరకు వన్డేల్లో వచ్చిన ఐదు డబుల్ సెంచరీలతో పోలిస్తే... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అనుకోవాలి. ఎందుకంటే... ఇది ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్. క్వార్టర్ ఫైనల్లో ప్రతి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్‌పై ఈ ఒత్తిడి చాలా ఎక్కువ. దీనిని అధిగమిస్తూ ఈ స్థాయిలో ఆడటం అంటే... వాహ్... నిజంగా అమోఘమే. ఆడిన తొలి బంతికే అద్భుతమైన డ్రైవ్‌తో బౌండరీ సాధించిన గప్టిల్... తాను ఎదుర్కొన్న మూడో బంతిని స్క్వేర్‌లెగ్‌లో నేరుగా శామ్యూల్స్ చేతుల్లోకే కొట్టాడు. కానీ శామ్యూల్స్ వదిలేశాడు. ఆ తర్వాత గప్టిల్ ఎక్కడా తడబడలేదు. అద్భుతమైన క్రికెట్ షాట్స్ ఆడాడు. కట్, డ్రైవ్, పుల్ ఇలా అన్నీ సంప్రదాయబద్దమైన షాట్లు ఆడి చూపించాడు. ఇటీవల కాలంలో బాగా పెరిగిన రివర్స్ స్వీప్‌లు, స్కూప్‌లు, స్విచ్ హిట్లు లేవు. సెకండాఫ్ సూపర్ గప్టిల్ ఆడిన 163 బంతుల్లో 65 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే మంచి బంతుల్ని గౌరవించాడు. తన జోన్లో పడ్డ ప్రతి చెత్త బంతినీ బౌండరీ దాటించాడు. 64 బంతుల్లో అర్ధసెంచరీ, 111 బంతుల్లో సెంచరీ చేసేవరకు కూడా గప్టిల్‌లో ఇలాంటి విధ్వంసకర కోణం ఒకటి ఉంటుందని తెలీదు. సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి రావడానికి కేవలం 41 బంతులు సరిపోయాయి. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గప్టిల్ సెంచరీ చేశాడు. టోర్నీ మొత్తం బాగానే ఆడినా బంగ్లాతో మ్యాచ్ ద్వారా పూర్తిగా ఫామ్‌లోకి వచ్చాడు. అది ఇప్పుడు వెస్టిండీస్ కొంప ముంచింది. న్యూజిలాండ్‌లోని చాలా మైదానాలతో పోలిస్తే వెల్లింగ్టన్ చిన్నదేం కాదు. తను కొట్టిన రెండు సిక్సర్లు 100 మీటర్లపైనే వెళ్లాయి. కాబట్టి గప్టిల్ డబుల్‌ను మైదానం చిన్నదనో, ప్రత్యర్థి బౌలింగ్ బాగాలేదనో తక్కువ చేయలేం. మెకల్లమ్ నీడలో.... కెరీర్లో ఆడిన తొలి వన్డేలోనే (2009) సెంచరీ చేసిన గప్టిల్... దక్షిణాఫ్రికాతో టి20లోనూ సెంచరీ చేశాడు. అయినా మెకల్లమ్, రాస్ టేలర్లాంటి స్టార్ హిట్టర్స్ ఉన్న జట్టులో తనో క్లాస్ ఆటగాడిగానే మిగిలాడు తప్ప... ప్రధాన హిట్టర్ అని ఎప్పుడూ, ఎవరూ భావించలేదు. పూర్తిగా క్లాస్ షాట్స్ ఆడటం వల్ల కూడా ఇలా అనుకుని ఉండొచ్చు. ఇంగ్లండ్ మీద 2013లో వన్డేలో 189 పరుగులు చేసి, న్యూజిలాండ్ తరఫున ఈ ఫార్మాట్లో టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. అయినా మెకల్లమ్ నీడలో ఉండిపోయాడు తప్ప... ఆరేళ్ల కెరీర్ ముగిసినా రావలసినంత పేరు రాలేదు. 2013 తర్వాత దాదాపు రెండేళ్ల పాటు తను ఫామ్‌లో లేడు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో సిరీస్ ఆడింది. అందులో తొలి మ్యాచ్‌లో గప్టిల్ డకౌట్ అయ్యాడు. తనని తీసేసి లాథమ్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. కానీ న్యూజిలాండ్ సెలక్టర్లు గప్టిల్‌ను నమ్మారు. ఒకవేళ తీసేసి ఉంటే ఈ కొత్త చరిత్రను ఎవరూ చూసేవారు కాదు. తన మీద జట్టు ఉంచిన నమ్మకానికి గప్టిల్ న్యాయం చేశాడు. మొత్తానికి ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ జాబితాలోకి గప్టిల్ కూడా చేరిపోయాడు. -
గప్టిల్ అర్థ సెంచరీ
నెపియర్: అప్ఘానిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ అర్థ సెంచరీ చేశాడు. 69 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 22 అర్ధసెంచరీ. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గప్టిల్ రనౌటయ్యాడు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ గెలుపువాకిట నిలిచింది. 28.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్ కల్లమ్ 42, విలియమ్సన్ 33 పరుగులు చేసి అవుటయ్యారు