కళాత్మక విధ్వంసం | artistic destruction | Sakshi
Sakshi News home page

కళాత్మక విధ్వంసం

Published Sun, Mar 22 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

కళాత్మక విధ్వంసం

కళాత్మక విధ్వంసం

ప్రతి షాట్ ఓ కళాఖండం... ఓ కళాకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లా అందంగా... అంతకు మించి ఆహ్లాదంగా... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ క్లాస్. ఆ స్ట్రెయిట్ డ్రైవ్‌లు చూడటానికి రెండు కళ్లూ చాలవు. కళాత్మకంగా ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి పంపిన బౌండరీలను పొగడటానికి మాటలు లేవు. మిడ్ వికెట్‌లోకి బలంగా బాదిన సిక్సర్ల గురించి రాయడానికి అక్షరాలు సరిపోవు.
 
ఎవడైనా బౌండరీ లైన్ చూసి కొడతాడు... లేదంటే ప్రేక్షకుల స్టాండ్స్‌లోకి కొడతాడు. అదేంటో... గప్టిల్ గురి పెట్టి స్టేడియం కప్పు మీదకి కొట్టాడు. బంతి బ్యాట్‌ని తాకిన క్షణం నుంచి అది బయటపడేదాకా... ఏదో టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు ఫీల్డర్లు అలా తలలు తిప్పుతూ చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఓ అద్భుతమైన యార్కర్ బౌండరీ లైన్ దాటుతుంటే... ఓ బలమైన బౌన్సర్ సిక్సర్‌గా మారుతుంటే... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు. హ్యాట్సాఫ్... గప్టిల్ అనడం తప్ప..!
 
సాక్షి క్రీడావిభాగం
వన్డేల్లో డబుల్ సెంచరీ అనేది ఇప్పుడు చాలా సాధారణంగా మారిందనే అనుకోవాలి. ఈ ప్రపంచకప్‌లోనే రెండోసారి ఈ ఘనత వచ్చేసింది. అయితే గప్టిల్ ఈ రికార్డు సాధిస్తాడనేది ఈ మ్యాచ్‌కు ముందు ఊహకు కూడా రాని ఆలోచన. ఇప్పటివరకు వన్డేల్లో వచ్చిన ఐదు డబుల్ సెంచరీలతో పోలిస్తే... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అనుకోవాలి. ఎందుకంటే... ఇది ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్. క్వార్టర్ ఫైనల్లో ప్రతి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్‌పై ఈ ఒత్తిడి చాలా ఎక్కువ. దీనిని అధిగమిస్తూ ఈ స్థాయిలో ఆడటం అంటే... వాహ్... నిజంగా అమోఘమే.
 
ఆడిన తొలి బంతికే అద్భుతమైన డ్రైవ్‌తో బౌండరీ సాధించిన గప్టిల్... తాను ఎదుర్కొన్న మూడో బంతిని స్క్వేర్‌లెగ్‌లో నేరుగా శామ్యూల్స్ చేతుల్లోకే కొట్టాడు. కానీ శామ్యూల్స్ వదిలేశాడు. ఆ తర్వాత గప్టిల్ ఎక్కడా తడబడలేదు. అద్భుతమైన క్రికెట్ షాట్స్ ఆడాడు. కట్, డ్రైవ్, పుల్ ఇలా అన్నీ సంప్రదాయబద్దమైన షాట్లు ఆడి చూపించాడు. ఇటీవల కాలంలో బాగా పెరిగిన రివర్స్ స్వీప్‌లు, స్కూప్‌లు, స్విచ్ హిట్‌లు లేవు.
 
సెకండాఫ్ సూపర్
గప్టిల్ ఆడిన 163 బంతుల్లో 65 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే మంచి బంతుల్ని గౌరవించాడు. తన జోన్‌లో పడ్డ ప్రతి చెత్త బంతినీ బౌండరీ దాటించాడు. 64 బంతుల్లో అర్ధసెంచరీ, 111 బంతుల్లో సెంచరీ చేసేవరకు కూడా గప్టిల్‌లో ఇలాంటి విధ్వంసకర కోణం ఒకటి ఉంటుందని తెలీదు. సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి రావడానికి కేవలం 41 బంతులు సరిపోయాయి. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గప్టిల్ సెంచరీ చేశాడు.

టోర్నీ మొత్తం బాగానే ఆడినా బంగ్లాతో మ్యాచ్ ద్వారా పూర్తిగా ఫామ్‌లోకి వచ్చాడు. అది ఇప్పుడు వెస్టిండీస్ కొంప ముంచింది. న్యూజిలాండ్‌లోని చాలా మైదానాలతో పోలిస్తే వెల్లింగ్టన్ చిన్నదేం కాదు. తను కొట్టిన రెండు సిక్సర్లు 100 మీటర్లపైనే వెళ్లాయి. కాబట్టి గప్టిల్ డబుల్‌ను మైదానం చిన్నదనో, ప్రత్యర్థి బౌలింగ్ బాగాలేదనో తక్కువ చేయలేం.
 
మెకల్లమ్ నీడలో....
కెరీర్‌లో ఆడిన తొలి వన్డేలోనే (2009) సెంచరీ చేసిన గప్టిల్... దక్షిణాఫ్రికాతో టి20లోనూ సెంచరీ చేశాడు. అయినా మెకల్లమ్, రాస్ టేలర్‌లాంటి స్టార్ హిట్టర్స్ ఉన్న జట్టులో తనో క్లాస్ ఆటగాడిగానే మిగిలాడు తప్ప... ప్రధాన హిట్టర్ అని ఎప్పుడూ, ఎవరూ భావించలేదు. పూర్తిగా క్లాస్ షాట్స్ ఆడటం వల్ల కూడా ఇలా అనుకుని ఉండొచ్చు. ఇంగ్లండ్ మీద 2013లో వన్డేలో 189 పరుగులు చేసి, న్యూజిలాండ్ తరఫున ఈ ఫార్మాట్‌లో టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. అయినా మెకల్లమ్ నీడలో ఉండిపోయాడు తప్ప... ఆరేళ్ల కెరీర్ ముగిసినా రావలసినంత పేరు రాలేదు.
 
2013 తర్వాత దాదాపు రెండేళ్ల పాటు తను ఫామ్‌లో లేడు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో సిరీస్ ఆడింది. అందులో తొలి మ్యాచ్‌లో గప్టిల్ డకౌట్ అయ్యాడు. తనని తీసేసి లాథమ్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. కానీ న్యూజిలాండ్ సెలక్టర్లు గప్టిల్‌ను నమ్మారు. ఒకవేళ తీసేసి ఉంటే ఈ కొత్త చరిత్రను ఎవరూ చూసేవారు కాదు. తన మీద జట్టు ఉంచిన నమ్మకానికి గప్టిల్ న్యాయం చేశాడు. మొత్తానికి ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ జాబితాలోకి గప్టిల్ కూడా చేరిపోయాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement