ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.
తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.
మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.
రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి.
639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్‌లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు.
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.
113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.
కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment