
దేశం ఆశగా చూస్తోంది... మనసు పెట్టి ఆడండి
ఏ ఫార్మాట్‌లో అయినా జట్టు విజయాలు సాధించాలంటే ఇన్నింగ్స్‌కు పునాది బలంగా ఉండాలి.
టి20 ప్రపంచకప్ తొలిసారి భారత్‌లో జరుగుతుండటం వల్ల కావచ్చు... టోర్నీకి ముందు భారత్ సాధించిన విజయాల వల్ల కావచ్చు... జట్టు మొత్తం స్టార్ క్రికెటర్లతో నిండిపోవడం వల్ల కావచ్చు... కారణం ఏదైనాగానీ ఈసారి భారత్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
మొత్తం దేశం అంతా ధోనిసేన కప్ గెలుస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో మనవాళ్ల ఆటతీరు మాత్రం ఆశించిన విధంగా లేదు. ముఖ్యంగా సురేశ్ రైనా, శిఖర్ ధావన్ అవుటైన తీరు చాలా ఆందోళన కలిగించింది. నిర్లక్ష్యంతో కూడిన సాధారణ షాట్లు ఆడి ఈ ఇద్దరూ అవుటయ్యారు.
బెంగళూరు నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఏ ఫార్మాట్‌లో అయినా జట్టు విజయాలు సాధించాలంటే ఇన్నింగ్స్‌కు పునాది బలంగా ఉండాలి. ఓపెనర్లతో పాటు తర్వాత ఇద్దరూ కూడా నిలకడగా ఆడాలి. టాప్-4 బ్యాట్స్‌మెన్ రాణించిన ప్రతిసారీ కచ్చితంగా ఆ జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క కోహ్లి మినహా టాప్-4లో మిగిలిన ముగ్గురూ విఫలమయ్యారు. రోహిత్ శర్మ ఎప్పుడైనా మ్యాచ్ విన్నరే. ఇటీవల అతను చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క మ్యాచ్‌లో కొద్దిగా కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తాడు.
కానీ శిఖర్ ధావన్, రైనా మాత్రం ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ‘లేజీ షాట్లు’ ఆడి అవుటయ్యారు. వీరి వైఫల్యం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి ఈ టోర్నీకి ముందు భారత్ గెలిచిన అనేక మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమే రాలేదు. దీనివల్ల ఇప్పటికిప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వచ్చి నిలదొక్కుకునే సమయం కూడా లేకుండా షాట్లు ఆడటం ఇబ్బందిగా మారుతుంది.
అదే వైఫల్యం
భారత బౌలర్ ఎవరైనా వికెట్ తీస్తే, ఫీల్డర్ క్యాచ్ పడితే మూడు సెకన్ల లోపు అతడిని చేరుకొని అభినందించే రైనా పాత్ర చూస్తే టీమ్‌లో ప్రస్తుతం చీర్ గర్ల్‌లా కనిపిస్తోంది... సోషల్ మీడియాలో ఏవరో సరదాగా ఈ వ్యాఖ్య చేసినా... వాస్తవం అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. 2015 నుంచి గత 15 టి20 మ్యాచ్‌లలో రైనా కేవలం 2 సార్లు మాత్రమే 30 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన అతను వరల్డ్ కప్‌లోనూ అదే ఆటతీరు కనబరుస్తున్నాడు. 2016లో 13 మ్యాచ్‌లలో కలిపి అతను చేసింది 180 పరుగులే.
బంతి కొంచెం స్పిన్ అయితే, పిచ్‌పై కాస్త బౌన్స్ ఉంటే చాలు పదేళ్ల కెరీర్ తర్వాత కూడా తన వల్ల కాదన్నట్లుగా ముందే అవుట్‌కు సిద్ధమైనట్లు అనిపిస్తుంది. నాలుగో స్థానంలో అతను బరిలోకి దిగడంపై కూడా ఇది సందేహాలు రేకెత్తిస్తోంది. నాగ్‌పూర్‌లో రెండో బంతికే మిడ్ వికెట్‌లో రైనా సునాయాస క్యాచ్ ఇవ్వగా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే ఈ యూపీ బ్యాట్స్‌మన్ ఆట ముగిసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పోరాడే తత్వం, కఠినమైన పరిస్థితుల్లో ఆడగలగడం రైనా ఇంకా నేర్చుకోలేదు.
తరచి చూస్తే అతడి నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఇప్పటివరకు వచ్చినట్లు కనిపించదు. ఫ్లాట్ వికెట్‌లపైనా, ఏడాదికి ఒక పండగలాగా వచ్చే ఐపీఎల్‌లో చెలరేగిపోయే రైనా, మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలోనైనా దూకుడుగా ఆడాల్సి ఉంది. గత ఐదు టి20 ఇన్నింగ్స్‌లలో అతను ప్రతీసారి చేసిన పరుగులకంటే ఎక్కువ బంతులే తీసుకున్నాడు. ఈ ఐదు సందర్భాల్లో ఐదు ఓవర్లకంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చిన రైనాపై చాలా బాధ్యత ఉన్నా దానిని అతను నెరవేర్చలేకపోయాడు. రైనాకు తన సత్తా చాటేందుకు బెంగళూరులో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు మించిన వేదిక, సందర్భం దొరకదు.
నాటి దూకుడు ఏది..?
ఒకప్పుడు శిఖర్ ధావన్ అంటే సెహ్వాగ్ స్థానంలో వచ్చి అతడి ఆటను మరిపించే విధంగా చెలరేగిన హిట్టర్. కానీ కొన్నాళ్లుగా ధావన్ ఆటను చూస్తే అతి సాధారణంగా మారిపోయింది. మరో ఓపెనర్ రోహిత్‌కు సహకరించడమే తప్ప తనదైన శైలిలో దూకుడుగా ఆడటం అతను మర్చిపోయినట్లున్నాడు. ఇటీవల రాంచీలో శ్రీలంకతో మ్యాచ్ మినహా అతడి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. ఆసియా కప్ ఫైనల్లో స్వల్ప లక్ష్యంతో అప్పటికే దాదాపుగా ఫలితం ఖరారైన మ్యాచ్‌లో మాత్రమే శిఖర్ రాణించాడు.
టి20ల్లో అతని స్ట్రయిక్ రేట్ కూడా సాధారణంగా ఉంటోంది. ప్రపంచకప్‌లో కివీస్‌తో మ్యాచ్‌లో అడ్డంగా ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయిన ధావన్... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మరీ ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ఆమిర్‌ను ఎదుర్కొన్న ఏడు బంతుల్లో ఒక్క సింగిల్ మాత్రమే తీసిన అతను 15 బంతుల్లో 6 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఫ్రీ హిట్ బంతికి కూడా అతను పరుగు తీయలేకపోవడం ఊహించగలమా? ఒకవేళ ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహాలో విఫలమైతే... బెంచ్ మీద అవకాశం కూర్చున్న రహానే, దేశవాళీలో చెలరేగుతున్న శ్రేయస్ అయ్యర్‌లాంటి వాళ్ల నైపుణ్యాన్ని చేజేతులా ధావన్ కోసం వృథా చేసుకున్నట్లే.
కెప్టెన్ మద్దతు
ఏ ఆటగాడు విఫలమైనా అతనికి మద్దతుగా నిలబడటంలో ధోనిని మించిన కెప్టెన్ లేడు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇది రుజువయింది కూడా. ప్రస్తుతం ధావన్, రైనాల విషయంలోనూ ధోని వారికి అండగా నిలిచాడు. వాళ్లిద్దరూ పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. మరి కెప్టెన్ నమ్మకాన్ని ఈ ఇద్దరూ ఇప్పటికైనా నిలబెట్టుకుంటారా..?