పాక్‌కు ఊరట విజయం
► ఆఖరి మ్యాచ్‌లో లంకపై గెలుపు
► రాణించిన సర్ఫరాజ్, అక్మల్
► ఆసియా కప్ టి20 టోర్నీ
మిర్పూర్: కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు ఊరట విజయం లభించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. దిల్షాన్ (56 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), చండిమల్ (49 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. పాక్ బౌలర్లు లైన్ తప్పడంతో ఈ ఇద్దరు బౌండరీల మోత మోగించారు. ఆరో ఓవర్‌లో దిల్షాన్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లంక స్కోరు 44/0కు చేరింది. తర్వాత కూడా ఈ జోడి ఓవర్‌కు ఏడు రన్‌రేట్ నమోదు చేయడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది.
నవాజ్ వేసిన 14వ ఓవర్‌లో తొలి సిక్స్ బాదిన చండిమల్ తర్వాతి ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 14.1 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓ ఎండ్‌లో దిల్షాన్ నికలడగా ఆడినా... రెండో ఎండ్‌లో జయసూర్య (4), కపుగెడెర (2), షనక (0)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ ముగ్గురు 10 బంతుల వ్యవధిలో అవుట్‌కావడంతో 117/1గా ఉన్న స్కోరు 125/4గా మారింది. ఇక చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో లంకకు గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది. ఇర్ఫాన్‌కు 2 వికెట్లు పడ్డాయి.
అనంతరం పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (37 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. షార్జిల్ ఖాన్ (24 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. షోయబ్ మాలిక్ (17 బంతుల్లో 13 నాటౌట్), హఫీజ్ (14) ఫర్వాలేదనిపించారు. షార్జిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించిన సర్ఫరాజ్...ఉమర్ అక్మల్‌తో మూడో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. తర్వాత అక్మల్, మాలిక్‌లు నాలుగో వికెట్‌కు 37 బంతుల్లోనే 56 పరుగులు సమకూర్చడంతో పాక్ విజయం ఖాయమైంది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) షార్జిల్ (బి) రియాజ్ 58; దిల్షాన్ నాటౌట్ 75; జయసూర్య (సి) షార్జిల్ (బి) షోయబ్ మాలిక్ 4; కపుగెడెర (బి) ఇర్ఫాన్ 2; షనక (బి) ఇర్ఫాన్ 0; సిరివర్ధన నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1-110; 2-117; 3-125; 4-125.
బౌలింగ్: ఆమిర్ 4-0-31-0; ఇర్ఫాన్ 4-0-18-2; ఆఫ్రిది 4-0-24-0; నవాజ్ (3) 3-0-38-0; రియాజ్ 4-0-30-1; షోయబ్ మాలిక్ 1-0-3-1.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జిల్ ఖాన్ (సి) కపుగెడెర (బి) దిల్షాన్ 31; హఫీజ్ (సి అండ్ బి) జయసూర్య 14; సర్ఫరాజ్ ఎల్బీడబ్ల్యు (బి) సిరివర్ధన 38; ఉమర్ అక్మల్ (సి) పెరీరా (బి) కులశేఖర 48; షోయబ్ మాలిక్ నాటౌట్ 13; ఇఫ్తికార్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19.2 ఓవర్లలో 4 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1-23; 2-58; 3-94; 4-150.
బౌలింగ్: కులశేఖర 4-0-20-1; పెరీరా 2.2-0-25-0; జయసూర్య 1-0-13-1; షనక 1-0-6-0; చమీరా 4-0-32-0; హెరాత్ 4-0-28-0; దిల్షాన్ 1-0-2-1; సిరివర్ధన 2-0-20-1.