Chandimal
-
శ్రీలంక 123/3
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక కష్టాల్లో పడింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 411 పరుగులు వెనుకబడి ఉంది. తిరిమన్నె (41), కెప్టెన్ చండిమాల్ (15), కుశాల్ మెండిస్ (6) ఔట్ కాగా... కుశాల్ పెరీరా (11 బ్యాటింగ్), ధనంజయ డి సిల్వా (1 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న సమయంలో గాయంతో ఓపెనర్ దిముత్ కరుణరత్నే (46) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్, స్టార్క్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 384/4తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 534 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కర్టిస్ ప్యాటర్సన్ (192 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేయగా, టిమ్ పైన్ (45 నాటౌట్) రాణించాడు. కరుణరత్నే క్షేమం... మైదానంలో గాయపడిన లంక బ్యాట్స్‌మన్ కరుణరత్నే ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. లంక ఇన్నింగ్స్ 31వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను తప్పించుకునే ప్రయత్నంలో కరుణరత్నే తలను కుడి వైపుకు తిప్పడంతో బంతి కరుణరత్నే మెడ వెనుక భాగంలో బలంగా తాకింది. ఆ దెబ్బకు అతను మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఆందోళనకు లోనయ్యారు. అయితే స్పృహలోనే ఉండి మెల్లగా మాట్లాడుతుండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు స్ట్రెచర్‌పై బయటకు తీసుకుపోయారు. ఆస్పత్రిలో సాయంత్రం వరకు పరిశీలనలో ఉంచిన అనంతరం కరుణరత్నేకు ప్రమాదం తప్పిందని తేలింది. దాంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. మూడో రోజు అతను బ్యాటింగ్‌కు దిగుతాడా లేదని అనేదానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని లంక బోర్డు ప్రకటించింది. -
శ్రీలంక 144 ఆలౌట్
బ్రిస్బేన్: బౌన్సీ పిచ్‌పై ఆస్ట్రేలియా పేస్ త్రయం కమిన్స్ (4/39), రిచర్డ్సన్ (3/26), స్టార్క్ (2/41) రాణించడంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌటైంది. ఈ డే నైట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక... ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. తిరిమానె (12)ను ఔట్ చేసి కమిన్స్ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. ఓపెనర్ కరుణరత్నె (24) కొంతసేపు నిలిచినా, కెప్టెన్ చండిమాల్ (5), కుశాల్ మెండిస్ (14), రోషన్ సిల్వా (9), ధనంజయ డిసిల్వా (5) పెవిలియన్‌కు వరుస కట్టారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ డిక్వెలా (78 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్... ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (40 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ నాథన్ లయన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
లంక కెప్టెన్, కోచ్‌లపై సస్పెన్షన్ వేటు
దుబాయ్: శ్రీలంక క్రికెట్ వర్గాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. వెస్టిండీస్ పర్యటనలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు మైదానంలో దిగేందుకు ఆలస్యం చేసి క్రికెట్‌ను అపహాస్యం చేసినందుకు ఐసీసీ... లంక సారథి దినేశ్ చండిమాల్, కోచ్ చండిక హతురుసింఘే, మేనేజర్ అసంక గురుసిన్హాలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఏకంగా నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధం విధించింది. గత నెల సెయింట్ లూసియాలో జరిగిన టెస్టులో లంక బంతి ఆకారాన్ని దెబ్బతీసింది. ఫీల్డ్ అంపైర్లు బంతిని మారుస్తామన్నందుకు మైదానంలో దిగేందుకు ససేమిరా అన్నారు. చివరకు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ జోక్యంతో మ్యాచ్ ఆడారు. అయితే ఈ మొత్తం ఉదంతంలో తప్పుతేలడంతో ఇదివరకే చండిమాల్ టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. కాగా... క్రికెట్ క్రీడ ఔన్నత్యం కాపాడేందుకు ఐసీసీ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా లంక వర్గాలు నడుచుకున్నాయని విచారణ కమిషనర్ మైకేల్ బిలాఫ్ తేల్చారు. దీంతో సోమవారం శిక్ష ఖరారు చేశారు. ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరు గంటల పాటు లంక, విండీస్‌ల వాదనలు విన్న ఆయన తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. సోమవారం వెలువరిం చిన తీర్పులో 8 సస్పెన్షన్ పాయింట్లను విధించారు. దీని ప్రకారం ఆరు (4+2) మ్యాచ్‌లు సస్పెండ్ అయ్యా రు. దీంతో చండిమాల్ ఈ నెల 29, ఆగస్టు 1, 5, 8 తేదీల్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేలకు దూరమయ్యాడు. -
చండిమల్‌పై ‘ట్యాంపరింగ్’ అభియోగం
సెయింట్ లూసియా: మళ్లీ ‘బాల్ ట్యాంపరింగ్’ కలకలం చెలరేగింది. ఈసారి వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక బంతి ఆకారాన్ని మార్చినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో స్పందించింది. లంక కెప్టెన్ చండిమల్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించాడని, లెవెల్ 2.2.9 ప్రకారం అతనిపై ‘బాల్ ట్యాంపరింగ్’ అభియోగం మోపుతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (రెండో రోజు ఆట) చివరి సెషన్లో చండిమల్ తన ఎడమ జేబులోంచి స్వీట్ ముక్కల్ని తీసి బంతిపై అదేపనిగా అదిమిపెట్టి రాసినట్లు వీడియో ఫుటేజ్‌లో కనబడినట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు చండిమల్ మాత్రం తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశాడు. ఇకపై కఠిన వైఖరి: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచనప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి అతిక్రమణలపై లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి మార్చి చర్యలు చేపట్టనుంది. అతిక్రమణ లెవెల్ 3కి చేరితే ఆటగాడిపై ఏకంగా నాలుగు టెస్టులు, లేదంటే 8 వన్డేల నిషేధం విధిస్తారు. లంకను ఆదుకున్న మెండిస్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకను కుశాల్ మెండిస్ (85 బ్యాటింగ్) ఆదుకున్నాడు. 34/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మెండిస్, కెప్టెన్ చండిమల్ (39) ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. కడపటి వార్తలందేసరికి శ్రీలంక 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. -
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. లంక కెప్టెన్ చండిమాల్ (36) అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు డిసిల్వా(90) సెంచరీ చెరువలో ఉన్నాడు. క్రీజులోకి వచ్చిన రోషన్ సిల్వాతో డిసిల్వా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత లంక స్కోర్ 147/5. -
చండిమాల్‌కు లైఫ్..డిసిల్వా హాఫ్ సెంచరీ..
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్ డిసిల్వా అర్ధశతకం చేయగా.. చండిమాల్‌కు లైఫ్ దొరికింది. జడేజా వేసిన 43 ఓవర్ మూడో బంతికి చండిమాల్ క్లీన్‌బౌల్డ్ కాగా రిప్లయ్‌లో నోబాల్ కావడంతో లంకకు అదృష్టం కలిసొచ్చింది. ఇక అంతకు ముందు డిసిల్వా 92 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సుతో కెరీర్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించేందుకు డిసిల్వా(72) కెప్టెన్ చండిమాల్(27)లు పోరాడుతున్నారు.45 ఓవర్లలో శ్రీలంక స్కోర్ 119/4. -
మూడో టెస్టు : శ్రీలంక 373 ఆలౌట్
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 పరుగులకు కుప్పకూలింది. 356/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంక 5.3 ఓవర్ల వ్యవధిలోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ వేసిన 135 ఓవర్ మూడో బంతికి చండిమాల్(164) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటవ్వడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్‌కు 163 పరుగుల ఆధిక్యం లభించింది. సెంచరితో జట్టును ఆదుకున్న చండీమల్కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 స్కోరువద్ద డిక్లెర్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ప్రత్యర్థి పోరాటం!
-
ప్రత్యర్థి పోరాటం!
ఎట్టకేలకు శ్రీలంక జట్టు భారత పర్యటనలో చెప్పుకోదగ్గ రీతిలో పోరాటపటిమ కనబర్చింది. ఎదురుగా కొండంత స్కోరు కనిపిస్తున్నా ఒత్తిడిలో కుప్పకూలిపోకుండా రోజంతా నిలబడింది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ చాలా కాలం తర్వాత శతకం సాధించగా, కెప్టెన్ చండిమాల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ కీలక సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి 181 పరుగుల భాగస్వామ్యం లంకను ఫాలోఆన్ నుంచి కాపాడగలిగింది. అయితే ఆ జట్టు 26 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి మళ్లీ వెనుకంజ వేసింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా మూడో టెస్టు భారత్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఒకే వికెట్ చేతిలో ఉన్న లంక ఇంకా 180 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు మంగళవారం ఆరంభంలో ఆ వికెట్ తీయగలిగితే కనీసం రెండు సెషన్ల పాటు ఆడి భారీ లక్ష్యంతో లంకకు సవాల్ విసిరేందుకు టీమిండియాకు అవకాశం ఉంది. అదే జరిగితే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారిపోతున్న స్థితిలో నాలుగు సెషన్లు మళ్లీ నిలబడి మ్యాచ్‌ను కాపాడుకోవడం లంకకు సాధ్యం కాకపోవచ్చు. న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక జట్టు పోరాటం కొనసాగుతోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగిన ఆ జట్టు... భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా చాలా దూరంలోనే నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దినేశ్ చండిమాల్ (341 బంతుల్లో 147 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (268 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు దక్కగా... షమీ, జడేజా, ఇషాంత్ తలా 2 వికెట్లు తీశారు. అతి జాగ్రత్తగా... ఓవర్‌నైట్ స్కోరు 131/3తో సోమవారం ఆట కొనసాగించిన శ్రీలంక తొలి సెషన్లో చాలా జాగ్రత్తగా ఆడింది. పరుగులు చేయడంకంటే వికెట్ కోల్పోకుండా ఉండటంపైనే దృష్టి పెట్టింది. అయితే ఈ క్రమంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాథ్యూస్, చండిమాల్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో బ్యాట్‌ను తాకిన బంతులు ఫీల్డర్లు, కీపర్‌కు అతి సమీపంలో పడ్డా అదృష్టవశాత్తూ సమస్య రాలేదు. ఓపిగ్గా ఆడిన చండిమాల్ 145 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లంక సెషన్ ముగించగలిగింది. కొనసాగిన జోరు... లంచ్ అనంతరం చండిమాల్ 55 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ అవుట్ కోసం భారత్ రివ్యూ కోరి ఫలితం దక్కకపోవడంతో దానిని కోల్పోయింది. కొద్దిసేపటికి ఇషాంత్ బౌలింగ్‌లో ఫోర్‌తో 231 బంతుల్లో మాథ్యూస్ తన కెరీర్లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత అతను శతకం సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత జట్టులో అసహనాన్ని పెంచింది. బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు ప్రయత్నించి ఈ జోడీని విడదీయడంలో విఫలం కాగా, లంక బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు జత చేస్తూ పోయారు. ఎట్టకేలకు అశ్విన్ భారత్‌కు ఆనందం పంచాడు. టీ విరామానికి ముందు చక్కటి బంతితో మాథ్యూస్‌ను వెనక్కి పంపి భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. టపటపా... బ్రేక్ తర్వాత సమరవిక్రమ (61 బంతుల్లో 33; 7 ఫోర్లు) కొద్ది సేపు చండిమాల్‌కు సహకరించాడు. అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్‌తో టెస్టుల్లో చండిమాల్ పదో సెంచరీ పూర్తయింది. ఈ జోడి కూడా నిలదొక్కుకొని భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్న సమయంలో ఇషాంత్ చక్కటి బంతితో సమరవిక్రమ ఆట ముగించాడు. కీపర్ సాహా అంతే అద్భుతంగా ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో 61 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. అంతే... ఆ తర్వాత లంక పతనం వేగంగా సాగింది. ఒక వైపు చండిమాల్ నిలబడినా, మరో ఎండ్‌లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న రోషన్ సిల్వా (0), డిక్వెలా (0), లక్మల్ (5), గమగే (1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయానికి ఐదు నిమిషాల ముందే ఆట నిలిచిపోగా, లంక చివరి వికెట్ పడగొట్టడంలో భారత్ విఫలమైంది. ►10 చండిమాల్ కెరీర్లో ఇది పదో సెంచరీ కాగా... తక్కువ ఇన్నింగ్స్‌లలో (80) ఈ ఘనత సాధించిన లంక ఆటగాడిగా అతను నిలిచాడు. ►476 చండిమాల్, మాథ్యూస్ తమ భాగస్వామ్యంలో కలిసి ఎదుర్కొన్న బంతులు. గత ఐదేళ్లలో భారత గడ్డపై సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన జోడి ఇదే. ► 1981భారత్‌లో జరిగిన టెస్టులో విదేశీ జట్టు ఆటగాళ్లు ఇద్దరు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 1981 తర్వాత ఇదే మొదటిసారి. నాడు బాయ్‌కాట్, క్రిస్ టవర్ (ఇంగ్లండ్) శతకాలు నమోదు చేశారు. మళ్లీ రెండు క్యాచ్‌లు... భారత జట్టు మళ్లీ పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చింది. మూడో రోజు రెండు సునాయాస క్యాచ్‌లు నేలపాలు చేసింది. మాథ్యూస్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇషాంత్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో క్యాచ్ అందుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు. మళ్లీ మాథ్యూస్ 104 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్‌లో మిడాఫ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ విజయ్ శంకర్ కూడా ఇదే విధంగా క్యాచ్ వదిలేశాడు. రెండో రోజు కూడా 6 పరుగుల వద్దే అదృష్టం కలిసొచ్చిన మాథ్యూస్ చివరకు 111 పరుగులు చేయగలిగాడు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత్ దృష్టి పెట్టాల్సిన అంశాల్లో ఇదొకటని చెప్పవచ్చు. -
దక్షిణాఫ్రికాలో ఇలాంటి పిచ్‌పై ఆడతారా!
న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నుంచి కూడా ఆడబోయే ప్రత్యర్థి గురించి కాకుండా భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఆలోచిస్తూ వచ్చింది. అడిగినా, అడగకపోయినా కెప్టెన్ సహా అందరూ సఫారీ టూర్ ప్రాధాన్యత గురించే చెబుతూ వచ్చారు. దానికి సన్నాహకంగా లంకతో 3 టెస్టుల కోసం పచ్చిక ఉన్న పేస్ పిచ్‌లను సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే తాజాగా ఢిల్లీ పిచ్‌పై లంక కెప్టెన్ చండిమాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ‘తాము దక్షిణాఫ్రికా పర్యటన కోసం సిద్ధమవుతున్నామని భారత్ చెబుతూ వచ్చింది. కానీ వారు ఇలాంటి పిచ్‌లు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడి వికెట్‌ను చూస్తే వారు దక్షిణాఫ్రికా సిరీస్‌కు సన్నాహకం చేస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఇది కూడా నాగ్‌పూర్ పిచ్‌లాగే పరుగుల వరద పారేలా ఉంది. కోల్‌కతా కొంత వరకు ఓకే గానీ ఈ రెండు పిచ్‌లు మాత్రం అలా అస్సలు లేవు. మాతో ఆడుతూ తర్వాతి పర్యటన గురించి మాట్లాడటం మమ్మల్ని అవమానించినట్లుగా భావించడం లేదు. వాళ్ల ఆలోచనలను మేం నియంత్రించలేం కదా’ అని అన్నాడు. -
ఓటమికి మా అసమర్థతే కారణం
నాగ్‌పూర్: భారత్‌తో ఘోర పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమల్ అభిప్రాయపడ్డాడు. ఇర రెండో టెస్టులో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో శ్రీలంక దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం చండిమల్ మాట్లాడుతూ.. ‘ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయాల్సింది. కానీ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేయలేనప్పుడు ఏ జట్టుతో పోరాడటమైన కష్టం. పైగా మేము ప్రపంచ దిగ్గజ జట్టుతో ఆడుతున్నాం. టాస్ గెలిచినా ఆటగాళ్లు రాణించలేకపోయారు. నా కెప్టెన్సీలో అత్యంత దారుణ ఓటమి నమోదు కావడం చాలా బాధగా ఉంది. పాక్‌తో సిరీస్ అనంతరం గొప్ప లక్ష్యంతో భారత్‌కు వచ్చాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. మాకు మేం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా బౌలర్లు కొంత మేర పర్వాలేదనిపించారు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు. ఫీల్డింగ్‌లో కూడా మేం దారుణంగా విఫలమయ్యాం.’ అని చండిమల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘోరపరాభవాన్ని మూటకట్టుకున్నందుకు లంక క్రికెటర్లు సిగ్గుపడాలని చురకలంటించాడు. -
లంక కెప్టెన్ చండిమల్ ఫేక్ ఫీల్డింగ్
-
లంక కెప్టెన్ మోసం.. కోహ్లిని పట్టించుకోని అంపైర్లు
సాక్షి, స్పోర్ట్స్ : వివాదాస్పద ఫేక్ ఫీల్డింగ్ వ్యవహారం శ్రీలంక-భారత్ టెస్ట్ మ్యాచ్‌లోనూ ఎదురయ్యింది. మూడో రోజైన శనివారం భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా శ్రీలంక కెప్టెన్ చండిమల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. భారత ఇన్నింగ్స్ 53వ ఓవర్‌ను దసున్ క్షనక బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని భువనేశ్వర్ కవర్స్ వైపు ఆడాడు. బంతికోసం పరిగెత్తిన చండి డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే బంతి ముందుకు వెళ్లిపోయింది. చండి మాత్రం క్రీజు వైపు బంతిని విసిరినట్లు సైగ చేశాడు. ఇంతలో వెనకాలే వచ్చిన మరో ఫీల్డర్ బంతిని అందుకుని క్రీజ్ వైపు విసిరాడు. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడితే పెనాల్టీగా ఐదు పరుగులు బ్యాటింగ్ జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చండిమల్ చేసిన పనిపై అంపైర్లు నిగెల్ లాంగ్-జోయెల్ విల్సన్‌లు చర్చిస్తున్న సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్ గ్యాలరీ వద్ద ఉన్న కోహ్లీ పెనాల్టీ కోసం 5 వేళ్లను సంజ్ఞగా చూపించాడు. కానీ, ఫీల్డ్ అంపైర్లు మాత్రం అతన్ని పట్టించుకోకుండా పెనాల్టీ ఇవ్వకుండానే ఆటను కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జెఎల్టీ కప్ డొమెస్టిక్ మ్యాచ్‌లో క్వీన్స్లాండ్ బుల్స్ ఆటగాడు మార్నస్ లబుస్‌ఛాగ్నె ఇదే రీతిలో ఫేక్ ఫీల్డింగ్‌కు పాల్పడగా.. అంపైర్లు పెనాల్టీ విధించారు. -
అధిపత్యం కొనసాగించేందుకు...
ఓవరాల్‌గా అద్భుతమైన రికార్డు. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ఓటమి లేదు. తాజా ఫామ్ ప్రకారం అయితే తిరుగులేని ప్రదర్శన. శ్రీలంకపై ఇలా అన్ని విధాలా భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే జోరులో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అందుకు తగిన అర్హత, సామర్థ్యం కూడా భారత్‌కు ఉంది. కోహ్లి నాయకత్వంలో గత రెండేళ్లలో సొంతగడ్డపై ప్రతీ జట్టును చిత్తుగా ఓడిం చిన బృందానికి లంకపై సత్తా చాటడం కష్టం కాబోదు. దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకుండా రెండేళ్లుగా నిస్తేజంగా ఉన్న శ్రీలంక క్రికెట్‌కు ఇటీవల టెస్టుల్లో పాకిస్తాన్‌పై సాధించిన విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ గెలుపునకు, భారత్‌తో సిరీస్‌కు పోలిక లేకున్నా ఆ జట్టు ఆత్మవిశ్వాసం పెరిగిందనడంలో సందేహం లేదు. అనుభవం తక్కువగా ఉన్నా తమదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. సొంతగడ్డపై తమను చిత్తుగా ఓడించిన జట్టుకు లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. కోల్‌కతా: భారత్, శ్రీలంక మధ్య తక్కువ వ్యవధిలో వరుస మ్యాచ్‌లను చూస్తూ ఆసక్తి తగ్గిపోయిన క్రికెట్ అభిమానులను మరోసారి అదే పోరు పిలుస్తోంది. నిజానికి భారత గడ్డపై శ్రీలంక టెస్టులు ఆడి తొమ్మిదేళ్లు దాటినా... తరచుగా జరిగిన మ్యాచ్‌ల వల్ల ఈ సిరీస్‌కు ప్రాధాన్యత తగ్గినట్లనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్, లంక సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ చేయలేకపోయింది. విజయ్‌కు నో చాన్స్! గత ఆగస్టులో భారత జట్టు శ్రీలంకతోనే పల్లెకెలెలో తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. నాటి తుది జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆ ఒక్క స్థానం మినహా ఇతర ఆటగాళ్లందరూ కొనసాగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రాణించిన ధావన్, రాహుల్ స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. గాయం నుంచి కోలుకొని మురళీ విజయ్ పునరాగమనం చేసినా... అద్భుత ఆటతీరు కనబర్చిన రాహుల్‌ను తప్పించి విజయ్‌కు అవకాశం లభించడం కష్టం. ఇతర బ్యాట్స్‌మెన్‌లో పుజారా, కోహ్లి, రహానే జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించగలరు. సొంత మైదానంలో సాహా బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం కానుంది. మ్యాచ్ జరిగే పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ పాండ్యా లేకపోవడంతో షమీ, ఉమేశ్‌లతో పాటు మరో రెగ్యులర్ పేసర్‌కు చోటు ఖాయం. ఇషాంత్ రంజీ ట్రోఫీలో రాణించినా... సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో చెలరేగిన భువనేశ్వర్ కుమార్‌కే తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దాదాపుగా దూరమైన స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఈ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు మాత్రమే జట్టులో ఉండే అవకాశం ఉంది. సొంతగడ్డపై అలవోకగా వికెట్లు తీస్తూ వరుస రికార్డులు నెలకొల్పుతూ వచ్చిన అశ్విన్ దానిని కొనసాగించేందుకు ఇది మరో అవకాశం. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్కు అవకాశం ఇస్తారా లేక అదనపు బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మను ఆడిస్తారా చూడాలి. ఈ మైదానంలో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉండటం విశేషం. ఓవరాల్‌గా భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. మాథ్యూస్ రాణించేనా! పాకిస్తాన్‌పై సిరీస్ నెగ్గిన జట్టులో కొన్ని మార్పులు జరగడంతో శ్రీలంక కూడా కొత్త బ్యాటింగ్ ఆర్డర్, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఓపెనర్ కరుణరత్నే మంచి ఫామ్‌లో ఉండగా, కెరీర్లో ఒకే ఒక టెస్టు ఆడిన సమరవిక్రమ రెండో ఓపెనర్‌గా తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ధనంజయ డి సిల్వా, చండిమాల్లపై లంక బ్యాటింగ్ ఆధారపడుతోంది. అయితే ఆ జట్టు విజయావకాశాలు మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉన్నాయి. తన స్థాయికి తగినట్లుగా ఇప్పుడైనా అతను మంచి ప్రదర్శన కనబర్చాలని లంక కోరుకుంటోంది. మాథ్యూస్ నాలుగో స్థానంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. పాక్‌తో సిరీస్‌లో లంక ఐదుగురు బౌలర్లతో ఆడినా యూఏఈలో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నం. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడిస్తుందా లేక ఆల్ రౌండర్ షనకకు అవకాశం ఇస్తుందా చూడాలి. ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా భారత బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం నియంత్రించగలడనేది ఆసక్తికరం. లంక బౌలింగ్ ఆశలు మరోసారి సీనియర్ రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. హెరాత్‌కు భారత్‌పై గొప్ప రికార్డు లేకపోయినా... అతని అనుభవం కీలకం కానుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అతను ప్రమాదకరంగా మారగలడు. మొత్తంగా భారత్‌ను ఢీకొట్టే వనరులు లేకపోయినా ఆ జట్టు సంచలనం సృష్టించాలని పట్టుదలగా ఉంది. ► 0 భారత్‌లో ఆడిన 17 టెస్టుల్లో శ్రీలంక ఒక్కటి కూడా గెలవలేదు. 10 ఓడిన ఆ జట్టు మరో 7 డ్రా చేసుకుంది. ► 8 మరో ఎనిమిది వికెట్లు తీస్తే అశ్విన్ కెరీర్లో 300 వికెట్లు పూర్తవుతాయి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్/కుల్దీప్, సాహా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్వెలా, తిరిమన్నె/షనక, దిల్రువాన్ పెరీరా, లక్మల్, హెరాత్, గమగే/విశ్వ ఫెర్నాండో. పిచ్, వాతావరణం స్పిన్ పిచ్‌తో ప్రత్యర్థిని పడగొట్టాలని కాకుండా ఈసారి భారత మేనేజ్మెంట్ కూడా పేస్‌కు అనుకూలించే వికెట్‌ను కోరుకోవడం విశేషం. బుధవారం కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ రోజుల్లో పిచ్ పొడిబారే అవకాశం కూడా లేదు. ఏకపక్షంగా సాగకుండా బంతికి, బ్యాట్‌కు ఆసక్తికర సమరం జరగవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం మూడు రోజుల పాటు వరుసగా వర్షసూచన ఉంది. ► ఉదయం గం 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సన్నాహకానికి శ్రీలంక సిద్ధం
కోల్‌కతా: ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన జట్టు సభ్యులు ఎవరూ లేరు... ఇటీవల విశేషంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్ కూడా కాదు... దేశవాళీలో అంతంత మాత్రమే గుర్తింపు ఉన్న తృతీయ శ్రేణి ఆటగాళ్లతో తయారు చేసిన జట్టు సిద్ధం! భారత గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉన్న శ్రీలంకకు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాంటి బలహీనమైన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు ఎదురవుతోంది. ఇక్కడి జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్లో ఇరు జట్ల మధ్య రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, తొలి టెస్టుకు ముందు తగిన రీతిలో సాధన చేసేందుకు లంక ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తుండగా... మెరుగైన ఆటతీరు కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించేందుకు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. రంజీ ట్రోఫీ కొనసాగుతున్న నేపథ్యంలో ఐదో రౌండ్ మ్యాచ్‌లలో బరిలోకి దిగని నాలుగు జట్లు హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లతోనే బోర్డు జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. కేరళ ఆటగాడు సంజు శామ్సన్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉండి పునరాగమనం చేస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. సీనియర్ స్పిన్నర్ హెరాత్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండగా, భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడనున్న కెప్టెన్ చండిమాల్ ప్రాక్టీస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాడు. మరోవైపు నలుగురు హైదరాబాద్ ఆటగాళ్లు సందీప్, తన్మయ్ అగర్వాల్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జట్ల వివరాలు శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, తిరిమన్నె, డిక్వెలా, దిల్రువాన్ పెరీరా, హెరాత్, లక్మల్, గమగే, ధనంజయ డి సిల్వ, మాథ్యూస్, సందకన్, విశ్వ ఫెర్నాండో, షనక, రోషన్ సిల్వ. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: సంజు శామ్సన్ (కెప్టెన్), అభిషేక్ గుప్తా, ఆకాశ్ భండారి, అవేష్ ఖాన్, జలజ్ సక్సేనా, జీవన్‌జ్యోత్ సింగ్, రవికిరణ్, రోహన్ ప్రేమ్, బావనక సందీప్, తన్మయ్ అగర్వాల్, సందీప్ వారియర్, అన్మోల్ప్రీత్ సింగ్. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ముంబై: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలి రెండు టెస్టుల కోసం జట్టులోకి ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఇప్పుడు సిరీస్ నుంచి పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించింది. అతనికి తగినంత విశ్రాంతి ఇచ్చేందుకు టీమ్ మేనేజ్మెంట్తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ఇటీవల పాండ్యాపై ‘పనిభారం’ చాలా ఎక్కువైంది. దీని వల్ల మున్ముందు అతను తీవ్ర గాయాలపాలు కాకుండా ముందు జాగ్రత్తగానే విశ్రాంతినిస్తున్నాం. కొన్నాళ్ల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ క్యాంప్‌లో కొనసాగుతాడు’ అని బీసీసీఐ పేర్కొంది. జూన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 33 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే వాటిలో పాండ్యా 30 ఆడాడు. కెప్టెన్ కోహ్లి తర్వాత ఎక్కువ మ్యాచ్‌లలో బరిలోకి దిగింది అతనే. శ్రీలంక గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించిన తర్వాత అతను భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అయితే లంకతో టెస్టు సిరీస్‌లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లతో భారత్ ఆడే అవకాశం ఉండటంతో ఆల్‌రౌండర్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అది కూడా పాండ్యాను తప్పించేందుకు ఒక కారణం అని వినిపిస్తోంది. పాండ్యా స్థానంలో సెలక్షన్ కమిటీ వేరే ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంక దృష్టిలో ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావచ్చు. కానీ మాకు మాత్రం కాదు. రంజీ విరామం సమయంలో ఇది మాకు లభించిన చక్కటి అవకాశం. ఈ మ్యాచ్‌లో లంకను ఓడించేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు సభ్యులందరూ దేశవాళీలో బాగా ఆడుతూ వచ్చిన వారే. ఇక్కడ కూడా వారంతా సత్తా చాటాలని కోరుకుంటున్నా. లంక జట్టులో అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. అయితే మేం కూడా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధం. – సంజు శామ్సన్, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్ -
ఇది ప్రతీకార సిరీస్ కాదు!
కోల్‌కతా: భారత్, శ్రీలంకల మధ్య క్రికెట్ సిరీస్‌లకు కొదవేలేదు. అయినా కానీ... భారత గడ్డపై శ్రీలంకకు టెస్టు విజయం ఇప్పటికీ అందని ద్రాక్షే! 1982 నుంచి 2009 వరకు 17 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్కదాంట్లోనూ గెలవలేకపోయింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన లంక ఈ సారి అత్యంత పటిష్టంగా ఉన్న కోహ్లిసేనకు ఏమాత్రం ఎదురు నిలుస్తుందో చూడాలి. గత టెస్టు సిరీస్ ఆడిన జట్టులో మాథ్యూస్, హెరాత్‌లు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ చండిమాల్ సహా మిగతావారికి భారత్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్. ఈ నేపథ్యంలో అతను టీమిండియాతో సవాలుకు సిద్ధమంటున్నాడు. గురువారం కోచ్ పొథాస్తో కలిసి మీడియాతో మాట్లాడాడు. ‘మా వాళ్లందరికి ఈ పర్యటన పెద్ద చాలెంజ్. అందుకే ప్రాక్టీస్‌లో మేం కఠోరంగా శ్రమించాం. ఇక్కడికి వచ్చేముందు బ్యాంకాక్‌లో నెట్స్‌లో గంటల తరబడి చెమటోడ్చాం. మా జట్టులోని కొత్త ముఖాలు షణక, ధనంజయ డిసిల్వా, రోషన్ సిల్వా, సమరవిక్రమ... వీళ్లంతా భారత్‌లో తమ శక్తిమేర రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల పాకిస్తాన్‌తో యూఏఈ ఉష్ణ వాతావరణంలో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన వ్యూహం పని చేసింది. నలుగురు బౌలర్లతో టెస్టులు గెలవడం అంత సులభం కాదన్న సంగతి మాకు తెలుసు. భారత్‌లాంటి మేటి జట్టుతో మ్యాచ్‌లకు ఒక్క బౌలర్లే ఉంటే సరిపోదు... ఆల్‌రౌండర్లు అవసరం. ఎప్పటికప్పుడు పిచ్ పరిస్థితులను గమనించి జట్టు కూర్పుపై నిర్ణయిస్తాం. మా వ్యూహాలకు పదును పెట్టి ఆతిథ్య జట్టును ఇబ్బందిపెడతాం’ అని చండిమల్ అన్నాడు. ఈ పర్యటనలో కోహ్లి సేనతో లంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కొన్నాళ్ల క్రితం లంకలో టీమిండియా ఈ మూడు సిరీస్‌లను (9–0తో) క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ తాజా పర్యటన ప్రతీకార సిరీస్ కాదని... పెను సవాళ్లతో కూడిన సిరీస్ అని చండిమాల్ అంటున్నాడు. ప్రపంచంలో నంబర్‌వన్ జట్టయిన భారత్ రెండేళ్లుగా బాగా ఆడుతోందని చెప్పాడు. ‘ఇప్పుడు మేం కూడా పాకిస్తాన్ (2–0తో)పై గెలిచే ఇక్కడికొచ్చాం. మాకున్న ప్రణాళికలు, వనరులతో భారత్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. లంక కోచ్ పొథాస్ మాట్లాడుతూ ‘భారత్ చేతిలో అన్ని ఫార్మాట్లలోనూ ఓడాం. నిజమే... కానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఓ మేటి జట్టును ఢీకొనేందుకే ఇక్కడికొచ్చాం. భారత్ ఎంత బాగా ఆడుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మేం కూడా ఎక్కడ మెరుగవ్వాలో అక్కడ శ్రద్ధ పెడతాం. ఫలితాల్ని సాధిస్తాం’ అని అన్నారు. రేపటినుంచి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక... ఈ నెల 16నుంచి జరిగే తొలి టెస్టులో భారత్‌తో తలపడుతుంది. -
చండిమాల్ సెంచరీ
అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ (155 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 227/4తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 154.5 ఓవర్లలో 419 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. -
లక్ష్యం క్లీన్‌స్వీప్
-
లక్ష్యం క్లీన్‌స్వీప్
♦ మరో విజయంపై భారత్ దృష్టి ♦ నేటి నుంచి శ్రీలంకతో మూడో టెస్టు భారత జట్టు తమ టెస్టు చరిత్రలో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను నాలుగు సార్లు క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇవన్నీ సొంతగడ్డపైనే వచ్చాయి. 85 ఏళ్లలో ఒక్కసారి కూడా విదేశాల్లో ఆ ఘనత నమోదు చేయలేదు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం కోహ్లి సేన ముందుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు ప్రత్యర్థి పేలవ ఆటతీరు కూడా భారత్ విజయంపై అంచనాలు పెంచుతోంది. తొలి రెండు టెస్టుల్లాగే ఈ సారి కూడా మన జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తుందా...? స్వదేశంలో వరుస పరాభవాలు ఎదు ర్కొంటున్న శ్రీలంక కాస్తయినా పోటీ ఇచ్చి పరువు కాపాడుకోగలదా చూడాలి. కాండీ: బ్యాటింగ్‌లో జోరు, పేసర్ల దూకుడు, స్పిన్నర్ల సత్తా... వెరసి శ్రీలంక పర్యటనలో భారత జట్టు తిరుగులేని ఆటతీరు కనబరుస్తోంది. తొలి రెండు టెస్టులను భారీ తేడాతో గెలుచుకున్న టీమిండియా అదే ఊపులో మరో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత్, శ్రీలంక మధ్య ఇక్కడి పల్లెకెలె మైదానంలో మూడో టెస్టు జరగనుంది. సీనియర్లు దూరమయ్యాక ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో పాటు కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడటంతో శ్రీలంక పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. రెండు ఓటముల తర్వాత ఈ మ్యాచ్‌లోనైనా కోలుకోవడంపై చండిమాల్ బృందం దృష్టి పెట్టింది. భువీకి చోటు! తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఈ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. మ్యాచ్ ముందు రోజు వరకైతే పచ్చికను తొలగించలేదు. పైగా ఇక్కడి శీతల వాతావరణం కారణంగా స్వింగ్ కూడా ప్రభావం చూపిస్తుంది. మ్యాచ్ రోజు కూడా పిచ్ ఇలాగే ఉంటే సస్పెన్షన్‌కు గురైన జడేజా స్థానంలో మూడో పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రెండో స్పిన్నర్ కూడా అవసరమని భావిస్తే పాండ్యా స్థానంలో భువీ వస్తాడు. అప్పుడు కుల్దీప్కు కూడా అవకాశం దక్కుతుంది. దక్షిణాఫ్రికా నుంచి ఈ మ్యాచ్ కోసం వచ్చిన అక్షర్ పటేల్ బెంచీకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ. వరుస రికార్డులతో చెలరేగిపోతున్న అశ్విన్‌ను ఎదుర్కోవడం కూడా లంకకు సులువు కాదు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, రహానే బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి బెంగ లేదు. ఇక పుజారా అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌లో మరే భారత బ్యాట్స్‌మన్ మూడు మ్యాచుల్లోనూ సెంచరీ చేయలేదు. పుజారా ఆటను చూస్తే అతను ఈ ఘనత సాధించగలడని అనిపిస్తోంది. మొత్తంగా ఎలాంటి లోపాలు లేని విధంగా భారత లైనప్ కనిపిస్తోంది. కెప్టెన్‌గా కోహ్లి వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో మార్పులు చేయనుండటం విశేషం. ముగ్గురు పేసర్లతో... గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక చూపిన పోరాట పటిమ ఆ జట్టుకు విజయాన్ని ఇవ్వలేకపోయింది కానీ టీమ్ సభ్యులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరును మార్చుకుంటే ఫలితాలు రాబట్టవచ్చని ఆ ఇన్నింగ్స్ నిరూపించింది. ఇప్పుడు అదే పట్టుదలను వారు కనబర్చాల్సి ఉంది. ఈ ఏడాది లంక బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కరుణరత్నే మరోసారి కీలకం కానున్నాడు. తన తాజా ఫామ్‌ను అతను మరో రెండు ఇన్నింగ్స్‌ల పాటు కొనసాగించాలని లంక కోరుకుంటోంది. ఇక కుశాల్ మెండిస్, డిక్వెలా కూడా తమ బ్యాటింగ్ సామర్థ్యాన్ని గత మ్యాచ్‌లో చూపించారు. వీరితో పాటు మాథ్యూస్, కెప్టెన్ చండిమాల్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే శ్రీలంక మెరుగైన స్థితిలో నిలుస్తుంది. బౌలింగ్‌లో ఆ జట్టు కూడా ముగ్గురు పేసర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విశ్వ ఫెర్నాండో, గమగేలను ఈ మ్యాచ్ కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేశారు. మూడో బౌలర్‌గా పేసర్ చమీరా లేదా చైనామన్ లక్షణ్ సందకన్లలో ఒకరికి చోటు దక్కుతుంది. విజయం కంటే కూడా ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా లంక పరువు దక్కుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, ఉమేశ్, షమీ, భువనేశ్వర్/ పాండ్యా, కుల్దీప్. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, ధనంజయ డి సిల్వా, దిల్రువాన్ పెరీరా, ఫెర్నాండో, గమగే, చమీరా/ సందకన్. ‘జడేజా లేకపోవడం నిరాశ కలిగించేదే. ఆటగాళ్లకు ఐసీసీ నిబంధనలపై అవగాహన ఉండాలనే మాట వాస్తవం. అయితే నిబంధనల విషయంలో ఐసీసీ అన్ని సమయాలు, సందర్భాల్లో ఒకే తరహా విధానాన్ని పాటిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి విషయంలో ఐసీసీ మరింత స్పష్టతనిస్తే మంచిది.’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ గత మూడేళ్లలో శ్రీలంకలో ఒక్క టెస్టు కూడా ‘డ్రా’ కాలేదు. ఈ మధ్య కాలంలో జరిగిన మొత్తం 18 టెస్టులలోనూ ఫలితం వచ్చింది. పిచ్, వాతావరణం పల్లెకెలె మైదానం సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలం. మంచి బౌన్స్‌తో పాటు ఆరంభంలో స్వింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. కొద్దిగా నిలబడితే ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. ఇక్కడ వర్షం చాలా సహజం. కాబట్టి మ్యాచ్‌కు అప్పుడప్పుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మరీ ఇంత చెత్త ప్రదర్శనా?
కొలంబో: భారత్ తో జరిగిన వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాజయం చెందడంపై శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధానంగా రెండో టెస్టులో ఇన్నింగ్ప్ పరాజయాన్ని మూటగట్టుకోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తరువాత మాట్లాడిన చండిమాల్.. తమ ఇన్నింగ్సే ఎక్కువ నిరూత్సాహపరిచిందన్నాడు. పర్యాటక జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆరొందలకు పైగా స్కోరు చేస్తే, ఆతిథ్య జట్టైన తాము మరీ ఘోరంగా రెండొందల లోపే ఆలౌట్ కావడం బాధించిందన్నాడు. అసలు ఇంతటి చెత్త ప్రదర్శను తాను ఊహించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నిజంగా భారత జట్టు ప్రదర్శన అమోఘంగా ఉందన్నాడు. వారు తొలుత భారీ పరుగులు చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారన్నాడు.కాకపోతే తాము స్థాయికి తగ్గ ఆటను ఆడలేదని వాస్తవాన్ని చండిమాల్ అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఇన్నింగ్స్ విజయంలో్ సహకరించిన భారత స్పిన్నర్ పై చండిమాల్ ప్రశంసలు కురిపించాడు. అతను నిజంగా ప్రత్యేకమైన బౌలర్ అని అభివర్ణించాడు. జడేజా ఒక వైవిధ్యమైన బౌలర్ కాబట్టే నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడని కొనియాడాడు. -
చండిమల్ సెంచరీ
కొలంబో: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగుల వద్ద ఆలౌటైంది. 238/7 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు సరిగ్గా మరో 100 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయారు. ఓవర్ నైట్ ఆటగాడు చండిమల్(138; 300 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయడంతో లంక గౌరవప్రదమైన స్కోరును సాధించింది. హెరాత్ తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన చండిమల్.. లక్మల్ తో కలిసి మరో 55 పరుగుల్ని జత చేశాడు. దాంతో లంకేయులు మూడొందల మార్కును చేరారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహది హసన్ మిరజ్ మూడు వికెట్లు సాధించగా,ముస్తఫిజుర్ రెహ్మాన్, సుభాశిస్ రాయ్,షకిబుల్ హసన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
శ్రీలంక 238/7
కొలంబో: బంగ్లాదేశ్‌తో బుధవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు శ్రీలంక ఏడు వికెట్లకు 238 పరుగులు చేసింది. చండిమల్ (86 బ్యాటింగ్), హెరాత్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తమ వందో టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ టాస్ ఓడిపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, మిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. -
పోరాడి సెంచరీ చేసిన లంక బ్యాట్స్‌మన్
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు దినేష్ చండీమల్ సెంచరీ(102)తో రాణించడంతో జట్టు గౌరవప్రదస్కోరు చేసింది. ఆసీస్ ముందు 227 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 49.2ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటయింది. తొలి ఓవర్లోనే లంకకు స్టార్క్ షాకిచ్చాడు. గుణతిలక(5)ను వెనక్కి పంపాడు. తన కెరీర్ లో చివరి వన్డే మ్యాచ్ ఆడుతున్న దిల్షాన్ (65 బంతుల్లో 42, 5 ఫోర్లు) రాణించాడు. అయితే ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక వరుస విరామాలలో వికెట్లు కోల్పోయింది. అయితే టాపార్డర్ బ్యాట్స్ మన్ చండీమల్(130 బంతుల్లో 102, 7 ఫోర్లు) చివరి ఓవర్ వరకూ నిలిచి జట్టుకు పరుగులు జోడించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఫాల్కనర్ బౌలింగ్ లో చండీమల్ ఇచ్చిన క్యాచ్ ను జంపా పట్టడంతో 226 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హెస్టింగ్స్, ఫాల్కనర్ తలో రెండు వికెట్లు తీయగా, హజెల్ వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. -
ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు
మాలాహైడ్ (ఐర్లాండ్): ఆల్‌రౌండర్ షనక (42; 5/43) దుమ్మురేపడంతో... గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 76 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఐర్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు చేసింది. చండిమల్ (107 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. తర్వాత ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్‌ఫీల్డ్ (73), కెవిన్ ఓబ్రియాన్ (64) మినహా మిగతా వారు విఫలమయ్యారు. వర్షం వల్ల ఐర్లాండ్‌కు 47 ఓవర్లలో 293 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. -
బంతి తగిలి సిల్వకు గాయం
కొలంబో: శ్రీలంక టెస్టు క్రికెటర్ కౌశల్ సిల్వ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నాహాల్లో భాగంగా పల్లెకెలెలో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశల్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, చండీమల్ కొట్టిన షాట్ బలంగా అతని మెడ కింది భాగంలో తగిలింది. ఆ సమయంలో సిల్వ హెల్మెట్ పెట్టుకొనే ఉన్నాడు. కొద్దిసేపు అతను స్పృహ కోల్పోయినట్లు కనిపించాడు. దాంతో హుటాహుటిన సమీపంలో కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ జరిపారు. అనంతరం వెంటనే విమానంలో కొలంబోకు తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని, పరిస్థితి నిలకడగా ఉందని లంక బోర్డు ప్రకటించింది. లంక తరఫున కౌశల్ 24 టెస్టులు ఆడాడు. -
పాక్‌కు ఊరట విజయం
► ఆఖరి మ్యాచ్‌లో లంకపై గెలుపు ► రాణించిన సర్ఫరాజ్, అక్మల్ ► ఆసియా కప్ టి20 టోర్నీ మిర్పూర్: కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు ఊరట విజయం లభించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. దిల్షాన్ (56 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), చండిమల్ (49 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. పాక్ బౌలర్లు లైన్ తప్పడంతో ఈ ఇద్దరు బౌండరీల మోత మోగించారు. ఆరో ఓవర్లో దిల్షాన్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లంక స్కోరు 44/0కు చేరింది. తర్వాత కూడా ఈ జోడి ఓవర్‌కు ఏడు రన్‌రేట్ నమోదు చేయడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. నవాజ్ వేసిన 14వ ఓవర్లో తొలి సిక్స్ బాదిన చండిమల్ తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 14.1 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓ ఎండ్‌లో దిల్షాన్ నికలడగా ఆడినా... రెండో ఎండ్‌లో జయసూర్య (4), కపుగెడెర (2), షనక (0)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ ముగ్గురు 10 బంతుల వ్యవధిలో అవుట్‌కావడంతో 117/1గా ఉన్న స్కోరు 125/4గా మారింది. ఇక చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో లంకకు గౌరవ ప్రదమైన స్కోరు దక్కింది. ఇర్ఫాన్‌కు 2 వికెట్లు పడ్డాయి. అనంతరం పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (37 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. షార్జిల్ ఖాన్ (24 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు)లు చెలరేగి ఆడారు. షోయబ్ మాలిక్ (17 బంతుల్లో 13 నాటౌట్), హఫీజ్ (14) ఫర్వాలేదనిపించారు. షార్జిల్తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించిన సర్ఫరాజ్...ఉమర్ అక్మల్‌తో మూడో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. తర్వాత అక్మల్, మాలిక్‌లు నాలుగో వికెట్‌కు 37 బంతుల్లోనే 56 పరుగులు సమకూర్చడంతో పాక్ విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: చండిమల్ (సి) షార్జిల్ (బి) రియాజ్ 58; దిల్షాన్ నాటౌట్ 75; జయసూర్య (సి) షార్జిల్ (బి) షోయబ్ మాలిక్ 4; కపుగెడెర (బి) ఇర్ఫాన్ 2; షనక (బి) ఇర్ఫాన్ 0; సిరివర్ధన నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-110; 2-117; 3-125; 4-125. బౌలింగ్: ఆమిర్ 4-0-31-0; ఇర్ఫాన్ 4-0-18-2; ఆఫ్రిది 4-0-24-0; నవాజ్ (3) 3-0-38-0; రియాజ్ 4-0-30-1; షోయబ్ మాలిక్ 1-0-3-1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జిల్ ఖాన్ (సి) కపుగెడెర (బి) దిల్షాన్ 31; హఫీజ్ (సి అండ్ బి) జయసూర్య 14; సర్ఫరాజ్ ఎల్బీడబ్ల్యు (బి) సిరివర్ధన 38; ఉమర్ అక్మల్ (సి) పెరీరా (బి) కులశేఖర 48; షోయబ్ మాలిక్ నాటౌట్ 13; ఇఫ్తికార్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19.2 ఓవర్లలో 4 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1-23; 2-58; 3-94; 4-150. బౌలింగ్: కులశేఖర 4-0-20-1; పెరీరా 2.2-0-25-0; జయసూర్య 1-0-13-1; షనక 1-0-6-0; చమీరా 4-0-32-0; హెరాత్ 4-0-28-0; దిల్షాన్ 1-0-2-1; సిరివర్ధన 2-0-20-1. -
తడబడ్డా.. నిలబడ్డారు!
యూఏఈపై శ్రీలంక గెలుపు రాణించిన చండిమల్ ఆసియా కప్ మిర్పూర్: చిన్న ప్రత్యర్థిని మొదట తేలికగా తీసుకున్న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక... బ్యాటింగ్‌లో తడబడినా... నాణ్యమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని కట్టడి చేసి ఆసియా కప్ టి20 టోర్నీలో బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 14 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. చండిమల్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, దిల్షాన్ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... యూఏఈ బౌలర్ల ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. జావేద్ 3, నవీద్, షెహజాద్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. స్వప్నిల్ పాటిల్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. తొలి ఓవర్లోనే మలింగ... ముస్తఫా (0), షెహజాద్ (1)లను అవుట్ చేసి యూఏఈకి షాకిచ్చాడు. తర్వాత కులశేఖర తన రెండో ఓవర్లో కలీమ్ (7), ఉస్మాన్ (6)లను వెనక్కిపంపాడు. హెరాత్ వచ్చి రావడంతోనే తన తొలి రెండు ఓవర్లలో అన్వర్ (13), హైదర్ (1) వికెట్ తీయడంతో యూఏఈ 47 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. ఇక రెండు వైపుల నుంచి లంక బౌలర్లు ఒత్తిడి పెంచడంతో యూఏఈ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించాక... పాటిల్, అంజద్ జావేద్ (13)లతో పాటు నవీద్ (10)లు వరుస ఓవర్లలో అవుట్‌కావడం దెబ్బతీసింది. -
డు ప్లెసిస్, చండీమాల్‌లపై మ్యాచ్ నిషేధం
చిట్టగాంగ్: టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లకు కీలక దశలో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్, శ్రీలంక సారథి దినేశ్ చండీమాల్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక టి20 మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో ఈ రెండు జట్ల తదుపరి మ్యాచ్‌లకు డుప్లెసిస్, చండీమాల్లు డగౌట్‌కే పరిమితం కానున్నారు. ఈ నెల 27న చిట్టగాంగ్‌లో జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై శ్రీలంక స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఐసీసీ రిఫరీ డేవిడ్ బూన్ ఇద్దరు కెప్టెన్లపై ఒక టి20 నిషేధం, మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా జట్టు 12 నెలల కాలంలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఆర్టికల్ 2.5.1 ఐసీసీ క్రమశిక్షణ నియమావళి కింద ఆ టీమ్ కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. డు ప్లెసిస్, చండీమాల్‌లపై సస్పెన్షన్ కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఆడే తదుపరి మ్యాచ్‌లకు డివిలియర్స్(29న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు), మలింగ(31న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.