లంక కెప్టెన్, కోచ్‌లపై సస్పెన్షన్‌ వేటు | Lanka captain and coach suspension | Sakshi
Sakshi News home page

లంక కెప్టెన్, కోచ్‌లపై సస్పెన్షన్‌ వేటు

Published Tue, Jul 17 2018 12:56 AM | Last Updated on Tue, Jul 17 2018 12:56 AM

Lanka captain and coach suspension - Sakshi

దుబాయ్‌: శ్రీలంక క్రికెట్‌ వర్గాలపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. వెస్టిండీస్‌ పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు మైదానంలో దిగేందుకు ఆలస్యం చేసి క్రికెట్‌ను అపహాస్యం చేసినందుకు ఐసీసీ... లంక సారథి దినేశ్‌ చండిమాల్, కోచ్‌ చండిక హతురుసింఘే, మేనేజర్‌ అసంక గురుసిన్హాలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏకంగా నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధం విధించింది. గత నెల సెయింట్‌ లూసియాలో జరిగిన టెస్టులో లంక బంతి ఆకారాన్ని దెబ్బతీసింది. ఫీల్డ్‌ అంపైర్లు బంతిని మారుస్తామన్నందుకు మైదానంలో దిగేందుకు ససేమిరా అన్నారు. చివరకు మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ జోక్యంతో మ్యాచ్‌ ఆడారు.

అయితే ఈ మొత్తం ఉదంతంలో తప్పుతేలడంతో ఇదివరకే చండిమాల్‌ టెస్టు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. కాగా... క్రికెట్‌ క్రీడ ఔన్నత్యం కాపాడేందుకు ఐసీసీ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా లంక వర్గాలు నడుచుకున్నాయని విచారణ కమిషనర్‌ మైకేల్‌ బిలాఫ్‌ తేల్చారు. దీంతో సోమవారం శిక్ష ఖరారు చేశారు. ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరు గంటల పాటు లంక, విండీస్‌ల వాదనలు విన్న ఆయన తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. సోమవారం వెలువరిం చిన తీర్పులో 8 సస్పెన్షన్‌ పాయింట్లను విధించారు. దీని ప్రకారం ఆరు (4+2) మ్యాచ్‌లు సస్పెండ్‌ అయ్యా రు. దీంతో చండిమాల్‌ ఈ నెల 29, ఆగస్టు 1, 5, 8 తేదీల్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేలకు దూరమయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement