
కోల్‌కతా: భారత్, శ్రీలంకల మధ్య క్రికెట్ సిరీస్‌లకు కొదవేలేదు. అయినా కానీ... భారత గడ్డపై శ్రీలంకకు టెస్టు విజయం ఇప్పటికీ అందని ద్రాక్షే! 1982 నుంచి 2009 వరకు 17 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్కదాంట్లోనూ గెలవలేకపోయింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన లంక ఈ సారి అత్యంత పటిష్టంగా ఉన్న కోహ్లిసేనకు ఏమాత్రం ఎదురు నిలుస్తుందో చూడాలి. గత టెస్టు సిరీస్ ఆడిన జట్టులో మాథ్యూస్, హెరాత్‌లు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ చండిమాల్ సహా మిగతావారికి భారత్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్. ఈ నేపథ్యంలో అతను టీమిండియాతో సవాలుకు సిద్ధమంటున్నాడు. గురువారం కోచ్ పొథాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడాడు. ‘మా వాళ్లందరికి ఈ పర్యటన పెద్ద చాలెంజ్. అందుకే ప్రాక్టీస్‌లో మేం కఠోరంగా శ్రమించాం. ఇక్కడికి వచ్చేముందు బ్యాంకాక్‌లో నెట్స్‌లో గంటల తరబడి చెమటోడ్చాం. మా జట్టులోని కొత్త ముఖాలు షణక, ధనంజయ డిసిల్వా, రోషన్ సిల్వా, సమరవిక్రమ... వీళ్లంతా భారత్‌లో తమ శక్తిమేర రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల పాకిస్తాన్‌తో యూఏఈ ఉష్ణ వాతావరణంలో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన వ్యూహం పని చేసింది. నలుగురు బౌలర్లతో టెస్టులు గెలవడం అంత సులభం కాదన్న సంగతి మాకు తెలుసు.
భారత్‌లాంటి మేటి జట్టుతో మ్యాచ్‌లకు ఒక్క బౌలర్లే ఉంటే సరిపోదు... ఆల్‌రౌండర్లు అవసరం. ఎప్పటికప్పుడు పిచ్ పరిస్థితులను గమనించి జట్టు కూర్పుపై నిర్ణయిస్తాం. మా వ్యూహాలకు పదును పెట్టి ఆతిథ్య జట్టును ఇబ్బందిపెడతాం’ అని చండిమల్ అన్నాడు. ఈ పర్యటనలో కోహ్లి సేనతో లంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కొన్నాళ్ల క్రితం లంకలో టీమిండియా ఈ మూడు సిరీస్‌లను (9–0తో) క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ తాజా పర్యటన ప్రతీకార సిరీస్ కాదని... పెను సవాళ్లతో కూడిన సిరీస్ అని చండిమాల్ అంటున్నాడు. ప్రపంచంలో నంబర్‌వన్ జట్టయిన భారత్ రెండేళ్లుగా బాగా ఆడుతోందని చెప్పాడు. ‘ఇప్పుడు మేం కూడా పాకిస్తాన్ (2–0తో)పై గెలిచే ఇక్కడికొచ్చాం. మాకున్న ప్రణాళికలు, వనరులతో భారత్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. లంక కోచ్ పొథాస్ మాట్లాడుతూ ‘భారత్ చేతిలో అన్ని ఫార్మాట్లలోనూ ఓడాం. నిజమే... కానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఓ మేటి జట్టును ఢీకొనేందుకే ఇక్కడికొచ్చాం. భారత్ ఎంత బాగా ఆడుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మేం కూడా ఎక్కడ మెరుగవ్వాలో అక్కడ శ్రద్ధ పెడతాం. ఫలితాల్ని సాధిస్తాం’ అని అన్నారు.
రేపటినుంచి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక... ఈ నెల 16నుంచి జరిగే తొలి టెస్టులో భారత్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment