కోల్‌కతా: ఫామ్, ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాన జట్టు సభ్యులు ఎవరూ లేరు... ఇటీవల విశేషంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లతో కూడిన ‘ఎ’ టీమ్ కూడా కాదు... దేశవాళీలో అంతంత మాత్రమే గుర్తింపు ఉన్న తృతీయ శ్రేణి ఆటగాళ్లతో తయారు చేసిన జట్టు సిద్ధం! భారత గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉన్న శ్రీలంకకు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇలాంటి బలహీనమైన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు ఎదురవుతోంది. ఇక్కడి జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, తొలి టెస్టుకు ముందు తగిన రీతిలో సాధన చేసేందుకు లంక ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తుండగా... మెరుగైన ఆటతీరు కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించేందుకు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. రంజీ ట్రోఫీ కొనసాగుతున్న నేపథ్యంలో ఐదో రౌండ్ మ్యాచ్‌లలో బరిలోకి దిగని నాలుగు జట్లు హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లతోనే బోర్డు జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. కేరళ ఆటగాడు సంజు శామ్సన్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉండి పునరాగమనం చేస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. సీనియర్ స్పిన్నర్ హెరాత్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండగా, భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడనున్న కెప్టెన్ చండిమాల్ ప్రాక్టీస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాడు. మరోవైపు నలుగురు హైదరాబాద్ ఆటగాళ్లు సందీప్, తన్మయ్ అగర్వాల్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జట్ల వివరాలు
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, తిరిమన్నె, డిక్‌వెలా, దిల్‌రువాన్ పెరీరా, హెరాత్, లక్మల్, గమగే, ధనంజయ డి సిల్వ, మాథ్యూస్, సందకన్, విశ్వ ఫెర్నాండో, షనక, రోషన్ సిల్వ.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్: సంజు శామ్సన్ (కెప్టెన్), అభిషేక్ గుప్తా, ఆకాశ్ భండారి, అవేష్ ఖాన్, జలజ్ సక్సేనా, జీవన్‌జ్యోత్ సింగ్, రవికిరణ్, రోహన్ ప్రేమ్, బావనక సందీప్, తన్మయ్ అగర్వాల్, సందీప్ వారియర్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్.
హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి
ముంబై: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలి రెండు టెస్టుల కోసం జట్టులోకి ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఇప్పుడు సిరీస్ నుంచి పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించింది. అతనికి తగినంత విశ్రాంతి ఇచ్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ఇటీవల పాండ్యాపై ‘పనిభారం’ చాలా ఎక్కువైంది. దీని వల్ల మున్ముందు అతను తీవ్ర గాయాలపాలు కాకుండా ముందు జాగ్రత్తగానే విశ్రాంతినిస్తున్నాం. కొన్నాళ్ల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ క్యాంప్‌లో కొనసాగుతాడు’ అని బీసీసీఐ పేర్కొంది. జూన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నుంచి మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్ 33 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే వాటిలో పాండ్యా 30 ఆడాడు. కెప్టెన్ కోహ్లి తర్వాత ఎక్కువ మ్యాచ్‌లలో బరిలోకి దిగింది అతనే. శ్రీలంక గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించిన తర్వాత అతను భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అయితే లంకతో టెస్టు సిరీస్‌లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లతో భారత్ ఆడే అవకాశం ఉండటంతో ఆల్‌రౌండర్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అది కూడా పాండ్యాను తప్పించేందుకు ఒక కారణం అని వినిపిస్తోంది. పాండ్యా స్థానంలో సెలక్షన్ కమిటీ వేరే ఎవరినీ ఎంపిక చేయలేదు.
శ్రీలంక దృష్టిలో ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావచ్చు. కానీ మాకు మాత్రం కాదు. రంజీ విరామం సమయంలో ఇది మాకు లభించిన చక్కటి అవకాశం. ఈ మ్యాచ్‌లో లంకను ఓడించేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు సభ్యులందరూ దేశవాళీలో బాగా ఆడుతూ వచ్చిన వారే. ఇక్కడ కూడా వారంతా సత్తా చాటాలని కోరుకుంటున్నా. లంక జట్టులో అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. అయితే మేం కూడా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధం.
– సంజు శామ్సన్, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment