ఎట్టకేలకు శ్రీలంక జట్టు భారత పర్యటనలో చెప్పుకోదగ్గ రీతిలో పోరాటపటిమ కనబర్చింది. ఎదురుగా కొండంత స్కోరు కనిపిస్తున్నా ఒత్తిడిలో కుప్పకూలిపోకుండా రోజంతా నిలబడింది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ చాలా కాలం తర్వాత శతకం సాధించగా, కెప్టెన్ చండిమాల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ కీలక సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి 181 పరుగుల భాగస్వామ్యం లంకను ఫాలోఆన్ నుంచి కాపాడగలిగింది. అయితే ఆ జట్టు 26 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి మళ్లీ వెనుకంజ వేసింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా మూడో టెస్టు భారత్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఒకే వికెట్ చేతిలో ఉన్న లంక ఇంకా 180 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు మంగళవారం ఆరంభంలో ఆ వికెట్ తీయగలిగితే కనీసం రెండు సెషన్ల పాటు ఆడి భారీ లక్ష్యంతో లంకకు సవాల్ విసిరేందుకు టీమిండియాకు అవకాశం ఉంది. అదే జరిగితే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారిపోతున్న స్థితిలో నాలుగు సెషన్లు మళ్లీ నిలబడి మ్యాచ్‌ను కాపాడుకోవడం లంకకు సాధ్యం కాకపోవచ్చు.
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక జట్టు పోరాటం కొనసాగుతోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగిన ఆ జట్టు... భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా చాలా దూరంలోనే నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దినేశ్ చండిమాల్ (341 బంతుల్లో 147 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్), ఏంజెలో మాథ్యూస్ (268 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు దక్కగా... షమీ, జడేజా, ఇషాంత్ తలా 2 వికెట్లు తీశారు.
అతి జాగ్రత్తగా...
ఓవర్‌నైట్ స్కోరు 131/3తో సోమవారం ఆట కొనసాగించిన శ్రీలంక తొలి సెషన్‌లో చాలా జాగ్రత్తగా ఆడింది. పరుగులు చేయడంకంటే వికెట్ కోల్పోకుండా ఉండటంపైనే దృష్టి పెట్టింది. అయితే ఈ క్రమంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాథ్యూస్, చండిమాల్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో బ్యాట్‌ను తాకిన బంతులు ఫీల్డర్లు, కీపర్‌కు అతి సమీపంలో పడ్డా అదృష్టవశాత్తూ సమస్య రాలేదు. ఓపిగ్గా ఆడిన చండిమాల్ 145 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లంక సెషన్ ముగించగలిగింది.
కొనసాగిన జోరు...
లంచ్ అనంతరం చండిమాల్ 55 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ అవుట్ కోసం భారత్ రివ్యూ కోరి ఫలితం దక్కకపోవడంతో దానిని కోల్పోయింది. కొద్దిసేపటికి ఇషాంత్ బౌలింగ్‌లో ఫోర్‌తో 231 బంతుల్లో మాథ్యూస్ తన కెరీర్‌లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత అతను శతకం సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత జట్టులో అసహనాన్ని పెంచింది. బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు ప్రయత్నించి ఈ జోడీని విడదీయడంలో విఫలం కాగా, లంక బ్యాట్స్‌మెన్ చకచకా పరుగులు జత చేస్తూ పోయారు. ఎట్టకేలకు అశ్విన్ భారత్‌కు ఆనందం పంచాడు. టీ విరామానికి ముందు చక్కటి బంతితో మాథ్యూస్‌ను వెనక్కి పంపి భారీ భాగస్వామ్యానికి తెర దించాడు.
టపటపా...
బ్రేక్ తర్వాత సమరవిక్రమ (61 బంతుల్లో 33; 7 ఫోర్లు) కొద్ది సేపు చండిమాల్‌కు సహకరించాడు. అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్‌తో టెస్టుల్లో చండిమాల్ పదో సెంచరీ పూర్తయింది. ఈ జోడి కూడా నిలదొక్కుకొని భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్న సమయంలో ఇషాంత్ చక్కటి బంతితో సమరవిక్రమ ఆట ముగించాడు. కీపర్ సాహా అంతే అద్భుతంగా ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో 61 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. అంతే... ఆ తర్వాత లంక పతనం వేగంగా సాగింది. ఒక వైపు చండిమాల్ నిలబడినా, మరో ఎండ్‌లో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న రోషన్ సిల్వా (0), డిక్‌వెలా (0), లక్మల్ (5), గమగే (1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయానికి ఐదు నిమిషాల ముందే ఆట నిలిచిపోగా, లంక చివరి వికెట్ పడగొట్టడంలో భారత్ విఫలమైంది.
►10 చండిమాల్ కెరీర్‌లో ఇది పదో సెంచరీ కాగా... తక్కువ ఇన్నింగ్స్‌లలో (80) ఈ ఘనత సాధించిన లంక ఆటగాడిగా అతను నిలిచాడు.
►476 చండిమాల్, మాథ్యూస్ తమ భాగస్వామ్యంలో కలిసి ఎదుర్కొన్న బంతులు. గత ఐదేళ్లలో భారత గడ్డపై సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన జోడి ఇదే.
► 1981భారత్‌లో జరిగిన టెస్టులో విదేశీ జట్టు ఆటగాళ్లు ఇద్దరు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 1981 తర్వాత ఇదే మొదటిసారి. నాడు బాయ్‌కాట్, క్రిస్ టవర్ (ఇంగ్లండ్) శతకాలు నమోదు చేశారు.
మళ్లీ రెండు క్యాచ్‌లు...
భారత జట్టు మళ్లీ పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చింది. మూడో రోజు రెండు సునాయాస క్యాచ్‌లు నేలపాలు చేసింది. మాథ్యూస్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇషాంత్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో క్యాచ్ అందుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు. మళ్లీ మాథ్యూస్ 104 వద్ద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్‌లో మిడాఫ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ విజయ్ శంకర్ కూడా ఇదే విధంగా క్యాచ్ వదిలేశాడు. రెండో రోజు కూడా 6 పరుగుల వద్దే అదృష్టం కలిసొచ్చిన మాథ్యూస్ చివరకు 111 పరుగులు చేయగలిగాడు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత్ దృష్టి పెట్టాల్సిన అంశాల్లో ఇదొకటని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment