
ఓవరాల్‌గా అద్భుతమైన రికార్డు. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ఓటమి లేదు. తాజా ఫామ్ ప్రకారం అయితే తిరుగులేని ప్రదర్శన. శ్రీలంకపై ఇలా అన్ని విధాలా భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే జోరులో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అందుకు తగిన అర్హత, సామర్థ్యం కూడా భారత్‌కు ఉంది. కోహ్లి నాయకత్వంలో గత రెండేళ్లలో సొంతగడ్డపై ప్రతీ జట్టును చిత్తుగా ఓడిం చిన బృందానికి లంకపై సత్తా చాటడం కష్టం కాబోదు.
దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకుండా రెండేళ్లుగా నిస్తేజంగా ఉన్న శ్రీలంక క్రికెట్‌కు ఇటీవల టెస్టుల్లో పాకిస్తాన్‌పై సాధించిన విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ గెలుపునకు, భారత్‌తో సిరీస్‌కు పోలిక లేకున్నా ఆ జట్టు ఆత్మవిశ్వాసం పెరిగిందనడంలో సందేహం లేదు. అనుభవం తక్కువగా ఉన్నా తమదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. సొంతగడ్డపై తమను చిత్తుగా ఓడించిన జట్టుకు లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం.
కోల్‌కతా: భారత్, శ్రీలంక మధ్య తక్కువ వ్యవధిలో వరుస మ్యాచ్‌లను చూస్తూ ఆసక్తి తగ్గిపోయిన క్రికెట్ అభిమానులను మరోసారి అదే పోరు పిలుస్తోంది. నిజానికి భారత గడ్డపై శ్రీలంక టెస్టులు ఆడి తొమ్మిదేళ్లు దాటినా... తరచుగా జరిగిన మ్యాచ్‌ల వల్ల ఈ సిరీస్‌కు ప్రాధాన్యత తగ్గినట్లనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్, లంక సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ చేయలేకపోయింది.
విజయ్‌కు నో చాన్స్!
గత ఆగస్టులో భారత జట్టు శ్రీలంకతోనే పల్లెకెలెలో తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. నాటి తుది జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆ ఒక్క స్థానం మినహా ఇతర ఆటగాళ్లందరూ కొనసాగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రాణించిన ధావన్, రాహుల్ స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. గాయం నుంచి కోలుకొని మురళీ విజయ్ పునరాగమనం చేసినా... అద్భుత ఆటతీరు కనబర్చిన రాహుల్‌ను తప్పించి విజయ్‌కు అవకాశం లభించడం కష్టం. ఇతర బ్యాట్స్‌మెన్‌లో పుజారా, కోహ్లి, రహానే జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించగలరు. సొంత మైదానంలో సాహా బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం కానుంది. మ్యాచ్ జరిగే పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ పాండ్యా లేకపోవడంతో షమీ, ఉమేశ్‌లతో పాటు మరో రెగ్యులర్ పేసర్‌కు చోటు ఖాయం. ఇషాంత్ రంజీ ట్రోఫీలో రాణించినా... సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో చెలరేగిన భువనేశ్వర్ కుమార్‌కే తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దాదాపుగా దూరమైన స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఈ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు మాత్రమే జట్టులో ఉండే అవకాశం ఉంది. సొంతగడ్డపై అలవోకగా వికెట్లు తీస్తూ వరుస రికార్డులు నెలకొల్పుతూ వచ్చిన అశ్విన్ దానిని కొనసాగించేందుకు ఇది మరో అవకాశం. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌కు అవకాశం ఇస్తారా లేక అదనపు బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మను ఆడిస్తారా చూడాలి. ఈ మైదానంలో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉండటం విశేషం. ఓవరాల్‌గా భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
మాథ్యూస్ రాణించేనా!
పాకిస్తాన్‌పై సిరీస్ నెగ్గిన జట్టులో కొన్ని మార్పులు జరగడంతో శ్రీలంక కూడా కొత్త బ్యాటింగ్ ఆర్డర్, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఓపెనర్ కరుణరత్నే మంచి ఫామ్‌లో ఉండగా, కెరీర్‌లో ఒకే ఒక టెస్టు ఆడిన సమరవిక్రమ రెండో ఓపెనర్‌గా తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ధనంజయ డి సిల్వా, చండిమాల్‌లపై లంక బ్యాటింగ్ ఆధారపడుతోంది. అయితే ఆ జట్టు విజయావకాశాలు మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉన్నాయి. తన స్థాయికి తగినట్లుగా ఇప్పుడైనా అతను మంచి ప్రదర్శన కనబర్చాలని లంక కోరుకుంటోంది. మాథ్యూస్ నాలుగో స్థానంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. పాక్‌తో సిరీస్‌లో లంక ఐదుగురు బౌలర్లతో ఆడినా యూఏఈలో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నం. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడిస్తుందా లేక ఆల్ రౌండర్ షనకకు అవకాశం ఇస్తుందా చూడాలి. ఆఫ్ స్పిన్నర్ దిల్‌రువాన్ పెరీరా భారత బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం నియంత్రించగలడనేది ఆసక్తికరం. లంక బౌలింగ్ ఆశలు మరోసారి సీనియర్ రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. హెరాత్‌కు భారత్‌పై గొప్ప రికార్డు లేకపోయినా... అతని అనుభవం కీలకం కానుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అతను ప్రమాదకరంగా మారగలడు. మొత్తంగా భారత్‌ను ఢీకొట్టే వనరులు లేకపోయినా ఆ జట్టు సంచలనం సృష్టించాలని పట్టుదలగా ఉంది.
► 0 భారత్‌లో ఆడిన 17 టెస్టుల్లో శ్రీలంక ఒక్కటి కూడా గెలవలేదు. 10 ఓడిన ఆ జట్టు మరో 7 డ్రా చేసుకుంది.
► 8 మరో ఎనిమిది వికెట్లు తీస్తే అశ్విన్ కెరీర్‌లో 300 వికెట్లు పూర్తవుతాయి.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్/కుల్దీప్, సాహా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్‌వెలా, తిరిమన్నె/షనక, దిల్‌రువాన్ పెరీరా, లక్మల్, హెరాత్, గమగే/విశ్వ ఫెర్నాండో.
పిచ్, వాతావరణం
స్పిన్ పిచ్‌తో ప్రత్యర్థిని పడగొట్టాలని కాకుండా ఈసారి భారత మేనేజ్‌మెంట్ కూడా పేస్‌కు అనుకూలించే వికెట్‌ను కోరుకోవడం విశేషం. బుధవారం కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ రోజుల్లో పిచ్ పొడిబారే అవకాశం కూడా లేదు. ఏకపక్షంగా సాగకుండా బంతికి, బ్యాట్‌కు ఆసక్తికర సమరం జరగవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం మూడు రోజుల పాటు వరుసగా వర్షసూచన ఉంది.
► ఉదయం గం 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment