రాహుల్, ధావన్, మలింగ
భారత్–శ్రీలంక మధ్య ఇటీవల జరిగిన ఏకపక్ష మ్యాచ్‌ల జాబితాలో మరొకటి చేరింది. ఒక అంకెను అదనంగా చేర్చడం మినహా ఏమాత్రం ప్రాధాన్యత లేని విధంగా ఈ పోరు కనిపించింది. రెండు జట్లు గెలుపు కోసం తలపడుతున్నట్లు కాకుండా ఒక టీమ్ ఆడుకుంటుంటే మరో టీమ్ మొక్కుబడిగా అందులో భాగమైనట్లుగానే అనిపించింది. అందరూ ఊహించిన విధంగానే టీమిండియా బలం ముందు లంక నిలవలేకపోయింది.
ఫలితంగా ఎలాంటి శ్రమ లేకుండా కోహ్లి సేన ఖాతాలో విజయం చేరింది. ముందు బౌలింగ్‌తో కట్టడి చేసి ఆ తర్వాత సునాయాసంగా భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన యువ పేసర్ నవదీప్ సైనీ ఆకట్టుకోగా, పునరాగమనం తర్వాత తొలి మ్యాచ్‌లో బుమ్రా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో
ధావన్ తడబాటు కూడా స్పష్టంగా కనిపించింది.
ఇండోర్: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 34; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శార్దుల్ ఠాకూర్‌కు 3 వికెట్లు దక్కగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవదీప్ సైనీ 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ ఆడుతూ పాడుతూ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు), కోహ్లి (17 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) తలా ఓ చేయి వేశారు. చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం పుణేలో జరుగుతుంది.
సమష్టి వైఫల్యం...
కుశాల్ పెరీరా ఆట మినహా శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఎలాంటి చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (16 బంతుల్లో 22; 5 ఫోర్లు), గుణతిలక (20) జోడించిన 38 పరుగులే (29 బంతుల్లో) ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. సుందర్ తన తొలి ఓవర్లోనే ఈ జోడీని విడదీయగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48 పరుగులకు చేరింది. సైనీ అద్భుత బంతికి గుణతిలక వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లో ఉన్నంత సేపు కుశాల్ మాత్రమే కొద్దిగా దూకుడు కనబర్చాడు.
కుల్దీప్ బౌలింగ్‌లో రెండు, సుందర్ ఓవర్లో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. అయితే కుల్దీప్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో కుశాల్ కథ ముగిసింది. ఆ తర్వాత వచి్చన బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా నిలవలేకపోయారు. 45 పరుగుల వ్యవధిలో లంక తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది. శార్దుల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ అవుట్ కాగా... బుమ్రా వేసిన 20వ ఓవర్ చివరి 3 బంతుల్లో ధనంజయ 3 ఫోర్లు బాదడంతో స్కోరు 140 పరుగులు దాటింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నవదీప్ సైనీ
అలవోకగా...
లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు రాహుల్, ధావన్ తొలి వికెట్‌కు 55 బంతుల్లో 71 పరుగులు జోడించి భారత్ పరిస్థితి సులువు చేశారు. ధావన్ నెమ్మదిగా ఆడగా, రాహుల్ చూడచక్కటి షాట్లతో అలరించాడు. మలింగ, లాహిరు కుమార ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే లెగ్‌స్పిన్నర్ హసరంగ గుగ్లీని ఆడటంలో విఫలమైన రాహుల్ క్లీన్»ౌల్డయ్యాడు. హసరంగ తర్వాతి ఓవర్లోనే ధావన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా, శ్రీలంక రివ్యూ కోరి ఫలితం సాధించింది. ఆ తర్వాత అయ్యర్, కోహ్లి జట్టును విజయం దిశగా నడిపించారు. హసరంగ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో అయ్యర్ చెలరేగగా... మలింగ వేసిన తర్వాతి ఓవర్లో కోహ్లి ఫోర్, సిక్స్ బాదాడు. లాహిరు వేసిన తర్వాతి ఓవర్లో అయ్యర్ అవుటైనా... కోహ్లి భారీ సిక్సర్‌తో మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించాడు.
మా జట్టు అన్ని విధాలుగా బాగా ఆడింది. ప్రతీ సిరీస్‌లో ఇది కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ సారి మరికొన్ని అంశాల్లో మా ప్రదర్శన మెరుగైంది. నవదీప్ బౌలింగ్ ఎంతో బాగుంది. బుమ్రా పునరాగమనం చేయడం సంతోషకరం. అందుబాటులో ఉన్న నాణ్యమైన పేసర్లలో ఎవరిని ఎంచుకోవాలనేది కీలకం. ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటం వల్లే జడేజాకు బదులు సుందర్‌కు అవకాశం కల్పించాం. ఇది నిజానికి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్. కనీసం 175 పరుగులు చేయవచ్చు. అలాంటిచోట వారు చెలరేగిపోకుండా, క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ స్కోరు సాధించకుండా కట్టడి చేయగలిగాం. అవసరమైన సమయంలో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని భావించే మూడో స్థానంలో నేను వెళ్లకుండా అయ్యర్‌ను పంపించాను. జట్టు కోసం నేను నాలుగో స్థానంలో ఆడగలను.
అదే సమయంలో కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం కూడా ముఖ్యం.
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (బి) సైనీ 20; అవిష్క ఫెర్నాండో (సి) సైనీ (బి) సుందర్ 22; కుశాల్ పెరీరా (సి) ధావన్ (బి) కుల్దీప్ 34; ఒషాడా ఫెర్నాండో (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 10; రాజపక్స (సి) పంత్ (బి) సైనీ 9; షనక (బి) బుమ్రా 7; ధనంజయ డి సిల్వ (సి) శివమ్ దూబే (బి) శార్దుల్ 17; హసరంగ (నాటౌట్) 16; ఉడాన (సి) సైనీ (బి) శార్దుల్ 1; మలింగ (సి) కుల్దీప్ (బి) శార్దుల్ 0; లాహిరు కుమార (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–38; 2–54; 3–82; 4–97; 5–104; 6–117; 7–128; 8–130; 9–130.
బౌలింగ్: బుమ్రా 4–0–32–1; శార్దుల్ ఠాకూర్ 4–0–23–3; సైనీ 4–0–18–2; వాషింగ్టన్ సుందర్ 4–0–29–1; కుల్దీప్ 4–0–38–2.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) హసరంగ 45; ధావన్ (ఎల్బీ) (బి) హసరంగ 32; అయ్యర్ (సి) షనక (బి) కుమార 34; కోహ్లి (నాటౌట్) 30; పంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1–71; 2–86; 3–137.
బౌలింగ్: మలింగ 4–0–41–0; లాహిరు కుమార 3.3–0–30–1; ధనంజయ డి సిల్వా 2–0–15–0; షనక 4–0–26–0; హసరంగ 4–0–30–2.
►1 అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 2633 పరుగులతో కోహ్లి, రోహిత్ శర్మ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లి 2663 పరుగులతో ఒంటరిగా అగ్రస్థానంలోకి వెళ్లాడు.
►1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యజువేంద్ర చహల్, అశ్విన్‌ల సరసన జస్‌ప్రీత్ బుమ్రా చేరాడు. ప్రస్తుతం ఈ ముగ్గురి ఖాతాలో 52 వికెట్లు చొప్పున ఉన్నాయి.
►1 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు 125 టి20 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక 62 మ్యాచ్‌ల్లో ఓడింది. వెస్టిండీస్ 61 ఓటములతో రెండో స్థానంలో, బంగ్లాదేశ్ 60 పరాజయాలతో మూడో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment