తొలి పరీక్షకు సై! | India Ready For T20 Series Against Sri Lanka | Sakshi
Sakshi News home page

తొలి పరీక్షకు సై!

Published Sat, Jan 4 2020 1:46 AM | Last Updated on Sat, Jan 4 2020 12:38 PM

India Ready For T20 Series Against Sri Lanka - Sakshi

ఒక ప్రపంచకప్‌ (వన్డే) ఏడాది ముగిసింది. మరో ప్రపంచకప్‌ (టి20) సంవత్సరం మొదలైంది. అదే పొట్టి కప్‌! చిత్రంగా టీమిండియా ఆట కూడా పొట్టి పొట్టి మ్యాచ్‌లతోనే ప్రారంభవుతోంది. తలపడేందుకోసం ఇప్పటికే శ్రీలంక జట్టు వచి్చంది. భారత్‌ కూడా తేల్చుకునేందుకు సిద్ధమైంది. సీనియర్లు ఒకరిద్దరు లేకపోయినా... ఐపీఎల్‌ పుణ్యమాని మెరుపు వీరులేం తక్కువలేరు భారత జట్టులో! ఆడి గెలిచేందుకు, మెగా ఈవెంట్‌ కోసం అన్ని మెట్లు విజయవంతంగా ఎక్కేందుకు భారత్‌ రెడీ అయ్యింది.  

సాక్షి క్రీడా విభాగం
ఈ ఏడాది శుభారంభం చేసేందుకు... ఈ వరల్డ్‌కప్‌ కప్‌ సంవత్సరంలో ముందడుగు వేసేందుకు భారత్‌ సిద్ధమైంది. సారథి విరాట్‌ కోహ్లి... టీమిండియా సూపర్‌ ఫామ్‌తో సమరానికి సై అంటుండగా... శ్రీలంక మాత్రం ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను 0–3తో వైట్‌వాష్‌ అయివచ్చింది. భారత్‌ ధాటిని, మెరుపుల్ని తట్టుకుంటుందేమో చూడాలంటే ఇంకో రోజు ఆగితే సరిపోతుంది. ఆదివారం నుంచి 2020లో భారత్‌ తొలి ఆట మొదలవుతుంది. గత దశాబ్ద కాలంగా ఈ పొరుగు జట్లు పొట్టి మ్యాచ్‌లు భలేగా ఆడుతున్నప్పటికీ సిరీస్‌ను ప్రతిసారీ భారతే గెలుచుకుంది. లంకనేమో అప్పుడప్పుడు మ్యాచ్‌ విజయాలతో సరిపెట్టుకుంది. లంకలోనైనా, భారత్‌లో ఆడినా... ప్రతిసారీ పైచేయి టీమిండియాదే! దీనికి ఐపీఎల్‌ కారణం కావొచ్చు... లేదంటే మన కుర్రాళ్ల ధనాధన్‌ పవర్‌ కావొచ్చు... కారణం ఏదైనా లంకకు పరాజయం తప్పలేదు.  

ఎక్కడైనా జయమే...
ప్రత్యేకించి శ్రీలంకపై టి20ల్లో భారత్‌కు ఎదురేలేని రికార్డుంది. 2009 నుంచి సుమారు 11 ఏళ్లుగా టీమిండియా ఒకటే మ్యాచ్‌ (ఆయా పర్యటనల్లో) ఆడితే గెలిచింది. రెండు ఆడితే సమం చేసుకుంది. కానీ మూడు ఆడితే మాత్రం లంకకే మూడింది. ఇన్నేళ్లలో 3 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లు నాలుగు ఆడితే ఆ నాలుగూ భారత్‌ ఖాతాలోనే ఉన్నాయి. వేదిక భారతైనా... లేదంటే లంకైనా టీమిండియా తిరుగులేని ఆధిపత్యం సంపాదించింది. ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు టి20 ప్రపంచకప్, ఆసియా కప్‌లలో ఇరు జట్లు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. ఏడింటిలో మాత్రమే లంకను విజయం వరించింది. ఈ లెక్క చాలు భారత్‌ ఈ ఫార్మాట్‌లో ఎంత పటిష్టంగా ఉందో తెలియడానికి! ముందు బ్యాటింగ్‌ కంటే ప్రత్యర్థి 200 పైచిలుకు పరుగులు చేసినా కోహ్లి సేన  అలవోకగా ఛేదిస్తున్న సంగతి తెలిసిందే.

మొదట బ్యాటింగ్‌ చేస్తే...
పొట్టి ఫార్మాట్‌లో లంకపై అమోఘమైన రికార్డు ఉన్నప్పటికీ టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసినపుడు చతికిలబడుతోంది. ఈ విషయాన్ని కెపె్టన్‌ కోహ్లి కూడా అంగీకరించాడు. ముందు బ్యాటింగ్‌ చేసే సమయంలో తాము మెరుగవ్వాలని ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా వ్యాఖ్యానించాడు. నిజమే... ఛేదనలో భారత్‌ మంచినీళ్ల ప్రాయంగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఎంతటి భారీ స్కోర్లయినా ‘ఉఫ్‌’ అని ఉదేసినట్లుగా రఫ్పాడిస్తోంది. చేయాల్సిన రన్‌రేట్‌ సమయంలో భారత ఆటగాళ్లు ఒకరిని మించి ఒకరు దంచి కొడుతున్నారు. అదే ముందు బ్యాటింగ్‌ చేస్తే మాత్రం ఆ ధనాధన్‌ తక్కువై పరాజయాన్ని పలుకరిస్తోంది.  
బుమ్రాకు కొత్త సవాల్‌...

భారత మేటి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టులోకి రావడం బౌలింగ్‌ దళాన్ని పటిష్టం చేసింది. అయితే ఇతను పునరాగమనంతో కొత్త సవాల్‌కు సిద్ధమయ్యాడు. సీనియర్లు భువనేశ్వర్, షమీలతో బంతిని పంచుకునే బుమ్రా ఈ సిరీస్‌లో మాత్రం నవవ్‌దీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌లతో పంచుకుంటాడు. భువీ, దీపక్‌ చాహర్‌లు గాయాలతో జట్టుకు దూరం కాగా... షమీకి విశ్రాంతినివ్వడంతో బుమ్రానే ఇప్పుడు భారత బౌలింగ్‌ను నడిపించాల్సి ఉంది. ఇతనితో సైనీ, శార్దుల్‌ల సమన్వయం కుదిరితే వరల్డ్‌కప్‌ ఏడాది భారత్‌కు తప్పకుండా సానుకూలాంశమే అవుతుంది.

ధావన్‌పైనే అందరి కళ్లు...
గాయాలు, వైఫల్యాలతో గత ఏడాది పూర్తిగా నిరుత్సాహపరిచిన ఓపెనర్‌ ధావన్‌కు ఇది ఒక రకంగా పరీక్షనే చెప్పాలి. ఇతని స్థానంలో టెస్టుల్లో వచి్చన మయాంక్, టి20లో  రాహుల్‌ అద్భుతంగా రాణించారు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించు కున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన పొట్టి సిరీస్‌లో రాహుల్‌ నిలకడగా ప్రతీమ్యాచ్‌లోనూ దంచేశాడు. మరోవైపు ధావన్‌ గత 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. ఇపుడు రోహిత్‌కు విశ్రాంతినిచ్చిన ఈ సిరీస్‌లో శిఖర్‌ మెరిపించాల్సిన అవసరమొచ్చింది. ఆ తర్వాత మిగతా పనిని చక్కబెట్టేందుకు కెపె్టన్‌ కోహ్లితో పాటు  పంత్, శ్రేయస్‌ ఉండనే ఉన్నారు. అయితే జట్టులోకి ఎంపికైనా ఆడే అవకాశం అందుకోలేకపోతున్న సంజూ సామ్సన్‌ ఈ సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

షెడ్యూల్‌
జనవరి 5: తొలి టి20 (గువాహటి)
జనవరి 7: రెండో టి20 (ఇండోర్‌)
జనవరి 10: మూడో టి20 (పుణే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement